తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
- 109 Views
- wadminw
- September 5, 2016
- తాజా వార్తలు
తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోండగా కాలినడక భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోందని తితితే అధికారులు సోమవారం సాయంత్రం ఇక్కడ ప్రకటించారు. కాగా, ఆది వరాహక్షేత్రమైన తిరుమలలో వరాహ జయంతి శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఓ అజ్ఞాత భక్తుడు భూ వరాహస్వామివారికి రెండు కిలోల బంగారంతో కవచం, ఏడు కిలోల వెండితో పద్మపీఠం, ఉత్సవమూర్తులకు రెండు కిలోల వెండి సింహాసనం కానుకగా అందించారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో పోలా భాస్కర్ వీటికి ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. కాగా, తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 14 నుంచి మూడు రోజుల పాటు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
పవిత్రోత్సవాలకు ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయంలోని గర్భాలయం గోడలను సుగంధ పరిమళ ద్రవ్యాలతో శుభ్రం చేయనున్నారు. ఉదయం 9.30 గంటల తరవాత భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. తిరుమంజనం పురస్కరించుకుని ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేశారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో ఈనెల 14 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
ఉత్సవాలకు ముందు రోజు సాయంత్రం ఆలయంలో అంకురార్పణ నిర్వహించనున్నారు. 14న పవిత్ర ప్రతిష్ఠ, 15న పవిత్ర సమర్పణ, 16న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నారు. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, వూంజల్సేవ, తిరుప్పావడ, లక్ష్మీపూజను తితిదే రద్దు చేసింది. పవిత్రోత్సవాల్లో మూడు రోజుల పాటు పాల్గొనే దంపతులు రూ.750 చెల్లిస్తే ఇద్దరిని అనుమతిస్తారు. వీరికి రెండు లడ్డూలు, రెండు వడలు కానుకగా అందజేయనున్నారు.


