తాత్కాలిక సచివాలయానికి వాస్త దోషం!
నవ్యాంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో అప్పుడే మరమ్మతులు చేస్తున్నారు. మంత్రుల కార్యాలయాలు సరిపోవడం లేదని కొన్ని వాస్తు సరిగా లేదని మరికొన్నింటికి మరమ్మతులు చేస్తున్నారు. మొదట కట్టిన భవనానికి అప్పుడే మరమ్మతులు చేయడం పట్ల ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీని పరిస్థితే ఇలా ఉంటే భవిష్యత్‌లో కట్టబోయే రాజధాని పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహం వెలిబుచ్చుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెలగపూడిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి అప్పుడే మరమ్మతులు చేస్తున్నారు. మంత్రుల చాంబర్లు చిన్నగా ఉండడమో లేక వాస్తు సరిగా లేవనే కారణంతో ఈ మరమ్మతులు చేస్తున్నారు.
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ పనులు జూన్ నెలాఖరుకే పూర్తి కావాల్సి ఉన్నప్పటికి ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు అన్ని శాఖల ఉద్యోగులు సచివాలయానికి తరలివస్తున్నారు. ఇప్పటికే 5వ బ్లాక్‌లో మంత్రుల కార్యాలయాలు ప్రారంభించారు. అయితే అందులో లోపాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మంత్రుల కార్యాలయాలు తక్కువ విస్తీర్ణంలో నిర్మించడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు మంత్రుల కార్యాలయాలకు వాస్తు కూడా సరిగా లేదనే కారణంతో స్వల్ప మార్పులు చేస్తున్నారు.
ఇదిలావుంటే ఇప్పటికే మిగతా బ్లాక్‌ల నిర్మాణాలు కూడా పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అవి నత్తనడకనే కొనసాగుతున్నాయన్న ఆరోపణలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. పూర్తి చేసిన ఐదో బ్లాక్‌లో కూడా మళ్లీ మరమ్మతులు చేపట్టడాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. హడావుడిగా పనులు చేసి ఇప్పుడు మరమ్మతులు చేపట్టడం వల్ల ప్రజల సొమ్ము దుర్వినియోగమవుతుందని ఆరోపిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మొదటి కట్టడమే ఇలా ఉంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా నిర్మిస్తామన్న రాజధాని ఎలా ఉంటుందోనన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు హడావుడిగా పనులు చేయించకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. మరోవైపు, అమరావతిలో కీలక శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఊపందుకుంది.
తాజాగా వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యాలయాన్ని మంత్రి యనమల ఆవిష్కరించారు. న్యాయ శాఖ కార్యాలయంతో పాటు సాంఘిక, గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శుల చాంబర్లను సంబంధిత మంత్రులు, కార్యదర్శులు ప్రారంభించారు. కొత్త రాజధాని అమరావతి నుంచే పరిపాలన సాగించేందుకు ఏపీ సర్కార్ వేగం పెంచింది. ఓవైపు కీలక శాఖల ఆవిష్కరణ మరోవైపు ఉద్యోగుల తరలివస్తుండటంతో వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సందడి నెలకొంది. రెండవ బ్లాక్ మొదటి అంతస్థులో ఆర్ధిక శాఖ కార్యాలయాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. దీంతో పాటు ఆర్ధిక శాఖలో భాగంగా ఉన్న పరిశ్రమలు, ప్రణాళిక శాఖల ముఖ్య కార్యదర్శుల ఛాంబర్లును మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ, చీఫ్ సెక్రటరీ ఎస్. పి. టక్కర్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
సాంప్రదాయ బద్దంగా పూజా కార్యక్రమాలతో 9 గంటల 21 నిమిషాలకు మంత్రి తన ఛాంబర్లోకి ప్రవేశించారు. నూతన సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యలయాన్ని ప్రారంభించడంపై మంత్రి యనమల హర్షం వ్యక్తం చేశారు. గతేడాది 10.99 ఆర్థిక వృద్ధి రేటు సాధించామని, వచ్చే ఏడాది అన్ని శాఖల మంత్రులు, అధికారుల సహకారంతో 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు కృషి చేయాలని కోరారు. తాత్కాలిక సచివాలయానికి ఇప్పటికే 200 కోట్లు కేటాయించామని, మరో 400 కోట్లు త్వరలోనే విడుదల చేస్తామన్నారు. తాత్కాలిక సచివాలయంలోని మొదటి భ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో న్యాయ శాఖ కార్యాలయాన్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దుర్గాప్రసాద్ ప్రారంభించారు.
మూడో బ్లాక్ మొదటి అంతస్థులో సాంఘిక, గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శుల చాంబర్లను ఆ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు కృషి, పట్టుదలకు నిదర్శనమే తాత్కాలిక సచివాలయమని మంత్రి రావెల అన్నారు. తాత్కాలిక సచివాలయంలో కార్యాలయాలు ప్రారంభించిన మంత్రులకు టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.


