నిబంధనల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్: జీవీఎంసీ కమిషనర్
- 68 Views
- wadminw
- October 26, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): స్వచ్ఛ భారత్ నిబంధనలు, స్వచ్ఛ సర్వేక్షణ్ సలహాల మేరకు జివిఎంసి అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ దేశంలోనే ముందంజలో ఉన్నట్లు జివిఎంసి కమిషనర్ హరినారాయణన్ పేర్కొన్నారు. కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం విశాఖపట్నం శానిటేషన్ మేకింగ్ అంశాలపై నిర్వహించిన వర్క్‌షాపునకు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యు.ఎస్.ఎయిడ్, డబ్ల్యు.ఎస్.యు.పి.యు.యం.పి బృందం, జివిఎంసి ఇంజినీర్లు, ప్రజారోగ్య అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో బుధవారం పలు అంశాలపై చర్చించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే బృందాలు వచ్చే నాటికి నిర్దేశించిన అన్ని అంశాలలో తర్ఫీదు, నిర్వహణ ద్వారా ఉత్తమ ర్యాంక్ సాధించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డబ్ల్యుఎస్పి చీఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అఖిలేష్ గీతం మాట్లాడుతూ మురికివాడల పరిధిలో ఓడిఎఫ్ నిర్మూలనకోసం శ్రమిస్తున్న కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు శ్రమ ఫలించినట్లయిందని, ఓడిఎఫ్‌లో దేశంలో విశాఖ నగరం ముందంజలో ఉందని వెల్లడించారు. రెండు నెలల కాలం మరింత కృషి చేస్తూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ నగరానికి ప్రథమ స్థానం తథ్యమని పేర్కొన్నారు. జివిఎంసి కమిషనర్ హరిహరనారాయణన్ మాట్లాడుతూ జి.ఐ.ఎస్.మేపింగ్ ప్రతి అంశాన్ని డాక్యుమెంటేషన్ ద్వారా రికార్డు చేయడం, వెబ్సైట్లో పెట్టి సరైన ప్రచారం ఇస్తే విశాఖ చేసిన కృషి స్వచ్ఛ సర్వేక్షణ్ తోపాటు ప్రజలందరూ గుర్తించే అవకాశముంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డబ్ల్యుఎస్యుపి ప్రాజెక్ట్ మేనేజర్ ఉదయ్‌సింగ్ స్వాగతం పలికి స్వచ్ఛ విశాఖ కార్యక్రమాల నిర్వహణ గురించి వివరించారు. చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనురాగ్ అంటోని మాట్లాడుతూ తాము చేసిన సర్వే, వివరాలు డాక్యుమెంట్స్ చేశామని త్వరలో వాటిని అందజేస్తామని పేర్కొన్నారు. శానిటేషన్ మేపింగ్ లక్ష్యాలను వివరించారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి మరింత విస్తృతంగా స్వచ్ఛభారత్ మిషన్ – స్వచ్ఛ సర్వేక్షణ్‌పై వివరించనున్నట్లు ఎడిసి(జెన్) జి.వి.వి.ఎస్.మూర్తి పేర్కొన్నారు. సమావేశానికి అందరు ఇంజినీర్లు, ఎఎంఓహెచ్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు హాజరైనారు.


