తల్లిదండ్రుల ఆత్మహత్య
కరీంనగర్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురే తమను కాదనుకుందని తల్లడిల్లిపోయారా తల్లిదండ్రులు. పెద్ద చదువులు చదివి తమ పెద్దరికాన్ని నిలబెడుతుందనుకుంటే కలలు కల్లలు చేసిందనుకుని విలవిల్లాడారు. అల్లారుముద్దుగా చూసుకున్న బంగారు తల్లి మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వారికి మింగుడుపడలేదు. కలత చెందిన వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆమెకు జీవితకాలం గుర్తుండే శిక్ష విధించారు. కూతరుపై ఎన్నో ఆశలు పెంచుకన్న తల్లిదండ్రులు ఆమె ప్రేమ వివాహం చేసుకోవడంతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. కమాన్‌పూర్ మండలం కల్వచర్లలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. కమాన్‌పూర్ ఎస్సై ఆది మధుసూదన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒర్రె పర్వతాలు(56) ఆర్జీ–3 డివిజన్ పదో గనిలో సపోర్టుమెన్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య ఒర్రె లక్ష్మి (ఐలక్క) (50) స్థానికంగా కిరాణం షాపు నిర్వహిస్తోంది. వారి కుమారుడు శ్రావణ్‌కుమార్ హైదరాబాద్‌లో ప్రెవేట్ ఉద్యోగం చేస్తుండగా కూతురు శ్వేత (19) హైదరాబాద్‌లోనే అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిన శ్వేత రెండ్రోజుల క్రితం అతడిని వివాహం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తీవ్రమనస్థాపానికి గురై బుధవారం రాత్రి తమ ఇంట్లో క్రిమిసంహారక మందు తాగారు. లక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది. పర్వతాలును స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. అందరితో కలివిడిగా ఉండే వారి హఠాన్మరణంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. వారి కుమారుడు శ్రావణ్ ఫిర్యాదు మేరకు ఎస్సై మధుసూదన్‌రావ్ కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి వచ్చి సానుభూతి వ్యక్తంచేశారు.
పెరుగుతున్న పంట నష్టం
కరీంనగర్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం రోజురోజుకూ పెరిగిపోతుంది. నిల్వ నీరు తొలగిపోవడంతో వ్యవసాయాధికారుల సర్వేలో దెబ్బతిన్న పంటలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు 20 మండలాల్లో 1,212 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏ రోజుకారోజు ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. 660 ఎకరాల్లో వరి, 160 ఎకరాల్లో మొక్కజొన్న, 392 ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయని గుర్తించారు. కరీంనగర్, మల్యాల, బోయినిపల్లి, కమలాపూర్, హుస్నాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, చందుర్తి, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం, మహదేవపూర్, కాటారం, మంథని, కోరుట్ల, మల్లాపూర్ మండలాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని గుర్తించారు. కాగా, సర్వే ఇంకా పూర్తి కాలేదు. పంటలు కోత దశకు రాకముందే పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పంటలను గుర్తించి నివేదించేందుకు వ్యవసాయశాఖాధికారులు వేగం పెంచారు. వర్షాధార పంటల్లో నష్టపోయిన పంటలకు సర్కారిచ్చే పరిహారం కింద వరికి హెక్టారుకు రూ.13,500, మొక్కజొన్నకు రూ.8,333, పత్తికి రూ.6,800 చొప్పున ఇస్తారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు దెబ్బతిన్న 1,212 ఎకరాలకు రూ.51.64 లక్షల మేర నష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఇంకా తుది నివేదిక పూర్తికాలేదని, సర్వే కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
విశ్వవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు
కరీంనగర్, సెప్టెంబర్ 30 (న్యూస్‌టైమ్): విశ్వవ్యాప్తంగా తెలంగాణ ఆచార సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు నిర్వహించడమే తన ధ్యేయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. యూఏఈలోని ఉమల్కోయిన్లోని ఇండియన్ అసోసియేషన్ హాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలను శుక్రవారం ప్రారంభించారు. బతుకమ్మ పండగను విశ్వవ్యాప్తం చేసేంతవరకు ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఖండాంతరాల్లో బతుకమ్మ పండగ ప్రారంభోత్సవంలో పాల్గొనడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్ఆర్ఐలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నారన్నారు. యూఏఈలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు మూడు వేల మంది హాజరై బతుకమ్మ పండగలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ప్రతినిధి దీప జయంత్, ఉమల్ కోయిల్ ఇండియన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బషీర్, ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్‌కుమార్, సభ్యులు అరవిందబాబు, సత్యనారాయణ, సాయిచంద్, శ్రీనివాస్, సురేందర్, శేఖర్, నరేశ్, జగదీశ్, భరత్ పాల్గొన్నారు.


