తొలగించిన అంగన్వాడీలకు షోకాజ్ నోటీసులు
ఆదిలాబాద్: జిల్లాలోని ఐసిడిఎస్లో తొలగించిన అంగన్వాడీలను తిరిగి తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు, అంగన్వాడీ కేంద్రాలలో 41 మంది అంగన్వాడీ కార్యకర్తలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. మహిళా శిశు సంక్షేమశాఖలో జరిగిన అక్రమాలకు వీరిని బాధ్యులుగా చేస్తూ 41 మంది అంగన్వాడీ కార్యకర్తలను తొలగించడంతో జులై 22 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమై ఉద్యమం ఊపందుకోవడంతో గుర్తించిన అధికారులు తాము చేసిన తప్పిదాన్ని గుర్తించి తొలగించిన ఉత్తర్వును రుద్దుచేసి వాటి స్థానంలో అంగన్వాడీ కార్యకర్తలకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిసింది.
జిల్లాలో జరిగిన అక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యులు కాదని, ఇందుకు బాధ్యులైన మొత్తం 39 మంది కార్యాలయ సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీచేశారు. సిబ్బంది చేసిన అక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలను బాధ్యులుగా చేయడంపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కార్యకర్తలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వారిచ్చిన సమాధానం ఆధారంగా మరోసారి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు.


