దేవుడు అంటే పదార్ధమా? చైతన్యమా? మానసిక భావనా?
- 121 Views
- wadminw
- January 8, 2017
- Home Slider యువత
‘‘పులికి జీవించే హక్కు సమానంగా ఉంది. కాబట్టి తన ఆకలి తీర్చుకోడానికి జింకను చంపుతుంది. మరి జింకకు సంబంధించిన జీవించే హక్కు ఏమయ్యింది’’ అన్న ప్రశ్నకు బహుశా సమాధానం ఎవరి దగ్గరా దొరకదేమో. తన ఆకలితీర్చుకోవడానికి పులి, జింకను తినడం, జింక గడ్డి తినడం, ఇదంతా కూడా సమతుల్యంలో భాగమే. సమాన హక్కులో భాగమే! ‘ఈ బూమ్మీద పులి జాతే శ్రేష్టమైనది, జింక జాతి వుండటానికి వీల్లేదు. గడ్డి తినే మృగాలు నరకానికి వెళతాయి, ఇది దేవుని ఆజ్ఞకు విరుద్దం’ అని పులి ఎప్పుడు తన ఆకలికి సంబందం లేకుండా జింకలను చంపుకుంటూ పోతుందో అప్పుడది అవతలి ప్రాణి జీవించే హక్కును హరిస్తోంది.
అయితే పులి మనిషిలా ఆలోచించలేదు గనుక ఈ సమతుల్యతను ప్రక్రుతి సహజంగా సాధిస్తుంది. ఎప్పుడైతే జింకల జనాభా తగ్గిపోతుందో, పులులు ఆకలికి చచ్చిపోవడం మొదలవుతుంది. ప్రక్రుతి సాధించే ఈ సమతుల్యతను మనిషి జయించాడు గనుక మిగతా ప్రాణుల కంటే మనిషి బలవంతుడూ, బుద్దిజీవుడూ అయినాడు గనుక ఈ సమతుల్యతను నిలపాల్సిన బాధ్యతా మనిషి మీదే వుంది. ఏది తినాలి, ఎంత తినాలి, తప్పనిసరై మరోజీవిని తినాల్సివచ్చినపుడు ఎంత తక్కువ హింసతో ఆ పని చేయాలి.
ఇవన్నీ మనిషికి వున్న బాధ్యతలు. తనకున్న బలం వల్ల మనిషికి బాధ్యత పెరిగింది. అంతేకానీ ఇతర జీవుల మీద అధికారం పెరగలేదు. పదిమంది మనుష్యుల్లో అందరూ సమానం కాదు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత వుంటుంది లేదా బలహీనత వుంటుంది. అందరిలోకీ బలమైనవాడో, తెలివైన వాడో ఆ పదిమంది రక్షణ బాధ్యత తీసుకుని కాపాడాలేగానీ, మీకందరికంటే నేను గొప్పవాన్ని, మీరంతా నా సేవ కోసమే పుట్టారు అనడం అహేతుకం. ఇదే సూత్రము జీవులన్నిటిలో మనిషికీ వర్తిస్తుంది. ఇక సృష్టి విశయానికి వస్తే ఒకరి ఆలోచనల ప్రకారం దీనికి ఆది, అంతాలు లేవు.
సృష్టికి సమాంతరంగానో, పైనో కిందనో దీని వునికికి కారకుడు లేడు. ఈ అనంతమైన సృష్టి కాలవాహికలో బిగ్‌బ్యాంగ్ కేవలం ఒక మైలురాయి మాత్రమే! బహుశా అంతకు ముందూ ఎన్నో బిగ్బ్యాంగులు జరిగుండవచ్చు, ముందుముందు మరిన్ని జరగనూ వచ్చు. సృష్టికి వున్న ఏకైక లక్షణం మార్పు చెందడం. ఈ మార్పుచెందే ప్రక్రియలో ఓ మార్పు వల్ల జనించిందే జీవి. దీనికింక ఇంతకంటే ప్రత్యేకతా, కారణమూ ఏవీ లేవు. జీవి పుట్టుకా, మరణమూ, మధ్యలో జీవించే కాలమూ క్షణ మాత్రమే కాదు, ఈ జీవరాశి పుట్టుకా, నాశనమూ కూడా క్షణమాత్రమే ఈ అనంతమైన కాలవాహికలో! దేవుడు అనేది పదార్ధమా? చైతన్యమా? మానసిక భావనా?
