దూకుడు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా
- 106 Views
- wadminw
- September 5, 2016
- అంతర్జాతీయం
ఉత్తర కొరియా తన దూకుడును కొనసాగిస్తోంది. మరో మూడు బాలిస్టిక్ క్షిపణులను సోమవారం ఉత్తర కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మీడియా సంస్థ యొన్హప్ వెల్లడించింది. వాంగ్జు కౌంటీ నుంచి తూర్పు సముద్రం(సీ ఆఫ్ జపాన్) వైపు ఈ క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా నిర్వహించినట్లు యొన్హప్ తెలిపింది. హైడ్రోజన్ బాంబ్ ప్రయోగాన్ని నిర్వహించిన ఉత్తర కొరయా బాలిస్టిక్ క్షిపణుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రెండు వారాల క్రితం ఓ సబ్ మెరైన్ నుంచి ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి జపాన్ సముద్రజలాల్లో పడటంతో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా ఉత్తర కొరియా పరీక్షలు జరిపిన తీరును జపాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ను ఘాటుగా హెచ్చరించింది.
జమాత్-ఎ-ఇస్లామి నేత, 1971 యుద్ధ నేరస్తుడు మిర్ ఖాసిం అలీ ఉరిపై పాకిస్తాన్ వ్యాఖ్యలకు నిరసనగా బంగ్లాదేశ్ ఈ హెచ్చరిక చేసింది. ఈ విషయంలో ఢాకాలోని పాకిస్తాన్ రాయబారి సమీనా మెహతాబ్‌కు బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల అదనపు విదేశీ కార్యదర్శి ఖమ్రుల్ అషన్ సమన్లు జారీ చేశారు. మిర్ ఖాసిం అలీని బంగ్లాదేశ్ శనివారం ఉరి తీయగా, ఈ ఘటన తమను ఎంతో బాధించిందని ఉరి తీసిన గంటకే పాకిస్తాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్, ఇలాంటి వ్యాఖ్యలు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కిందకు వస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా, జపాన్ను వరుస టైఫూన్(తుఫాన్)లు వణికిస్తున్నాయి.
ఈ సీజన్లో ఇప్పటికే పదికి పైగా తుఫాన్లు జపాన్ను అతలాకుతలం చేయగా తాజాగా నామ్థియన్ తుఫాన్ జపాన్‌పై విరుచుకుపడుతోంది. ఈ శక్తివంతమైన టైఫూన్ సోమవారం నాగసాకీ పట్టణం సమీపంలో తీరం దాటిందని వాతావరణ సంస్థ వెల్లడించింది. తుఫాను ప్రస్తుతం ఉత్తర ప్రాంతం దిశగా ప్రయాణిస్తుందని తెలిపారు. నామ్థియన్ టైఫూన్ ప్రభావంతో బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల 150 మిల్లీమీటర్ల వర్షం సైతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతవారం లయన్రాక్ తుఫాను బీభత్సంతో రాత్రికి రాత్రే సంభవించిన వరదల్లో 10 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే.


