తూర్పు కనుమల్లో ‘అన్న’ల శకానికి ముప్పు!?
- 95 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తోంది, దున్నేవారిదే భూమి, సమసమాజం, బూర్జ్వా , పెతందారు వ్యవస్థను రూపుమాపండి, భారత రాజ్యంగం ద్వారా సామాన్య జనానికి న్యాయం జరగదు అంటూ నినాదాలు చేస్తూ సమసమాజ స్థాపన కోసం సాయుధ పోరాటం చేసిన నక్సల్బరి ఉద్యమం శకం ఇక ముగిసినట్టేనా? ఉద్యమ క్రమంలో వ్యూహాలకు పదును పెడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఏకే 47 వంటి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుని తప్పు చేసిన వారికి ప్రజాకోర్టులో శిక్షలు అమలు చేస్తూ జనతా సర్కార్ ఏర్పాటు చేసిన నక్సల్బరీ, పీపుల్స్ వార్ తాజా మావోయిస్ట్ పార్టీ దాదాపుగా తుడిచి పెట్టుకుపోయిందా?
అంటే తాజాగా ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో అవుననే చెప్పొచ్చు. ఆదివారం రాత్రి సమయంలో ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్ మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా నమోదయ్యింది. దేశ వ్యాప్తంగా కొన్ని వందల ఎన్కౌంటర్లు జరిగినా తాజా ఎన్కౌంటర్ మాత్రం మావోయిస్టు పార్టీకి కోలుకోలేనంత ఎదురుదెబ్బ అని చెప్పక తప్పదు. నిన్నటి ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు మృతి చెందగా అందులో 11 మందికి పైగా పార్టీ అగ్రనేతలు ఉన్నారు.
1992లో ఆదిలాబాద్‌లో జరిగిన మొదటి ఎన్కౌంటర్ నుంచి మొదలుకుంటే ఒక్కసారిగా 18 మందికి మించి జరిగిన చరిత్ర లేదు. మొదటగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌గా ఉన్నప్పుడు అప్పటి పీపుల్స్ వార్ వాటి అనుబంధ సంస్థలపై నిషేధం విధించారు. నాటి నుంచి జరుగుతున్న ఎరివేతకు ఒక్కసారి గమనిస్తే 1996లో ఖమ్మం జిల్లా పగిడేరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది పీపుల్స్ వార్ సభ్యులు మృతి చెందారు. వీరందరు మావోయిస్టు పార్టీ కొత్తగా చేరినవారే. అయితే ఈ ఘటనలో సీనియర్ నాయకులు చాలా మంది తృటిలో తప్పించుకున్నారు.
ఇక 1998లో ఆంధ్ర- ఒరిస్సాలో పీపుల్స్ వార్ ప్లీనరీపై పోలీసులు దాడిచేసి 17 మందిని మట్టుబెట్టారు. అందులో నలుగురు జిల్లా కమిటీ స్థాయి నాయకులు ఉన్నారు. గిరాయిపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో జనార్థన్, మురళీమోహన్ లాంటి అగ్రనేతలను పార్టీ కోల్పోయింది. ఇక అదే క్రమంలో కరీంనగర్ కొయ్యూర్‌లో ఎన్కౌంటర్లో పలువురు కీలక నాయకులను మృతి చెందారు. ఈ ఘటనలో 11 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా ఇందులో కరీంనగర్‌కు చెందిన కీలక నేతలు ఉన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌కు ప్రతికారంగా మావోయిస్టు పార్టీ తమ దాడులను ముమ్మరం చేసింది. ఆ తరువాత కౌకొండలో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు.
