నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యం: అదనపు జేసీ షరీఫ్
ఏలూరు, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా ఉపకారవేతనాలు పొందేందుకు అర్హత గల విద్యార్దినీ విద్యార్ధులు (ఫ్రెష్, రెన్యువల్స్) ఈనెల 15వ తేదీలోగా ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా అదనపు జిల్లా జాయింట్ కలెక్టరు మహ్మద్ షరీఫ్ చెప్పారు. మంగళవారం స్ధానిక కలెక్టరు కార్యాలయం నూతన సమావేశమందిరంలో జిల్లాలోని ప్రభుత్వ , ప్రయివేటు కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమావేశమై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా ప్రయివేటు కళాశాలల్లో అభ్యసించే అర్హులైన పేద, బలహీనవర్గాల విద్యార్ధులకు కూడా ఉపకార వేతనాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఉపకారవేతనాలు పొందేందుకు అర్హతగల కొత్త, పాత విద్యార్ధులు నిర్ణీత గడువులోగా అంతర్జాలం ద్వారా తమపేర్లు నమోదు చేయించుకోవాలని షరీఫ్ సూచించారు. చిన్న చిన్న సమస్యలుంటే సంబంధిత శాఖల ద్వారా తెలుసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఆన్లైన్లో టెక్నికల్ సమస్యలపై సవరణలు చేసి పంపాలని కాలేజీ ప్రిన్సిపళ్లను అదనపు జేసీ ఆదేశించారు. తల్లిదండ్రులు లేకపోయినా విడిపోయినా సంబంధిత విద్యార్ధినీ విద్యార్ధులు దరఖాస్తు, రేషన్ కార్డు సంబంధిత శాఖాధికారులకు పంపాలని సూచించారు. ఇంకా ఇతర సమస్యలేమైనా ఉన్న సంబంధితాధికారులతో సంప్రదించేలా విద్యార్ధులకు సూచించాలన్నారు. కాలేజీ ప్రిన్సిపల్స్ విద్యార్ధినీ విద్యార్ధుల స్కాలర్ షిప్ దరఖాస్తులు సకాలంలో ఆన్లైన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్ధినీ విద్యార్ధులు ఉత్తీర్ణత శాతం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాలేజీల ద్వారా స్వచ్ఛభారత్ అమలుకు ప్రిన్సిపల్స్ వాలెంటరీ సర్వీస్‌గా పరిసరాలు పరిశుభ్రత కొరకు స్వచ్ఛభారత్ నిర్వహించాలని చెప్పారు. ప్రతీ విద్యార్ధినీ విద్యార్ధులు స్వచ్ఛభారత్‌లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్ధినీ విద్యార్ధుల్లో లీడర్షిప్ లక్షణాలు పెంపొందించుకునేందుకు వారిలో చైతన్యం కలగజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లిఖార్జునరెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టరు జెఆర్ లక్ష్మీదేవి, బిసి వెల్ఫేర్ ఆఫీసరు జి. లక్ష్మీప్రసాద్, మైనారిటి వెల్ఫేర్ అధికారి హెచ్‌వి. శేషమూర్తి, జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, కరస్పాండెంటులు పాల్గొన్నారు.


