దేశవ్యాప్తంగా పెరిగిన మావోయిస్టుల ప్రజాకోర్టులు
రాయ్‌పూర్, సెప్టెంబర్ 4: కొంతకాలంగా స్తబ్దత ప్రదర్శించిన మావోయిస్టులు చత్తీస్‌ఘర్‌లో మళ్లీ విజృంభించారు. వ్యూహం మార్చారు. సరికొత్త క్రీడకు నాంది పలికారు. జన అదాలత్(ప్రజాకోర్టు)లు నిర్వహిస్తున్నారు. రాజ్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. ప్రజల్లో తిరిగి తమ పట్టు నిలుపు కోవడానికి ప్రజాకోర్టుల పేరుతో బహిరంగ శిక్షలు విధిస్తు న్నారు. ప్రజలను భయభ్రాంతులను చేయడానికి జన ఆదాలత్‌ల ధోరణిని మావోయిస్టులు పెంచినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో భద్రతా దళాలు మకాం వేయడం, స్థానికులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడంతో నక్సల్స్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొంటున్నారు. పోలీసు లెక్కల ప్రకారం బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాది జూలై నుంచి 13 జన అదాలత్‌లు నిర్వహించారు.
నిరుడు నాలుగు ప్రజాకోర్టులు నిర్వహించారు. రాష్ట్రంలో నక్సల్స్ సంబంధిత ఘటనల్లో 25 మంది పౌరులు బలయ్యారు. అందులో అత్యధికులు జన అదాలత్‌లో మరణించిన వారేనని పోలీసులు తెలిపారు. జన అదాలత్‌లలో అమాయక గిరిజనులను నక్సల్స్ చంపుతున్నారు. గ్రామస్తులను చంపడం ద్వారా మావోయిస్టులు గొప్పగా భావిస్తున్నారని ప్రొఫెసర్ గిరీష్ కాంత్ పాండే పీటీఐతో అన్నారు. ప్రొఫెసర్ గిరీష్ కాంత్ పాండే ప్రభుత్వ సైన్సు కాలేజీలో డిఫెన్స్ స్టడీస్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో ఉనికి కోల్పోవడంతో మావోయిస్టులు నిరాశా నిస్పృహలకు లోనయ్యారని, సుక్మా, నారాయణపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు ప్రవేశించడంతో వారు భయాందోళనలకు గురయ్యారని ఆయన వివరించారు. ఈ రెండు జిల్లాలో మావోయిస్టులకు సురక్షిత కేంద్రాలు.
తమ బలాన్ని, ఉనికిని చాటుకోవడానికి పోలీసు ఇన్ఫార్మరు పేరుతో మావోయిస్టులు గ్రామస్తులను చంపుతున్నారని పాండే పేర్కొన్నారు. సుక్మా జిల్లాలో మావోయిస్టులు అత్యధికంగా ఆరు ప్రజాకోర్టులు నిర్వహించారు. నారాయణపూర్, బస్తరు జిల్లాల్లో మూడేసి ప్రజాకోర్టులు జరిగాయి. కాంకర్ జిల్లాలో ఒకటి నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా కిరాతకానికి పాల్పడటమే జనఅదాలత్ ఉద్దేశమని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కేవలం ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికే మావోయిస్టులు ప్రజాకోర్టులతో ప్రజలను భయకంపితులను చేస్తున్నారని అధికారులు అంటున్నారు.


