డయల్ యువర్ జేసీ అర్జీలపై సత్వర చర్యలు
- 104 Views
- wadminw
- September 3, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 3 (న్యూస్టైమ్): డయల్ యువర్ జేసి కార్యక్రమంలోవచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యన్నారాయణ తెలిపారు. శనివారం ఉదయం కలక్టరేట్ నుండి డయల్ యువర్ జేసి కార్యక్రమం ఆయన నిర్వహించగా, సుమారు 18 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో భూ సర్వే, రేషన్ కార్డులు, రోడ్లు, కరెంట్ తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. డయల్ యువర్ జేసి కార్యక్రమాన్ని 90.8 రేడియో అలా మన ఊరు- మన రేడియో నెట్వర్క్ ద్వారా లైవ్ ప్రసారం చేయబడుతుందని, ఫిర్యాదుదారు పేరు, ఊరు పేరు, ఆధార్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు తెలియజేసి ఫిర్యాదు చెప్పాలన్నారు.
వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిష్కరించి, వాటికి సమాధానాలు అందజేస్తారని, ఆయన తెలిపారు. అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామం నుండి రాజారావు మాట్లాడుతూ పెద్దింటి వారి పాలెంలోపంచాయతీ స్ధలాన్ని ఆక్రమించుకుని, వాడుకుంటున్నారని తెలుపగా, తహశిల్దార్, ఎంపిడిఓకు చెప్పి తగు చర్యలు చేపడతామన్నారు. కొత్తపేట మండలం బిళ్లకుర్రు నుండి గొలకోటి విష్టుమోహన్రావు మాట్లాడుతూ తన భూమి సర్వే నెంబర్ 282/4 ఆన్లైన్ లో నమోదు చేయాల్సిందిగా దరఖాస్తు చేశామని, దరఖాస్తుకు సర్వేనెం, డాక్యుమెంట్లు సమర్పించామని, ఇప్పటి వరకూ ఆన్లైన్ లో నమోదు కాలేదని తెలుపగా తహశిల్దార్కు చెప్పి నమోదు చేయిస్తానన్నారు.
తాళ్లరేవు మండలం పి.మల్లవరం నుండి బొంతు శ్యామలా దేవి మాట్లాడుతూ ఇళ్ల స్ధలం ఇచ్చారుగాని, పట్టా ఇవ్వలేదని, ఆ స్ధలంలో పాక వేసుకుంటే , పాక తీసి వేశారని తెలుపగా, పరిశీలించి, తదుపరి చర్యలు చేపట్టాలని సంబంధిత తహశిల్దార్ను జేసి ఆదేశించారు. సఖినేటిపల్లి మండలం శృంగవరప్పాడు నుండి నర్శింహారావు మాట్లాడుతూ చౌకధర దుకాణం నెంబర్ 30 లోపోర్టబులిటీ లేదని తెలుపగా, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిఎస్ఓకు ఆదేశించారు. పెద్దాపురం నుండి పి.నూకయ్య బాబు మాట్లాడుతూ గత అక్టోబర్ నెల నుండి పింఛను రాలేదని తెలుపగా, డిఆర్డిఏ పిడిని తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు.
కడియం నుండి దొరబాబు మాట్లాడుతూ బైరాగి దమయంతి, భర్త గోవిందు రేషన్ ఆగి పోయిందని తెలుపగా, 10వ తేదీ తరువాత డిఎస్ఓ వద్దకు వస్తే కార్డు పునరుద్దరిస్తారన్నారు. ప్రత్తిపాడు నుండి పట్టాభి రాజు మాట్లాడుతూ రేషన్రాలేదని తెలుపగా, 10వ తేదీ తరువాత కార్డు పట్టుకుని తహశిల్దార్ వద్దకు గానీ, డిఎస్ఓ వద్దకు గానీ తీసుకు వస్తే పరిశీలించి కార్డులను పునరుద్దరిస్తారన్నారు. కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం నుండి వీర్రాజు మాట్లాడుతూ కరెంట్ సమస్య ఎక్కువగా ఉందని కరెంటు వచ్చి పోతోందని, గంట సేపు కూడా ఉండడం లేదని తెలుపగా, ఎస్ఇ ట్రాన్స్కో చెప్పి పరిష్కరిస్తామన్నారు.
యు.కొత్తపల్లి మండలం యండపల్లి నుండి పండ్రవాడ వెంకట రమణ మాట్లాడుతూ సర్వే నెంబరు 367/2లో తన 2.96 ఎకరాల భూమిని పంట కాల్వ క్రింద భూమిగా చూపిస్తున్నారని, జిరాతీ భూమి అని ఎన్ఓసి కావాలని అడుగగా, తహశిల్దార్కు దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఉమామహేశ్వరరావు, డిఎం ఏ.కృష్ణారావు, ఆంధ్రాబ్యాంక్ ఎల్డిఎం , సర్వే ఏడి నూతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


