తెలంగాణకు పాకిన పందెంకోళ్లు!
- 117 Views
- wadminw
- January 8, 2017
- Home Slider సంపాదకీయం
పందెం కోళ్ల సంస్కృతి క్రమంగా కోస్తా నుంచి తెలంగాణ మారుమూల పల్లెలకూ విస్తరిస్తోంది. కోడి పందేలకు కోస్తా ప్రాంతం పెట్టింది పేరు. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగ్‌లు పెడుతారు. కానీ ఇక్కడ మాత్రం సీజన్‌తో సంబంధం లేకుండా కోడి పందేలకు కేరాఫ్‌గా మారుతోంది. కాకులు దూరని కారడవిలో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి.
సంవత్సరం పొడువునా కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ప్రాంతం అది. అడవుల జిల్లాలుగా పేరుగాంచిన వెనుకబడిన ప్రాంతాలు అవి. ఇక్కడ పల్లెల అభివృద్ధి ఊసే ఉండదు. అలాంటి ప్రాంతంలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చింది. కోడి పందేలను, పందెం కోళ్లను సినిమాలో తప్ప నేరుగా చూడని ఈ ప్రాంతంలో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి.
ఏడాది పొడవునా ఇక్కడి గ్రామాల్లో కోడి పందేలు జరుగుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని పది గ్రామాలు, మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో గోదావరి సరిహద్దు పరివాహక ప్రాంతాల గ్రామాల్లో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం, మంగళవారాల్లో కోడి పందేలు సాగుతాయి. గ్రామంలోని యువకులు, పెద్దలు పనులు ఎగొట్టి పందెం కాస్తున్నారు. పండగ సందర్భాల్లో, దసరా, సంక్రాంతి సీజన్లలో పందెం రాయుళ్ల హవా కొనసాగుతుంది.
గ్రామాల్లోని యువకులు, పెద్దలు ఇదే పనిగా పందేలకు బానిస కావడంతో సంసారాలు గుల్లవుతున్నాయి. కూలీ డబ్బులు సైతం కోడి పందేల్లో పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. పోలీసులు కోడిపందేల స్థావరాలపై అప్పుడప్పుడు దాడులు చేసి కేసులు పెట్టినా ఆ గ్రామాల్లో కోడిపందేల సంస్కృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని గోదావరి నది ప్రాంతంలో కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు ఆటోలు, ఆరు బైకులు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
సంక్రాంతి సీజన్ నేపథ్యంలో ఈ కోడి పందేల స్థావరాలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కోడి పందేలను అడ్డుకొని గ్రామస్తులను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా, తెలంగాణలో కోడి పందేల సంప్రదాయం లేకపోవడంతో, పందేలపై మక్కువ ఉన్న పలువురు నేతలు పశ్చిమ గోదావరి జిల్లాలో తమ ముచ్చట తీర్చుకున్నారు. స్వయంగా ఎంపీలు, ఎంఎల్ఏలు దగ్గరుండి పాల్గొంటున్న బారులలో తెలంగాణ నేతల సందడి కనిపించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులే దగ్గరుండి మరీ కోడి పందేలు జరిపించారు.
దీంతో పోలీసులు ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితం అయ్యారు. కోడి పందేల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత కె. రఘురామకృష్ణంరాజు భీమవరం మండలం వెంపలో పందేలను ప్రారంభించడం, ఏలూరు ఎంపీ మాగంటి బాబు బరిలోకి దిగి పందేలకు సై అంటుంటారు. తెలంగాణ నేతలు ప్రకాష్ గౌడ్, శ్రీశైలం గౌడ్ పందేలను వీక్షించిన వార్తలను మీడియాలో చూస్తేనే ఉంటాం.
గత ఏడాది భోగి రోజు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన పందేల్లో భాగంగా రూ.200 కోట్ల మేర సొమ్ము చేతులు మారినట్లు అంచనా. రాత్రంతా ఫ్లడ్ లైట్ల వెలుగులో పందేలు సాగాయి. మరోవైపు, తమిళనాడులో సంప్రదాయ క్రీడగా పేరొందిన జల్లికట్టుకు కేంద్రం గ్రీన్ స్నిగల్ ఇవ్వడంతో అక్కడి ప్రజల్లో సంబరాలు మిన్నంటాయి గత ఏడాది. తమిళనాడుకు కేంద్ర౦ ఇచ్చిన బహుమతిగా అక్కడి ప్రజలు దీనిని అప్పట్లో భావించారు. ఎద్దుల్ని వదిలి, వాటితో తలపడటమే జల్లికట్టు. ఎందరో ఈ జల్లికట్టు కారణంగా ప్రాణాలు కోల్పోయారు, కోల్పోతూనే వున్నారు.
