త్వరలో జేఎన్టీయూకు సీఎం శంకుస్థాపన
- 98 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
గుంటూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): మండలంలోని కాకాని గ్రామ సమీపంలో జేఎన్‌టియూ కళాశాల భవనానిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారని వీసీ వీఎస్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కళాశాల బాలుర, బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కళాశాలకు 86 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని, శంకుస్థాపనకు సీఎం అంగీకరించారని చెప్పారు. భవిస్యత్లో ఈ కళాశాలలోనే యూనివర్సిటీ ఏర్పాటుచేస్తే స్థలం సరిపోదరని, ఈ నేపథ్యంలో పక్కనున్న ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఇందుకు ఆయన సముఖత వ్యక్తంచేశారని అన్నారు. ఈ సందర్భంగా వసతి గృహం నిర్వహిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ ఎన్.సుబ్బరామగుప్తా తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే కణగాల పీహెచ్‌సీకి నూతన భవనం
గుంటూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): చెరుకుపల్లి మండలంలోని కణగాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అభివృద్ధి కమిటీ మంగళవారం సమావేశం అయింది. ఎంపీపీ మొహమాటం పార్వతి అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ సమావేశంలో శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించి నూతన భవన నిర్మాణం చేయాలని తీర్మానం చేశారు. ప్రభుత్వం రూ.1.16 కోట్లు మంజూరు చేసిందని టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వైద్యాధికారి రవిబాబు తెలిపారు. త్వరలోనే పీహెచ్సీ కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తామన్నారు. పీహెచ్సీలో రోగులకందే వైద్య, రక్త పరీక్షల నిమిత్తం చర్చించారు. గత నెల 17న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు కనబరిచిన సిబ్బందికి అవార్డులందించగా వారిని సమావేశంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోగినేని వసుధ, ఎమ్.రాధాకృష్ణమూర్తి, వైద్యురాలు ఎమ్.స్రవంతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీఐడీ కార్యాలయం వద్ద పోలీసుల అత్యుత్సాహం
గుంటూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): భూమన కరుణాకరరెడ్డిని విచారించే సందర్భంగా పోలీసులు గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు మీద సీఐడీ కార్యాలయానికి అవతలివైపు ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. తాము ఆఫీసులోకి రాలేదని, అలాంటప్పుడు ఎందుకు తమను వెళ్లిపొమ్మంటున్నారని అడిగినా వినిపించుకోలేదు. దీనిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో, పాకిస్థాన్‌లో ఉన్నామో అర్థం కావట్లేదు. మేం రోడ్డుమీద ఉన్నాం. వెళ్లిపోవాలంటే కరుణాకర రెడ్డిని ఏం చేయబోతున్నారో అర్థం కావట్లేదు. ఆయన ఏం తప్పు చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. ఒకటి స్పష్టంగా చెబుతున్నాం.. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదు. చంద్రబాబు తానుచేసిన తప్పుల నుంచి తప్పించుకోడానికి మరో తప్పు చేస్తున్నారు. ఆరోజు జరిగిన విధ్వంసం ప్రభుత్వమే చేసి ఉంటుందని మాకు అనుమానం కలుగుతోంది. జగన్ సీబీఐ దర్యాప్తు కోరినా, ప్రభుత్వం ఒప్పుకోలేదు. ప్రభుత్వం వెనక నుంచి నడిపించిందన్న విషయం బయటపడుతుందనే సీబీఐ విచారణకు అంగీకరించలేదు. తెలుగుదేశం పార్టీ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో హింసాత్మక చర్యలు చేపట్టిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కరుణాకరరెడ్డికి ఏమైనా జరిగితే మాత్రం సహించేది లేదు. పోలీసు అనే పదానికి ఉన్న విలువను ఈ ప్రభుత్వం దిగజారుస్తోంది అని చెవిరెడ్డి అన్నారు. ఇదిలావుండగా, తమను ఎంత బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వైఎస్ఆర్సీపీ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో దాదాపు ఆరు గంటలకు పైగా విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తుని విధ్వంసం ఘటనలో తనకు నోటీసులు ఇచ్చి సీఐడీ విచారణకు పిలిపించడం చంద్రబాబు చేస్తున్న దాష్టీకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ఏ ఉద్యమమూ ఉక్కుపాదాలతో అణిగిపోయే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబే ఎన్నికల మేనిఫెస్టోలో కాపులు బీదరికంతో బాధపడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే వాళ్ల జీవితాలను కాంతివంతం చేస్తానని, వాళ్లందరినీ బీసీలుగా మారుస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ మాటను ఖూనీ చేయడంతో తమ జాతి అవమానపడిందని, మోసానికి గురైందని, నష్టపోయిన తమ జాతికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటానికి తాము మద్దతు ఇచ్చాం, ఇస్తాం, భవిష్యత్తులో కూడా ఉంటుందని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చంద్రబాబుకు, కాపులకుమధ్య