దేవుడు కనిపించడు అని కొంత మంది, ఎందుకు కనిపించడు అని మరికొంత మంది వాదులాడుకుంటున్నారు, నాకు రూపంతో పని లేదు కనీసం గుణగణాలు అయిన చెప్పగలరా? కేవలం మానసిక భావనే గనుక మానసిక భావన కనిపించదు. కానీ ఆ బావన రూపాలను చూడవచ్చు. ఉదాహరణకి మంచి, చెడు అన్నవి భావనలే. వాటిని చూదలేము. బొమ్మగా గీయలేము. అయితే ఆపదలో వున్నవాన్ని కాపాడటం మంచి అంటాము. ఏదైనా కీడు తలపెట్టడం చెడు అంటాము. అయితే అవి మాత్రమే మంచి, చెడుకు ఉదాహరణలు కాదు.
రెండింటికీ వేల వేల వుదాహరణలు ఇవ్వవచ్చు. ఇవన్నీ మంచి, చెడుకి ఉదాహరణలు అవుతాయే గానీ అవే మంచి, చెడు అవవు. ఇప్పుడు మంచిని దేవుడు అనుకుంటే, చెడును దయ్యం అనుకోవచ్చు. వాటికి రూపాల్లేవు అయినా అవి ఎన్నో ఉదాహరణల్లో వ్యక్తపరచబడతాయి. హిందూ తాత్వికతలో ఈ వ్యక్తపరచబడే వుదాహరణలన్నిటినీ దేవుడి రూపాలుగా బావించబడటం వల్ల హిందూ మతంలో ఎందరో దేవతలున్నారన్న అపోహ బయటి మతాలలో వుంది. దేవుడు ఈ సృష్టిని చేసాడు అంటున్నారు.
మనం చూసే ఫోటోల్లో వాళ్ళు కూడా మనిషిలాగానే స్థూలంగా కనిపిస్తున్నారు. మనిషిని దేవున్ని చేసారా? లేక దేవుడే మనిషిగా మారారా? పైన చెప్పినట్లు ఈ సృష్టిని ఎవ్వరూ చేయలేదు. అది వుంది. అంతే! ఎందుకుంది అంటే తెలియదు. దేవుడు సృష్టించాడు అనుకుంటే మరి దేవుడు ఎందుకున్నాడు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఏదో ఒక కారణం లేకుండా ఏదీ జరగదు అనే ఓ వాదన వుంది. ఇది వుండటానికీ ఓ కారణం వుండవచ్చు. ప్రస్తుతానికి కారణం తెలియదు అనుకోవడమే సరైన సమాధానం.
పైన వుదాహరణల్లో మంచికి రూపం లేదు. అయితే తనకు మంచి చేసిన వాని/దాని రూపాన్నే మంచిగా తలవడం కద్దు. అందువల్ల ఒక్కొక్కడూ ఒక్కో రూపంలో మంచిని చూసుకొని అదే మంచితనం రూపం అనుకుంటారు. సృష్టికర్త ఒకరే ఐనప్పుడు, ఇంత మంది దేవుళ్ళు ఎందుకు? మతానికి ఒకరు, కులానికి ఒకరు, గోత్రానికి ఒకరు, గ్రామానికి ఒకరు, ఇంకా అవతార పురుషులు, బాబాలు, అమ్మలు, అమ్మ తల్లులు ఎందుకు? రెందవ ప్రశ్న సమాధానంలోనే దీనికీ సమాధానం వుంది. సృష్టి వుంది అయితే కర్త లేడు.
లేదా సృష్టీ మరియూ కర్తా వేర్వేరు కాదు. రెండు ఒకటే. దీనివల్ల ఒకడ, ఇద్దరా అన్న ప్రశ్నే లేదు. ఇక మనం చూసే దేవుళ్ళ రూపాలు నేనింతకు ముందు చెప్పిన దేవుడికి (మానసిక భావనకు) ఉదాహరణలే! మనకు దప్పికేస్తున్నప్పుడు దాహం తీర్చినవాడు దేవుడు అన్న భావనకు వుదాహరణ. కనుక అతన్ని దేవుడు అంటాం. ఇలా చరిత్ర పొడువునా కుటుంభాన్ని రక్షించినవాడు ఆ కుటుంబానికి దేవుడైతే, కులాన్ని రక్షించినవాడు ఆ కులానికి దేవతో, దేవుడో అవుతాడు. అందువల్లే హిందూ తాత్వికతలో దేవుడు మనుషి రూపానికే పరిమితం కాడు.