వీరిలో మావో అగ్రనేత సుధాకర్ కూడా ఉన్నారు. అలాగే కరీంనగర్లో 10 మంది, పాలకుర్తి లో 9 మంది, సింహాచలం కొండల్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది, వరంగల్ జిల్లా తుపాకుల గూడెంలో 13 మంది, ఖమ్మం జిల్లా పువ్వర్తిలో 11 మంది చనిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని చత్తీస్‌గడ్‌లోని సైతం మావోయిస్టు పార్టీ భారీగానే నష్టపోయింది. ఆ ప్రాంతంలోని కంచెల్లో 18 మంది, ఎర్రగుంట పాలెంలో 12 మంది, నల్లమల్లలోని సున్నిపెంటలో 11 మంది, గాజుల నర్సాపూర్‌లో 13 మంది, మానాలలో 12 మంది, ఇక మావో మహిళ అగ్రనేత పద్మక్క ను ఎన్కౌంటర్ సమయంలో మరో ఆరుగురు మావో నేతలు కూడా మృతి వాతపడ్డారు.
అయితే ఆయా ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరిద్దరు అగ్రనేతలు కూడా ఉన్నారు. అయితే గతంలోనే మావోయిస్టు పార్ట మిలటరీ వ్యూహాకర్త, కేంద్ర మిలటరీ కమిషన్ బాధ్యుడు పటేల్ సుధాకర్ రెడ్డి, ఆ తరువాత శాఖమూరి అప్పారావు, సోలిపేట కొండల రెడ్డి, ఆజాద్, వంటి వారిని కోల్పోయిన పార్టీకి తాజా ఎన్కౌంటర్ కోలుకోలేని దెబ్బ తీసింది. అయితే తాజాగా సోమవారం జరిగిన ఘటనలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్‌తో పాటు ఆయన దళం మొత్తం పూర్తిగా తడిచిపెట్టుకుపోయింది. ఇదీ పార్టీ కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా మిగిలిన పార్టీ కీలక నేతలు శాకమూరి అప్పారావు అలియాస్ ఆర్కే, నంబాల కేశవరావు అలియాస్ ఆశన్న, మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటి నేత దామోదర్ అలియాస్ జగన్ మిగిలి ఉన్నారు.
మరి వీరితో పార్టీ ఎలా ముందుకు పోతుందో చూడాలి. మరోవైపు, రెండు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా చేసిన ఎన్కౌంటర్లో అర డజను మంది అగ్రనేతలు సహా 28 మంది మావోయిస్టులు చనిపోయారు. దేశంలోనే మావోయిస్టులు భారీగా నష్టపోయిన అతి పెద్ద ఎన్కౌంటర్ ఇది. ఆంధ్రా ఒడిసా బోర్డర్లోని విశాఖ ఏజెన్సీలో ముంచంగిపుట్టు మండల కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో బూసిపుట్టు గ్రామానికి పది కిలోమీటర్ల సమీపంలోని బెజింగి గుట్టపై సోమవారం తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉదయం 6.30 గంటలకు ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పటికే పోలీసుల ఆపరేషన దాదాపు పూర్తయింది.
ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్‌కు చెందిన కానిస్టేబుల్ అబూబకర్ మరణించగా మరొక కానిస్టేబుల్ సతీశ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఆంధ్రా ఒడిసా సరిహద్దు మావోయిస్టు దళానికి ఇక కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఒకరిద్దరు మినహా అగ్రనేతలంతా ఎన్కౌంటర్లో ప్రాణాలు వదిలారు. మావోయిస్టు అగ్ర నేతలు బెజింగి గుట్టపై ప్లీనరీ నిర్వహిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీనికి భారీ సంఖ్యలో మావోయిస్టులు హాజరవుతున్నారనీ తెలిసింది. వెంటనే ఆంధ్ర, ఒడిసా రాషా్ట్రల పోలీసు ఉన్నతాధికారులు పరస్పరం చర్చించుకుని, సంయుక్తంగా దాడి చేయాలని వ్యూహం రూపొందించుకున్నారు.
పక్కా ప్రణాళికతో స్పెషల్ పార్టీ పోలీసులను ఏవోబీ సరిహద్దుల్లో మోహరించారు. బెజింగి గుట్టపై మావోయిస్టులు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో దాడి చేశారు. అర్ధరాత్రి దాటాక కాల్పులు ప్రారంభించారు. అటు నుంచి మావోయిస్టులు తేరుకొని ఎదురు కాల్పులు జరిపినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. చిమ్మ చీకట్లో దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఎన్కౌంటర్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో 17 మంది పురుషులు, ఏడుగురు మహిళల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సమీపంలోని బలిమెల రిజర్వాయర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి.
