దగాపడుతున్న మొక్క జొన్న రైతు
- 84 Views
- wadminw
- January 14, 2017
- Home Slider రాష్ట్రీయం
మహబూబ్‌నగర్: అప్పు చేసి.. ఎన్నో కష్టాలకు ఓర్చి పంట పండించిన రైతు దగా పడుతున్నాడు. తాము పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మార్కెట్లో పడిగాపులు పడుతున్నారు. చలిలో వణుకుతూ రాత్రనకా పగలనకా అధికారుల కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యలో దళారులు చేరి గద్దల్లా పంటను తన్నుకపోతున్నారు.
మహబూబ్‌నగర్‌లోని మొక్క జొన్న రైతుల దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పదిహేను రోజుల క్రితం మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు మూతపడటంతో కర్షకులు పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో పండిన మొక్కజొన్న పంటలో మార్క్ ఫెడ్ ద్వారా 6 లక్షల 34 వేల క్వింటాళ్ల మొక్కజొన్న పంటను అధికారులు కొనుగోలు చేశారు. అయితే నిర్ధారించుకున్న మొక్కజొన్న సేకరించామనే ఏకపక్ష నిర్ణయంతో అధికారులు డిసెంబర్ 15 నుంచి కొనుగోళ్లు ఆపివేసారు.
మార్కెట్‌కు వచ్చిన మొక్కజొన్నను కూడా కొనకుండా వదిలివేశారు. దీంతో మొక్కజొన్న రైతులు రోజులతరబడి అమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. అలంపూర్ మార్కెట్ యార్డులో రైతులు ఓపిక నశించి రెండు సార్లు ధర్నాకు దిగినా ఫలితం లేకుండాపోయింది. జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 29 వేల హెక్టార్లు కాగా ఖరీఫ్‌లో మాత్రం లక్షా 68 వేల హెక్టార్లలో సాగుచేశారు. వర్షాలు సరైన సమయంలో పడకపోవడంతో రైతులు మూడుసార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది.
దిగుబడి కూడా అంతంతమాత్రమే వచ్చింది. వచ్చిన పంటకైనా మద్దతు ధర లభిస్తుందేమోననుకున్న రైతన్న నిరాశే ఎదురవుతుంది. దీంతో దిక్కులేక దిగాలుగా రోదిస్తున్నాడు. పంట పండించేటప్పుడు ప్రకృతి సహకరించకా కష్టాలుకోర్చి పండించిన తర్వాత మార్కెట్లో మద్దతు లభించక వ్యాపారులు, అధికారుల మాయాజాలానికి రైతులు బలవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని అన్నదాతలు అర్ధిస్తున్నారు.


