నగరంలో ‘కమల’ పతాకం ఎగురవేస్తాం: పైడి
శ్రీకాకుళం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో పోటీ చేసి విజయ పతాకం ఎగురవేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక పార్టీ జిల్లా శాఖ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. అన్ని వార్డుల్లోనూ ప్రజా సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. అప్పుడే ఓటర్ల మన్నన పొందగలమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పూడి తిరుపతిరావు మాట్లాడుతూ త్వరలో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి శాసన మండలి ఎన్నికలకు ఓటర్ల నమోదును ప్రారంభించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
పార్టీ నగర అధ్యక్షులు చల్లా వేంకటేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో సంపతిరావు నాగేశ్వరరావు, కె.ఈశ్వరమ్మ, దుప్పల రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పరిశీలనకు కేరళకు చెందిన అధికారుల బృందం జిల్లాలో పర్యటిస్తోంది. జిల్లాలో పలాస మండలంలో 3, జి.సిగడాం 3, సంతబొమ్మాళి 1, సరుబుజ్జిలి 3 పంచాయితీల్లో జరుగుతున్న పధకాలను పరిశీలించనున్నారు. అందులో భాగంగా పలాస మండలంలోని రెంటికోట, పెదంచల, బంటుకొత్తూరు పంచాయతీల్లో ఎం.కె.జయదేష్, జయన్ కె.ఎం లతో కూడిన అధికారులు పరిశీలించారు. పింఛను, ఉపాధి హామీ, ఐఏవై ఇళ్లు, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు అమలు తీరును పరిశీలించి ఐఏవై ఇళ్లు, పింఛను లబ్ధిదారులతో మాట్లాడారు. రెంటికోటలో పింఛను పంపిణీ తీరును పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో సంక్షేమ పథకాల అమలు తీరునకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర బృందంతో డీఆర్డీఏ ఏపీవో డీఎస్ఆర్ఎస్ మూర్తి, పింఛను ఏపీవో సోమయాజులు, వెలుగు పథకం సమన్వయకర్త శ్రీరాములు, పలాస ఎంపీడీవో సూర్యనారాయణ, పంచాతీరాజ్ జేఈ రవికుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం జేఈ అప్పలనాయుడు తదితరులున్నారు.
నేడు ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం
శ్రీకాకుళం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపట్టే వివిధ పనులపై ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ పి.రజనీకాంతారావు ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా, జిల్లాలోని సారవకోట మండల పరిధిలో గల గుమ్మపాడు పంచాయతీ గోపాలపురంలో పురుగు మందు తాగి బుక్క రూపవతి (16) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇంట్లో ఈ నెల 2వ తేదీన సాయంత్రం తన కుటుంబసభ్యులు గొడవ పడుతుండగా మనస్థాపానికి గురైన రూపవతి గొడవను ఆపాలనే ఆలోచనతో పురుగు మందు తాగారు. దీంతో ఆమె అపస్మారకస్థితికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు నరసన్నపేటలో గల ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం నగరంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేక ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. రూపవతి జలుమూరు మండలం చల్లవానిపేటలోని ఓ ప్రైవేటు ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. మృతురాలి తండ్రి సుందర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు పేర్కొన్నారు. రూపవతి మృతితో గ్రామంలో విషాదం అలముకుంది.
గ్రంథాలయ వ్యవస్థ బలోపేతానికి కృషి: పీరుకట్ల
శ్రీకాకుళం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పీరుకట్ల విఠల్‌రావు పేర్కొన్నారు. టెక్కలిలోని శాఖాగ్రంథాలయాన్ని సందర్శించి అనంతరం ఆయన పోటీ పరీక్షల పుస్తకాలు అందజేశారు. తదుపరి మాట్లాడుతూ 2008 తరువాత జిల్లాలోని గ్రంథాలయాలకు ఆశించినస్థాయిలో పుస్తకాలసరఫరా జరగకపోవడంతో నిరుద్యోగ యువతకు అసౌకర్యం కలిగిందని తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించాక తొలి విడతగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 1.25 లక్షల విలువైన పుస్తకాలు సరఫరాచేయగా, ప్రస్తుతం రూ. 2.50 లక్షల విలువైన పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయ వ్యవస్థకు ప్రధాన ఆదాయవనరైన 8 శాతం పన్నును గ్రామపంచాయతీల నుంచి వసూలు చేసేందుకు ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఏడాదికి రూ. కోటి వరకు పన్ను వసూలు కావాల్సిఉండగా, రూ. 80 లక్షలు లక్ష్యం పెట్టు కున్నామని, ఇంతవరకు రూ. 60 లక్షల మేర వసూలు చేయగలిగామన్నారు. శ్రీకాకుళం నగరపాలకసంస్థతో పాటు టెక్కలి మేజర్ పంచాయతీల నుంచే పన్ను సక్రమంగా వసూలు కావడంలేదన్నారు. జిల్లావ్యాప్తంగా 45 శాఖా గ్రంథాలయాల్లో పదింటికి అంతర్జాల సౌకర్యం కల్పించామని, మరుగు దొడ్లు, రక్షణ గోడల్లేక మహిళా పాఠకులు, గ్రంథాలయాధికారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెనుకబడిన జిల్లాలకు వచ్చే నిధులతో గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం దృష్టికి తీసుకెళ్లామన్నారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోఒక్కో గ్రంథాలయాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని, తొలి విడతగా పాతపట్నం గ్రంథాలయంలో రూ. 9 లక్షలతో అదనపు గదులు నిర్మించామన్నారు. జిల్లాలోని 1110 గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం 111 పుస్తక నిక్షిప్తకేంద్రాలు మాత్రమే ఉన్నాయని, మరో 100 ఏర్పాటుకు డైరెక్టరేట్‌కు వినతి పత్రం అందించామని ఆయన తెలిపారు. ఆయన వెంట గ్రంథాలయాధికారి వైకుంఠరావు తదితరులున్నారు.