అయిన ప్రభుత్వం ఈ క్రీడను అక్కడి సంప్రదాయ౦గా భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జల్లికట్టు తరహాలోనే మన ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని సంప్రదాయాలున్నాయి. సంక్రాంతి పండుగ తెలుగునాట అత్యంత ప్రాధన్యత కలిగినది. తెలుగువారి జనజీవన స్రవంతిలో ఒక భాగమైన అందరికీ ఇష్టమైన సంబరాల పండుగ ఇది. ఈ పండుగలో ముఖ్య ఘట్టం కోడి పందేలు ఎడ్ల పందేలు.
కోస్తాంధ్రల్లోని వివిధ పల్లెలు ఎడ్ల పందేలతో కోడి పందేలతో సందడిగా మారుతాయి. మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ పోటీలను పల్లెసీమల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ పోటీల కోసం ఎక్కువగా ఒంగోలు జాతి పశువులను సంక్రాంతి పందేల కోసం శిక్షణనిచ్చి సిద్ధం చేసేవారు. బండలాగుడుతో పాటు ఎద్దులకు అందాల పోటీలు కూడా నిర్వహించేవారు. అయితే వాటిపై ప్రభుత్వాలు నిషేధం విధించడంతో..వీటిని పెంచే ధనిక వర్గాలు కూడా ఆసక్తి చూపించడం మానేసారు.
అలాగే ఈ ఎడ్లను పెంచేవారు కూడా చాలా తగ్గిపోయారు. కొన్ని సంవత్సరాలు తరువాత ఈ జాతి కూడా అంతరించిపోయే ప్రమాదంలో వుందని ఓ సర్వే చెప్పినట్టు సమాచారం. ఇక కోడి పందాలు సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లో ఇవే స్పెషల్ ఎట్రాక్షన్. తరతరాలుగా సంక్రాంతి పండుగకు కోడి పందేలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. పండుగ మూడు రోజులు ఇవి బరిలో నిలిచి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఈ సంప్రదాయాలపై కోర్టులు, ప్రభుత్వాలు నిషేధం విధించడంపై కోస్తా జిల్లాల ప్రజలు గత ఏడాదే ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్రాంతి వస్తుందంటే వారి ఆనవాయితీ కోసం ముందుగానే కోళ్ళను ఎన్నో వేళ రూపాయలు ఖర్చు పెట్టి వాటిని రెడీ చేస్తారు. ఇదంతా పందేళ్ళలో డబ్బుల కోసం కాదని, తరతరాలుగా వస్తున్న తమ ఆచారాన్ని బతికి౦చుకోవడం కోసమని వారు అంటున్నారు. డబ్బు కోసమే అనుకుంటే ఒక్కో కోడికి నెలకీ ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఎలా పెంచుతామని ప్రశ్నిస్తున్నారు? రోజు కోసుకొని తినే కోళ్ళకు అనుమతి ఇచ్చిన జంతుసంరక్షకులు, కోర్టులు మూడు రోజులు జరుపుకొనే ఆనవాయితికి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు?
మరోవైపు గతంలో జల్లికట్టుపై నిషేధం విధించిన కేంద్ర౦పై ఒత్తిడి తెచ్చి తమ ఆచారాన్ని కాపాడుకున్నారు తమిళ నేతలు. దీనిపై వెంటనే జీవో తెచ్చుకోవడంలో కూడా వారు సక్సెస్ అయ్యారు. మరి మన నేతలు మన ఆచారాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? జల్లికట్టు కంటే కోడి పందేలు ప్రమాదకరమైనవా? తమిళ నేతలు తెచ్చిన ఒత్తిడి మన నేతలు తెలేకపోతున్నారా? అనే ప్రశ్నలు ఆంధ్ర ప్రజల్లో హాట్ టాక్‌గా నడుస్తున్నాయి.


