నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం: కింజరాపు
నిరుద్యోగ యువతకు వారు ఎంపిక చేసుకున్న రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 4,000 మంది యువతకు శిక్షణ ఇస్తున్నట్టు రాష్ట్ర కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో యువజన సర్వీసుల శాఖ, పోలీసు శాఖల ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత ఆర్మీ, నేవీ, పోలీసు, వైమానిక, తదితర రంగాల ఉద్యోగాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 600 మందికి నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
నెల రోజుల పాటు ఇచ్చే శిక్షణతో ఉపాధి అవకాశాలకు మార్గం సుగమమవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కోసం ప్రభుత్వం రూ. 550 కోట్లు కేటాయించిందన్నారు. తొలి దశలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో రక్షణ, పోలీసు రంగాలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా అధిక నిధులను మంజూరు చేస్తోందన్నారు. జిల్లా యంత్రాంగం స్థలం కేటాయిస్తే క్రీడా శిక్షణ కేంద్రం నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఉద్యోగాలు ఇస్తామని ఎవరు డబ్బులు అడిగినా మోసపోవద్దన్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతిల్లో క్రీడా నగరాలను (స్పోర్ట్స్ సిటీలను) నిర్మిస్తామన్నారు.
ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మంత్రితో మాట్లాడారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ యువత పక్షాన టిడిపి నిలుస్తోందని, అన్ని రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తోందన్నారు. అనంతరం భోజన వసతిని మంత్రి పరిశీలించారు. నిరుద్యోగ యువతతో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మి, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.


