తూ.గో. జిల్లాలో పర్యాటక పండుగల తేదీలు ఖారారు
- 86 Views
- wadminw
- January 4, 2017
- Home Slider రాష్ట్రీయం
తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్థిలో భాగంగా ఈ సంవత్సరం మూడు ప్రాంతాలలో ప్రత్యేక పర్యాటక పండుగలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సి.యం నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ పండుగల నిర్వహణ పై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కాకినాడ కలెక్టరేట్లోని విధాన గౌతమి హాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో చినరాజప్ప మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మరియు పర్యాటక రంగాన్ని జిల్లాలో అభివృద్థి మరింత విస్రృత పరచే భాగాంగ జిల్లాలో కాకినాడ బీచ్, కోనసీమ మరియు మన్యం పండుగల తేదీలు ఖారారు చేసామని, ఇక నుండి ప్రతి సంవత్సరం ఇదే తేదీలలో ఈ పండుగలు జరుగుతాయన్నారు.
కాకినాడ బీచ్ లో కాకినాడ బీచ్ ఫెస్టివల్ జనవరి 12,13,14,15 తేదీలలో సంక్రాతి సమయంలో జరుగుతాయని, అదే విధంగా కోనసీమ ఉత్సవాలు ఫిబ్రవరి 22, 23, 24, 25 తేదీలలో, ఏజెన్సీలో మన్యం ఫెస్టివల్ మార్చి 26, 27, 28 తేదీలలో నిర్వహించనున్నామని మంత్రి తెలిపారు. ఈ పండుగలు నిర్వహణకు వివిధ శాఖల అధికారులు విస్రృతమైన ఏర్పాట్లు చేయాలని, పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాలలోని పర్యటకులను ఆకట్టుకొనే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని చినరాజప్ప సూచించారు.
జిల్లాలో ఈ పర్యాటక పండుగలు గత సంవత్సరం కన్న మెరుగ్గ జరగాలని, పర్యాటకులను ఆకట్టుకొనే విధంగా ఈత,పడవ పోటీలు ఏర్పాటు చేయాలన్నారు. కాకినాడ బీచ్‌కు త్వరలో నీటిమీద భూమి మీద కూడ ప్రయణించే వాహనాన్ని సమకూర్చనున్నారని, మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కాకినాడ బీచ్ ఫెస్టెవల్ సంక్రాంతి పండుగల సమయంలో జరుగుతున్నందున, ఈ బీచ్ ఫెస్లివల్ లో విధులు నిర్వహించిన సిబ్బందికి, పండుగ తరువాత సెలవులు మంజూరు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రకృతి అందాలు బయట ప్రపంచానికి తెలిపే విధంగా ఈ పండుగలు నిర్వహిస్తున్నామని, కాకినాడలో జరిగే బీచ్ ఫెస్టివల్లో ఆక్వారంగాన్ని, మరియు పండ్లతోటల విభాగానికి ప్రాధాన్యత ఇవ్వడం, వాటర్ స్పోర్ట్సును ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో జిల్లాకు చెందిన కళాకారులను, యువతను ప్రోత్సహిస్తామని తెలిపారు. అదే విధంగా ఆలయ నమూనాలు, కూచిపూడి నాట్యప్రదర్శనలు కూడా ఉంటాయని, అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకట్టుకుంటున్న కొరంగి అభయారణ్యం ప్రాంతాన్ని ప్రత్యేక ఆకర్షణంగా నిలిపేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
కోరంగి నుండి ప్రతి రోజు హోప్ ఐలాండ్‌కు ప్రత్యేక బోట్లు ఏర్పాటు, హోప్ ఐలాండ్‌లో ఆలీవ్ టర్టిల్స్ పై పరిశోధన ఉంటాయని కలెక్టర్ తెలిపారు. బీచ్ ఫెస్టివల్లో మెగాఫుడ్ ఫెస్టివల్, యన్.టి.సి వారి ప్రత్యేక టెక్స్ టైల్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాకినాడ సిటీ శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పర్యాటక రంగ ప్రోత్సహంలో భాగంగా జగన్నాధపురం బ్రిడ్జి వద్ద ఈత, పోటీలు, పడవల పోటీలు నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో కాకినాడ యం.పి తోటనరశింహం, కాకినాడ రూరల్ శాసన సభ్యురాలు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి, ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు, జాయింట్ కలెక్టర్ యస్.సత్యనారాయణ, అడిషనల్ యస్.పి. దామోదర్, అఖండగోదావరి ప్రాజెక్టు రిజనల్ డైరెక్టర్ భీమశంఖరం, పిల్లి సత్యనారాయణమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