సంబంధం పాము- కప్పలాంటిదని ఆయన ఎద్దేవా చేశారు. తమను బెదిరించినా, ఎంత అప్రజాస్వామ్య పద్ధతులు పాటించినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, తాను ఒత్తిళ్లు, భయాలకు లొంగే మనిషిని కానని, తన జీవితంలో భయమంటే ఏంటో తెలియదని ఆయన కుండ బద్దలుకొట్టారు. కాపుల విషయంలో చంద్రబాబు రూథర్ ఫర్డ్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తుని ఘటనతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, కేవలం ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చినందుకు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి దాని వెనక మా పార్టీ కుట్ర ఉందని మొదటి రోజు నుంచే సీఎం, హోం మంత్రి అంటున్నారని ఆయన గుర్తుచేశారు. అయితే పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేస్తారన్న నమ్మకం ఉందని, అందుకే వాళ్లడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. బుధవారం ఉదయం మళ్లీ రమ్మని పిలిచారని, విచారణకు హాజరవుతానని భూమన తెలిపారు. మరోవైపు, కాపు రిజర్వేషన్ల కోసం గడిచిన ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఐక్య గర్జన ఆందోళన కార్యక్రమం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో చోటుచేసుకున్న విధ్వంసకర ఘటనలపై ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను టార్గెట్ చేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డిని మంగళవారం సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. తునిలో రైలు బోగీల తగులబెట్టిన సంఘటన జరిగిన వెంటనే అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఆ ఘటనలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేయించారంటూ ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఈ ఘటనల వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ నేతల హస్తం ఉందంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలా ప్రకటించినట్టుగానే ఒక్కొక్కరిగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా ఆ చర్యలను ముమ్మరం చేసినట్టు స్పష్టమవుతోంది. మంగళవారం ఈ కేసుకు సంబంధించి కరుణాకర్ రెడ్డిని సీఐడీ పోలీసులు దాదాపు ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన గుంటూరు లేదా రాజమండ్రిలో జరిగే విచారణకు రావాలంటూ ఇటీవలే సీఐడీ అదనపు ఎస్పీ భూమనకు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజున హాజరుకాలేననీ, మంగళవారం విచారణకు హాజరవుతానని భూమన ఇదివరకే పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు భూమన మంగళవారం ఉదయం 11.30 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకోగా అప్పటి నుంచి సాయంత్రం దాదాపు 6 గంటల వరకు ఆ కార్యాలయంలో ఉంచి సీఐడీ అధికారులు విచారించారు. దురుద్దేశంతోనే తనకు సీఐడీ నోటీసులు ఇచ్చిందని భూమన అన్నారు. తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చినట్లు భూమన తెలిపారు. కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కాపుల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని ఆయన అన్నారు. కాగా ఈ ఏడాది జనవరి 31న కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సమాజానికి మార్గనిర్దేశకులు ఉపాధ్యాయులు
గుంటూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): సమాజానికి మార్గ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ వెంకటేశ్వర విద్యా మందిరంలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ కాంతీలాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల్ని ఉపాధ్యాయులు తమ సొంత పిల్లలుగా భావించి ఉన్నత విలువలతో కూడిన విద్యనందిచాలన్నారు. జిల్లాలో 68% మాత్రమే అక్షరాస్యత ఉందని, అక్షరాస్యత పెంపునకు కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో చాలా వరకు పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నిర్వహణ సరిగా లేదని వెంటనే మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఆనంద్‌బాబు, ఎమ్మెల్సీలు నాగేశ్వరరావు, రామక్రిష్ణ, జడ్పీ ఛైర్పర్సన్ జానీమోన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలోని 70 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేశారు. కాగా, గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిల్లానుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. వీరిలో చెరుకుపల్లి మండలంలోని రాంబొట్లపాలెం ఎమ్పియూపి పాఠశాల ఉపాధ్యాయుడు కాటూరి నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల మండల విద్యాశాఖాధికారి పి.లాజర్ మంగళవారం హర్షం వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడలో నిర్వహించే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు చేతులమీదుగా అవార్డును అందుకోనున్న మండల ఉపాధ్యాయుడిని చూసి తామెంతో గర్విస్తున్నట్లు తెలిపారు.