ఒక మావోయిస్టు మృతదేహాన్ని మిగిలిన మావోయిస్టులు భుజాలపై మోస్తూ తీసుకుపోయారని తెలిసింది. మావోయిస్టు అగ్ర నేత ఆర్కే కుమారుడు మున్నాతోపాటు అగ్రనేతలు చలపతి, ఆయన భార్య అరుణ, కిష్టయ్య అలియాస్ దయా, గణేశ్, అయినపర్తి దాసు అలియాస్ టెక్ మధు, స్వరూప తదితరులు మరణించారు. వారి నుంచి మూడు ఏకే 47 గనలు, ఏడు వేర్వేరు ఆయుధాలు, రెండు కిట్ బ్యాగులు, ఓ ల్యాప్‌టాప్‌తో పాటు రూ.2.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, పారిపోతున్న మావోయిస్టులను వెంబడిస్తూ వెళ్లిన కడప బెటాలియనకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూబకర్ బలిమెల రిజర్వాయర్‌లో పడి మృతి చెందాడు.
మరొక కానిస్టేబుల్ సతీశ్ కాలిలో బుల్లెట్ దిగి తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని హెలికాప్టర్లో విశాఖపట్నం తీసుకొచ్చారు. పోలీసుల మెరుపు దాడిలో భారీగా సహచరులు ప్రాణాలు కోల్పోవడంతో పగతో రగిలిపోయిన మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకోవాలని కాపు కాశారు. తెల్లవారిన తర్వాత పోలీసులు వస్తే ఎదురుదాడికి సిద్ధమయ్యారు. ఊహించినట్టుగానే పోలీసులు కూంబింగ్‌కు రావడంతో ఉదయం పది గంటల సమయంలో కాల్పులు జరిపారు. దీనిని ముందే ఊహించిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయిందీ తెలియరాలేదు. మరోవైపు, ఏవోబీలో జరిగింది ఎన్కౌంటర్ కాదని, ప్రభుత్వ మారణకాండ అని విరసం నేత వరవరరావు మంగళవారం విశాఖలో ఆరోపించారు.
మావోయిస్టులు కాల్పులు జరిపితేనే ఎదురుకాల్పులు జరిపామని పోలీసు అనటం అవాస్తవమన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను మావోయిస్టులు అడ్డుకుంటున్నారనే దాడులు చేశారని విమర్శించారు. మావోయిస్టుల మృతదేహాలను కేజీహెచ్‌కు తీసుకురావాలన్నారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని వరవరరావు డిమాండ్ చేశారు. మరోవైపు, ఏవోబీలో ఎన్‌కౌంటర్‌తో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
ముఖ్య రాజకీయనాయకులు, అధికారులకు భద్రత పెంచారు. ఎన్కౌంటర్లో 24 మంది మృతి చెందడంతో మావోలు ఏ క్షణమైనా ఎదురుదాడికి తెగపడే అవకాశాలుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉందన్న భావనతో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఏజెన్సీలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు భద్రత కల్పించారు. తాజా ఘటన నేపథ్యంలో వీరికి భధ్రతను మరింత పెంచారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు, అరకు ఎంపీ గీత, ఇటీవల టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులతోపాటు ఇతర టీడీపీ నేతలకు భద్రతను పెంచుతున్నట్టు పోలీస్ వర్గాలు ప్రకటించారుు.
నర్సీపట్నంలోని మంత్రి అయ్యన్న అతని బంధువుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే విశాఖలో మంత్రి అయ్యన్నతో పాటు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐటీడీఏ పీవో, ఓఎస్డీ తదితర ఏజెన్సీ ప్రాంత అధికారులతో పాటు కలెక్టర్, ఎస్పీలకు కూడా భద్రతను సమీక్షిస్తున్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారుల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించేలా చర్యలు చేపట్టారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో నగరానికి వచ్చిన డీజీపీ సాంబశివరావు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.