వెలుగునిచ్చే సూర్యుడు, ఊపిరినిచ్చే వాయువు, ఉష్ణాన్నిచ్చే అగ్ని, దాహం తీర్చే నీరు, తిండినిచ్చే భూమి అన్నీ దేవుళ్ళే! జ్ఞానాన్నిచ్చే గురువు, జన్మనిచ్చిన తల్లిదండ్రులూ దేవుళ్ళే.. దేవుడే సృష్టికర్త అయితే, ప్రపంచంలో ఇంత అశాంతి, అసమానతలు, వేదనలు, రోదనలు, పీడనలు ఎందుకు? ఇవన్ని ఆయనకు వినోదమా? ఆహ్లాదమా? సృష్టికర్తే లేడు గనుక ఈ అశాంతి, అసమానతలు, వేదనలు, రోదనలు, పీడనలకు కారకుడూ లేడు. దక్షణం లేకుండా ఉత్తరం లేదు. పడమర లేకుండా తూర్పు లేదు.
చెడు లేకుండా మంచి అంటే ఏమిటో కూడా మనకు తెలియదు. మంచి ఎందుకుందో చెడూ అందుకే వుంది. వెలుగెందుకుందో, చీకటీ అందుకే వుంది. మా దేవుడే గొప్ప, సృష్టికర్త అని హిందువులు/ముస్లింలు/క్రిస్టియన్స్ వాదించుకుంటున్నారు. ఏ ఒక్కరి వాదన నిజమైన మిగాతవారిది తప్పే కదా? ఈ వాదించుకొనే వారంతా మిడిమిడి జ్ఞాన సంపన్నులు. లేదా తర్కాన్ని నమ్మకుండా కేవలం ఒక ప్రవక్తో, దేవదూతో, రుషో, రుషులో చెప్పిన దాన్ని తు.చ తప్పకుండా నమ్ముతూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు.
ఏ ఒక్కరి వాదన నిజమైనా మిగతా వారిది అబద్దం అనే తర్కంలోనే వీరందరిదీ అబద్దమని తెలుస్తోంది. కాకుంటే ఏ మతావలంబీ దాన్ని ధైర్యంగా ఒప్పుకోడు. ఎందుకంటే తన మతమే నిజమని ఇతరులది అబద్దమనీ నమ్ముతాడు గనుక. సరే ఏదో ఒక మాట దేవుడు సృష్టించాడు అనుకుందాం, ఆయనే అన్ని దేశాలు, ప్రాంతాలు తిరిగి సృస్టించాడా? స్తూలంగా మానవుడు ఒకే శారీరక నిర్మాణం ఉంది కాబట్టి మరి అయన అన్ని పనులు ఒకే చోటనుంచి చేశాడా? మరి అయన ఇన్ని మతాలను ఎలా సృష్టించాడు? అనుకోవద్దు.
ఏదీ ఎవరూ సృష్టించలేదు. అది మార్పు చెందుతూ వుంది. ఆ మార్పు చెందటంలో తర్వాతి రూపానికి ఆ ముందున్న రూపం కారణం అంతే. దాని వల్ల అసంఖ్యాకమైన రూపాలు తయారవుతున్నాయి. ఇన్ని కోట్ల మందిలో ఒకరిని పోలిన మరో మనిషి ఇప్పుడు లేడు, ఇంతకు ముందు లేడు, ఈ తర్వాతా వుండబోడు అంటేనే తెలుస్తోంది ఈ వైవిధ్యం ఎంత సహజమో. మరి ఇన్ని మతాలూ, ప్రాంతాలూ, జాతులూ వుండటంలో ఆశ్చర్యమేముంది? వుండకపోతేనే ఆశ్చర్యపడాలి. సృష్టి, స్తితి, లయ కారకుడు దేవుడే అయితే ఏ మతం అయినా ఇన్ని రోగాలు, శారీరక లోపాలు ఇందుకు సృష్టించారు? ఇది తయారీ లోపమా? ఇలాంటి లోపాలున్న ఉత్పత్తి చేసేవారు దేవుడు అవుతారా?
మరి లోకంలో జరిగే అన్ని అనర్ధాలు, నేరాలు, ఘోరాలు ఆయనకు తెలిససే జరుగున్నాయి అనుకోవాలి లేదా ఆయనే చేస్తున్నాడు అనుకోవాలా? మరి ఇన్ని ఘోరాలు చూస్తూ, చేయిస్తూ ఉండేవారు దేవుడు అంటారా? నిజానికి సృష్టి, స్థితి, లయ అనేవి లేవు. వున్నది కేవలం మార్పు మాత్రమే. ఆ మార్పులో వున్న వివిధ దశలనే సృష్టి, స్థితి, లయలు అంటున్నాం. ఏదీ కొత్తగా సృష్టింపబడటం లేదు, ఏదీ లయమూ కావటం లేదు. బిడ్డ పుట్టడం ఎక్కడ జరిగిందనుకోవాలి? ప్రసవం అయినప్పుడా, పురుష బీజం, అండంలో కలిసినప్పుడా?
