నిర్మల్ జిల్లా ఏర్పాటుకు నిరసనగా బంద్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): నిర్మల్ జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా సంరక్షణ సమితి ఇచ్చిన బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలతోపాటు పెట్రోల్ బంక్‌లు, హోటళ్లు, సినిమా హాళ్లు బంద్ పాటించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగరిత్య, ఇతర పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ బంద్‌కు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్టీసీ డిపో, బస్టాండ్లతోపాటు వివిధ వర్గాల ప్రజలు బంద్‌కు మద్దతు పలికాయి. ఉదయం 6 గంటల నుండి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతోపాటు కార్యకర్తలు జిల్లా సంరక్షణ సమితి నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేసి ఆదిలాబాద్‌కు అన్యాయం చేయవద్దని స్థానిక తెలంగాణ చౌక్ వద్ద చేపట్టిన నిరహార దీక్షలు గురువారంనాటికి 4వ రోజుకు చేరుకున్నాయి. వివిధ పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజలు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. కాగా బంద్‌ను పురస్కరించుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్యాంకులను మూసివేయడంతో లావాదేవిలు పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహిస్తే తగిన గుణపాఠం
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): నిర్మల్ జిల్లాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా సంరక్షణ సమితి నాయకులు చేపట్టిన ఉద్యమం రోజు రోజుకు తీవ్రమవుతోంది. గురువారం బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేశారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌక్ వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఆదిలాబాద్‌కు చెందిన మంత్రి జోగురామన్న కాని, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కనీసం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు వల్ల విద్యా, ఉద్యోగ, రాజకీయపరంగా ఆదిలాబాద్ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని, జిల్లా ఏర్పాటు చేయవద్దని ప్రజలు ఉద్యమిస్తున్న అధికార పార్టీ నాయకులు స్పందించకపోవడం వారి మనోభావాలను కించపరిచడమేనని అన్నారు. జిల్లాను రెండుగా విభజిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని మూడుగా విభజించి నిర్మల్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కేవలం రాజకీయ లబ్ధికోసమేనని విమర్శించారు. జనాభా ప్రతిపదికన జిల్లాలను విభజిస్తే 40 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్‌ను ఎందుకు జిల్లాలుగా విభజించడం లేదని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా ఏర్పాటైతే అధికారుల కొరతతోపాటు ఆదిలాబాద్ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుబడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఓట్లతో గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జోగు రామన్న, టీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిందిపోయి కనీసం మాట్లాడకపోవడం సరైంది కాదని అన్నారు. ప్రజల అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైన ప్రభుత్వం నిర్మల్ జిల్లా నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బల్లాషా కుటుంబానికి నష్టపరిహారం మంజూరు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): జిల్లాలోని పిరాయని మండలంలోని కేయిగూడ గ్రామానికి చెందిన బల్లాషాను పోలీస్ ఇన్ఫార్మర్ నేపంతో మావోయిస్టులు కల్చి చంపిన నేపథ్యంలో ప్రభుత్వం 25 లక్షల రూపాయలను మంజూరు చేసింది. 2015 అక్టోబర్ 30వ తేదీన మావోయిస్టులు ఇతినిని కాల్చి చంపడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గత ఎస్పీ ప్రభుత్వానికి నివేదికలు పంపించిన నేపథ్యంలో బల్లాషా కుటుంబానికి రూ. 25 లక్షల పరిహాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బెల్లింపల్లి డీఎస్పీ రమణారెడ్డి తన కార్యాలయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వు కాపీని అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ము నేరుగా వారి కుటుంబ సభ్యుల ఖాతాలో జమవుతుంది. ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బలాషా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో స్థితిగతులపై ప్రత్యేక పరిశీలన బృందాలు జిల్లాలో పర్యటించి ఆర తీయనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లావ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ వరకు పర్యటించి తనిఖీలు చేపట్టి పాఠశాలలో నెలకొన్న సమస్యలను క్రోడికరించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న పరిస్థితులను, క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పరిశీలన చేపట్టింది. పాఠశాల్లోని మరుగుదొడ్లు, తాగునీటి సమస్య, విద్యుత్ సౌకర్యం తదితర అంశాలతోపాటు ఉపాధ్యాయుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం అమలు తీరు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
ఐటీడీఏతోనే గిరిజనులకు సేవలు: సర్కారు స్పష్టీకరణ
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): జిల్లాల పునర్విస్థీకరణ నేపథ్యంలో కొత్త జిల్లాలలో ఐటీడీఏలను లేదా మినీ ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్ల మేరకు ప్రభుత్వం స్పందించింది. గిరిజనుల అభివృద్ధికి సంబంధించిన పథకాలను అమలు చేస్తున్న ఐటీడీఏ సంస్థను విభజించేది లేదని, కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం ఉన్న ఐటీడీఏ పరిధిలోకే అన్ని గిరిజన మండలాలు వస్తాయని సేవలను యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తెరపడింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాలలో ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని వివిధ పార్టీల నాయకులతోపాటు ఆదివాసి సంఘాలు డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. గిరిజనుల ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు లేక ఉత్నూరు కేంద్రంగా ఏర్పడిన ఐటీడీఏ గిరిజనుల సాంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షిస్తూ కొత్త జిల్లాలుగా ఏర్పాటు కానున్న మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోని గిరిజనులకు సేవలను అందిస్తారని ఆ శాఖ పేర్కొంది. ఇంతకాలం కొత్త ఐటీడీఏల ఏర్పాటు, మినీ ఐటీడీఏల ఏర్పాటు విషయమై నెలకొన్న సందిగ్ధత రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రకటనతో తెరపడింది.


