దేశంలో ఆదర్శ గ్రామంగా బూరుగుపూడి: కాకినాడ ఎంపీ
కాకినాడ, సెప్టెంబర్ 4 (న్యూస్‌టైమ్): తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలోని బూరుగుపూడి గ్రామాన్ని దేశంలో ఆదర్శ గ్రామంగా రూపొందిస్తామని కాకినాడ ఎంపీ తోట నరసింహం తెలిపారు. బూరుగుపూడి గ్రామంలో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా దేశంలో ఆదర్శ గ్రామంగా రూపొందించడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పధకం క్రింద, పార్లమెంట్ సభ్యునిగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి దత్తత తీసుకున్నానని నరసింహం తెలిపారు. యం.పి. తోటనరసింహం, వివిధ శాఖల జిల్లా అధికారులు గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృధ్ధి పనులను పరిశీలించారు.
1960 గృహాలతో 5843 గ్రామ జనాభా గల ఈ గ్రామంలోని 14 వార్డులలో పలు సమస్యలు ఉన్నప్పటికీ వీటన్నిటినీ పరిష్కరించి, గ్రామంలో పారిశుధ్యం, ప్రజారోగ్యం, ఆక్షరాస్యత పెంపొందించి, మౌళిక సదుపాయాలను మెరుగుదలకు ప్రణాళికలు రూపొందించారు. గ్రామంలో ఉన్న 1960గృహాలలో, 650 గృహాలకు వ్యక్తిగత మరుగుదొడ్ల అవసరాన్ని గుర్తించి, వీటి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిర్మాణ కేంద్రాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మొదలు పెట్టారు.
వ్యక్తిగత మరగుదొడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేల ఆర్ధిక సహాయము, మెటీరియల్ కొనుగోలుకు రూ.11 వేల వరకూ ఖర్చు అవుతుండగా, గ్రామ పంచాయతీ నిర్మాణ కేంద్రం ద్వారా 9,500 కే పంపిణీ చేసే ఏర్పాటు చేశారు. ఈ మేరకు మరుగుదొడ్లకు అవసరమైన వరలు, స్లాబ్‌లు, డోర్లు వంటి సామాగ్రిని, మేస్త్రీలతో చేయించే పనిని గ్రామ సర్పంచ్ పి.సూర్యచంద్ర చేపట్టారు. గ్రామ సర్పంచ్ చొరవ , ప్రజల పట్టుదలతో అక్టోబరు 2వ తేదీ నాటికి గ్రామంలో పూర్తి శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి దీక్షతో పని చేస్తున్నారు.
గ్రామాలలో ఉన్న మెటల్ రోడ్లు స్ధానే సిమెంటు రోడ్ల నిర్మాణానికి సుమారు నాలుగు కోట్లు అవసరమవుతాయని, అంచనా వేయగా, ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర నిధుల నుంచి సమీకరిస్తారని, యం.పి. హామి ఇచ్చారు. ప్రభుత్వం 70 శాతం నిధులు ఇస్తే, 30 శాతం శ్రమదానంతో చేపట్ట డాలని గ్రామస్తులు మొగ్గుచూపారు. గ్రామంలో అర్హులందరికీ పింఛన్లు, అక్షరాస్యతా శాతం 70 నుండి నూరు కి పెంచే యత్నాలు, పచ్చదనం, పారిశుధ్యం, ఆరోగ్యపరిరక్షణ వంటి పనులకుప్రణాళికలను రూపొందించారు. ప్రతీ వార్డులలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు ద్వారా ఈ పనులను అమలు చేస్తారు.
మొక్కలను దత్తత తీసుకున్న విద్యార్ధులు ః పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఈ గ్రామంలో 400 మొక్కలు నాటి, వాటిని ఒక్కొక్క విద్యార్ధి ఒక్కొక్కరి పేరుతో దత్తత తీసుకోవడం ఈ గ్రామంలో ఒక ఆదర్శం, పాఠశాల అవరణలో నాటిన ఎర్ర చందనం మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యతను విద్యార్ధులు ఈ విధంగా తీసుకున్నారు. గ్రామంలో ఇంకుడు గుంటల ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా పనులను చేపడుతున్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం ః గ్రామాలలో ఉన్న 47 గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ఇచ్చే బియ్యం, పప్పు, నూనె, కోడి గ్రుడ్లకు అదనంగా , గ్రామంలో వీరందరికీ పౌష్టికాహారంగా, వేరుశెనగా, క్యారెట్, పండ్లు వంటి అదనపు ఆహారాన్ని గ్రామ పంచాయతీ అందచేస్తూ వీటి కోసం ప్రతి నెలా 10 వేల వరకూ ఖర్చు చేయడం ఆదర్శంగా నిలిచింది.
ఈ సందర్భంగా గా జరిగిన గ్రామ సభలో యం.పి. తోట నరసింహం మాట్లాడుతూ బూరుగుపూడి లో జరుగుతున్న అభివృధ్ధిని డాక్యుమెంట్ రూపంలో ప్రధాని మోడీకి , రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నివేదిస్తానని, ఈ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృధ్ధి చేసి దేశంలో ఆదర్శ గ్రామంగా అందరి సహకారంతో రూపొందిస్తామని తెలిపారు. గ్రామంలో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం గ్రామంలో ఏర్పాటు చేసిన నిర్మిత కేంద్రం మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్‌యార్డ్ ఛైర్మన్ యస్.వి.యస్.అప్పలరాజు, జ్యోతుల చంటిబాబు, జిల్లా జాయింట్ కలక్టర్ యస్.సత్యన్నారాయణ, జిల్లా పరషత్ సిఇఓ కె.పద్మ, డిఆర్డిఏ పిడి యస్.మల్లిబాబు, డ్వామా పిడి నాగేశ్వరరావు, డిఇఓ ఆర్.నరసింహారావు, డి.యం.హెచ్.ఓ. డా. ఎన్.ఉమాసుందరీ, డిపిఆర్ఓ ఎం.ఫ్రాన్సిస్, గ్రామ సర్పంచ్ పి.సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.


