త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: యువనేత, ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి అంబికా సోని తెలిపారు. తల్లి సోనియాగాంధీ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారని, ఆయన పార్టీ అధ్యక్షుడిగా వస్తారని మాకు తెలుసు, కాని దీనికి సంబంధించిన తదుపరి వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని ఆమె అన్నారు. ప్రస్తుతం రాహుల్ వచ్చే ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని పేర్కొన్నారు.
రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు మద్దతిస్తామని, ఆయనకు అండగా ఉంటామని ఇటీవలే పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి ప్రకటించారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ నెల రోజుల పాటు ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా పార్టీలో రాహుల్‌గాంధీ ప్రదర్శన బాగోలేదని, నాయకత్వం లోపం ఉందని ఇటీవల కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన రీటా బహుగుణ జోషి ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుండగా, ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తండ్రి ములాయం వర్గం ఓ వైపు, తనయుడు అఖిలేశ్ వర్గం ఓ వైపు అవ్వడంతో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది.
ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్‌కు మద్దతిచ్చిన బహిష్కృత సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ మంగళవారం మాట్లాడుతూ పార్టీ చీఫ్ ములాయంపై విమర్శలు చేశారు. అఖిలేశ్ యాదవ్‌కు పాపులారిటీ పెరగడంపై ములాయంకు అసూయగా ఉందని, అందువల్లే పార్టీలో ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ఎస్పీ జనరల్ సెక్రటరీగా ఉన్న రాంగోపాల్‌ను ఇటీవల పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ములాయం సింగ్ యాదవ్ సోమవారం నాటి సమావేశంలో సమాజ్‌వాదీ నేత అమర్ సింగ్‌ను సమర్థించడంపై రాంగోపాల్ మండిపడ్డారు.
తాను అరెస్ట్ కాకుండా అమర్ సింగ్ కాపాడారు అని ములాయం చెప్పడం నాన్సెన్స్ అని, అంటే దానర్థం అమర్ సింగ్ సీబీఐని మేనేజ్ చేశారా? అని ప్రశ్నించారు. ములాయం సోదరులైన శివపాల్ యాదవ్, రాంగోపాల్ యాదవ్‌లు తండ్రీకొడుకులకు చెరొకరు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. శివపాల్ యాదవ్ ములాయం వైపు ఉంటుండగా రాంగోపాల్ యాదవ్ అఖిలేశ్‌కు మద్దతిస్తున్నారు.
డీఎంకే మహిళా నేతపై చెన్నైలో దాడి
చెన్నై, అక్టోబర్ 25: చెన్నైలో డీఎంకే పార్టీకి చెందిన ఓ మహిళా నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల వివరణ ప్రకారం… డీఎంకే పార్టీ నేత రేణుక సెయింట్ థామస్ మౌంట్ పంచాయత్ వుమెన్స్ వింగ్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. సోమవారం ఆమె స్కూలు బస్సులో ఇంటికి వస్తున్న కుమార్తె కోసం తాంబరం సమీపంలోని అగరంథేన్ బస్‌స్టాండ్ వద్ద ఎదురుచూస్తున్నారు. అదే సమయంలోగుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అడ్రసు అడుగుతూ ఆమె సమీపానికి వెళ్లారు. సమాధానం చెప్తున్న ఆమెపై హఠాత్తుగా కత్తితో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పలుమార్లు ఆమెను గాయపరిచారు. ఇది గమనించిన స్థానికులు నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెకు సత్వరం చికిత్స అందించామని, ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని నిందితులకై గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
కోలుకున్న జయలలిత: ఆదివారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం
చెన్నై, అక్టోబర్ 25: తమిళ తంబిల ప్రార్ధనలు ఫలించాయి. వారు ఎంతో ఆరాధించే పురిచ్చితలైవి, ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడింది. అంతేకాదు, అన్నీ సవ్యంగా జరిగితే, ఈ ఆదివారం ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చెన్నైలోని అపోలో వైద్యులే స్వయంగా వెల్లడించారు. గత నెల 22న తీవ్ర ఆరోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుప్రతిలో జయ అడ్మిట్ అయ్యారు. నెలా మూడు రోజుల నుంచి ఆమె చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆమెను ఎవరికీ చూపించకపోవడం, చికిత్స పొందుతున్న ఫోటోలను విడుదల చేయకపోవడం ప్రజల్లో అనుమానాలను మరింత పెంచాయి. మరోవైపు వైద్యులు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్స్ కూడా ఎప్పుడూ ఒకేలా వస్తుండడం కూడా అనుమానాలను రెట్టింపు చేసింది. తాజాగా అమ్మ ఆరోగ్య చాలా బాగుందని, కొన్ని రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించడంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. దీపావళిని ఘనంగా నిర్వహించుకునేందుకు తబిలు రెడీ అవుతున్నారు.