లేక పురుష బీజం మరియు అండం సృష్టింపబడినప్పుడా? ఇలా వెనక్కువెళుతున్నకొద్దీ దానికి ఓ ముందు దశ వుండి తీరుతుంది. కనుక పుట్టడం అన్నది ఆ అనంత కాలవాహికలో ఓ మైలు రాయి మాత్రమే. అలాగే చావు కూడా! ఏది లయమయిందక్కడ? శరీరం మళ్ళీ ప్రక్రుతిలో కలిసి రిసైకిల్ అవుతోంది అంతే! రోగాలు, శారీరక లోపాలు మనకంటికవి రోగాలు/లోపాలు. సృష్టికవన్నీ మామూలే! ఒకటి లోపం, ఒకటి కాదు అన్న స్పృహ, విచక్షణ దానికుండవు. ఉదాహరణకు ఓ లోతైన బావిలో నీళ్ళున్నాయి.
బయట దాహంతో చచ్చిపోతున్న వృద్దుడున్నాడు. వృద్దుడికి తెలుసు తనుబతకాలంటే ఆ బావిలో నీళ్ళు తాగాలని కానీ తను దిగలేడు. నీళ్ళను చేదనూ లేడు. కానీ నీటికి ఆ విశయం తెలియదు కదా? ఆ నీరు వుబికి తనంత తాను బయటకు వచ్చి వృద్దుడి నోట్లో పడదు కదా! అలాగే సృష్టి కూడాను. దానికి ఒకటి లోపము, ఓకటి కాదు అన్న తేడా లేదు. మరి దేవుడు అన్ని కర్హ్త, కర్మ, క్రీయ అయినపుడు పేద వాడిని ఇంకా పేదవానికి దూరంగా, పెద్దవారికి దగ్గరగా ఎందుకు ఉంటున్నారు. దేవుడు కేవలం భావనే.
కర్తా కాదు, క్రియా కాదు. నీరు ఎవడిదగ్గరుంటే వాడి దాహం తీరుస్తుంది. నీటికి ఎవడు ధనవంతుడో, ఎవడు కాదో తెలియదు. అగ్ని ఎవడినైనా దహిస్తుంది. ఎవడు ధనవంతుడో, ఎవడు కాదో చూడదు. ఈ వనరులన్నీ ధనవంతుడి దగ్గర వుంటాయి, పేదవాడి దగ్గర వుండవు గనుక వీడికున్న కష్టాలు వాడికుండవు. దేవుడు అంత చూసుకుంటారు అనుకునే వారు ఎందుకు రోగాలు వస్తే, డాక్టర్ దగ్గరకు పోతున్నారు, ఇంట్లో పూజ చేస్తే సరి పోతుంది కదా? ఎవరూ ఏమీ చూసుకోరు. ఎవరో చూసుకుంటారు అన్న భావన, నమ్మకం మనిషికి ఆశ కలిగిస్తుంది.
బలాన్ని ఇస్తుంది. ఆ నమ్మకం ఇచ్చే బలం వల్ల ఒక్కోసారి తను అనుకున్న పని సాధించగలుగుతాడు. సాధించినప్పుడు అది తనలో నమ్మకాన్ని మరిన్ని రెట్లు పెంచుతుంది. ఆ నమ్మక బలంతో అతను మరిన్ని విజయాలు సాధిస్తాడు. పూజ చేస్తే సరిపోతుంది అనే నమ్మకస్తులూ వుంటారు. కానీ కేవలం నమ్మకం వల్లే అన్ని పనులూ జరగవు. వర్షం పడుతుందని కేవలం ఎంత గట్టిగా నమ్మినా పడదు. అయితే ఈ పరీక్షలో నేను విజయం సాధిస్తాను, నాకు దేవుడి ఆశీస్సు వుంది అని గాడంగా నమ్మిన వాడు ఒత్తిడి తగ్గి నిజంగానే జవాబులు సరిగ్గా రాయగలడేమో.
నమ్మకం మానసిక రోగాలను నయం చేస్తుందేమొ గానీ అన్ని రోగాలనూ కాదు. చివరగా ఏ పని చెయ్యాలన్న దేవుని మొక్కనిదే పని ప్రాంభించరు కదా మరి విజయం వస్తే దేవుని దయ అంటారు, మరి అప జయం వస్తే ఆయననే బాధ్యుని చెయ్యరు ఎందుకని? అంటే అయన విజయలకే పరిమతమా? ఎందుకంటే అది దేవుడిమీద మనిషికున్న నమ్మకం. జరగనప్పుడు దేవున్ని నిందించాలంటే వున్న భయం. విజయానికి దేవుడి దయా లేదు. అపజయానికి దేవుడి బాధ్యతా లేదు. అన్నీ మనవే.


