‘తీరం’లో ‘తిమింగలాలు’!
- 101 Views
- wadminw
- January 2, 2017
- Home Slider రాష్ట్రీయం
విశాఖపట్నం: తీరాలు సాగరంలో కలిసిపోతున్నాయి. సైకత అందాలు అంతరించిపోతున్నాయి. మానవ అపరాధాలు, పర్యావరణ మార్పుల వలన సాగర తీరాలకు ముప్పు ముంచుకు వస్తోంది. అందరూ ఆనందంగా సేద తీరే బీచ్‌లు క్రమంగా అదృశ్యమవుతున్నాయి. ప్రకృతి సహజ సౌందర్యం అనగానే ఠక్కున గుర్తోచ్చేది విశాఖ సాగర తీరం.
ఎంతో రమణీయంగా వీక్షకులను కట్టిపేడేసే సహజమైన అందాలకు పెట్టింది పేరు విశాఖ తీర ప్రాంతం. సాగర తీరం క్రమంగా కోతకు గురవుతోంది. దీంతో విశాఖ అందాలు అంతరించిపోయే ప్రమాదం దాపురించింది. సహజమైన అందాలను కాపాడాల్సిన ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంపై నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోవా సాగర తీరం పరిరక్షణకు గత బడ్జెట్లో వందల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ తీరంపై కనీసం కన్నెత్తి కూడా చూడనేలేదు.
ఒకవైపు పర్యావరణ మార్పులు, మరోవైపు తీర ప్రాంత వనరుల దోపిడీతో బీచ్ అందాలకు ముప్పు ఏర్పడింది. ఈ ముప్పు కాస్త బీచ్‌ను అంతరింప చేసే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ తీర ప్రాంతంలోని 100 కిలోమీటర్ల పరిధిలోని బీచ్‌లు సముద్రపు కోతకు గురవడాన్ని గుర్తించవచ్చు. విశాఖకు గుండెకాయ వంటి ఆర్కే బీచ్‌తో పాటుగా రుషికొండ, పూడిమడక, భీమిలి, యారాడ వంటి సాగర తీర ప్రాంతాల్లో కూడా బీచ్ కోతకు గురవుతోంది. ఈ తీర ప్రాంతాల్లోని సముద్ర మట్టాల్లో ఇటీవల కాలంలో చాలా వ్యత్యాసం ఏర్పడుతున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీచ్‌లోని ఇసుక అక్రమంగా తరలించడం, తీరప్రాంతాలను ఆనుకోని భారీ నిర్మాణాలు చేపట్టడం, సహజసిద్ధమైన మడ అడవలను నేలకూల్చడం వంటివి సుమద్రతీర పర్యవరాణానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటుగా పర్యాటకం పేరుతో టూరిస్ట్ బోటుల సంఖ్య పెరగడంతో పలు మత్స్యజాతులు మనుగడకు కూడా ముప్పుపొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సముద్రపు కోత కారణంగానే బీచ్ క్రమంగా వెనక్కి తగ్గిపోతోందని శివాజీరావు అనే శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు.
రోజురోజుకి సముద్ర మట్టం క్రమంగా తగ్గుతుందని వివరించారు. మత్స్య జాతులు మనుగడపై ఇది తీవ్రమైన ప్రభావం చూపనుందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా సుమద్రపు నీరు 5 నుండి 10 మీటర్ల వరకు తీరం ముందుకు వస్తుందని, ప్రస్తుతం మాత్రం 30 నుండి 40 మీటర్ల మేరకు వెనక్కి వెళుతోందని వైజాగ్ వాకర్స్ క్లబ్ సభ్యుడు ఎ. సీతారామాంజనేయులు చెప్పారు. సముద్ర మట్టం క్రమంగా తగ్గితే కొన్ని రోజులకు బీచ్‌లు అంతరించిపోతాయని విశాఖలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.
‘‘ప్రతీ ఏటా డిసెంబరు నుండి మార్చి మధ్యలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో సముద్రపునీరు వెనక్కివెళ్లడం సహజం’’ అని ఓషియోనోగ్రఫీ సాంకేతిక అధికారొకరు అభిప్రాయపడ్డారు. అయితే విశాఖలోని రామకృష్ణా బీచ్‌కు, ఇతర బీచ్‌లకు మధ్య చాలా వ్యత్యాసాన్ని గమనించగలగాలని ఆయన పేర్కొన్నారు. సముద్ర మట్టం కోతకు గురికాకుండా పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. తీర ప్రాంతాలు కోతకు గురికాకుండా జియోట్యూబ్స్ వంటి వాటిని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. శాస్త్రవేత్తలు, నిపుణులు సూచనల ప్రకారం సముద్ర తీరాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పర్యాటక అభివృద్ధి విభాగ అధికారి కోరుతున్నారు.


