దళిత గిరిజన బాట నిర్వాహణ ఏర్పాట్లపై సమీక్ష
ఏలూరు, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో ఈనెల 28వ తేదీన నిర్వహించే ప్రభుత్వ దళిత, గిరిజనబాట కార్యక్రమంలో 100 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టరు – 2 యంహెచ్. షరీఫ్ చెప్పారు. స్ధానిక ఆర్డిఓ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ దళిత గిరిజన బాట కార్యక్రమం నిర్వాహణా ఏర్పాట్లను వివిధ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డు కులాల కార్పోరేషన్ ద్వారా 15 కోట్ల రూపాయల విలువైన 2 వేల యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా 5 కోట్ల రూపాయలు, మెప్మా ద్వారా మరో 5 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 4 సమీకృత సంక్షేమ వసతి గృహాలతోపాటు మరో 12 వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంఖుస్ధాపన కార్యక్రమం రాష్ట్ర షెడ్యూల్డు కులాలు, గిరిజన సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు ద్వారా నిర్వహించబడుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ క్రింద సుమారు 22 శాఖలు అమలుపరుస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన పెద్ద ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ దళిత గిరిజన బాట కార్యక్రమంలో 10 వేలకు మందికిపైగా ప్రజలు హాజరవుతారని అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నాయకులు తమ సహకారం అందించాలని ఈ సందర్భంగా యంహెచ్. షరీఫ్ కోరారు. ఈనెల 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రభుత్వ దళిత గిరిజన బాట కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. సభాకార్యక్రమానికి హాజరయ్యే ప్రజానీకానికి అవసరమైన త్రాగునీటికి 30 వేల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేయాలని ఆర్‌డబ్ల్యుయస్ అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఏలూరు ఆర్డిఓ నంబూరి తేజ్ భరత్, సాంఘిక సంక్షేమ శాఖా డిడి రంగలక్ష్మీదేవి, ఎస్సీ కార్పోరేషన్ ఇడి డాక్టర్ జాన్సీరాణి, డియస్డిఓ అజీజ్, మండల తహశీల్ధార్లు చంద్రశేఖర్, కుమార్, యంపిడిఓ ప్రకాష్‌రావు, దళితనాయకులు దాసరి ఆంజనేయులు, పొలిమేర హరికృష్ణ, అజయ్, రవి తదితరులు పాల్గొన్నారు.


