నెక్కంటి సీఫుడ్స్‌లో రెండోరోజూ గ్యాస్‌లీక్!
- 74 Views
- wadminw
- October 26, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): మానవ సంబంధాల పట్ల, మనిషి ప్రాణాల పట్ల ఆ యాజామాన్యానికి ఎలాంటి బాధ్యతా ఉన్నట్టు కన్పించడం లేదు. దీంతో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని నెక్కంటి సీఫుడ్స్‌లో మరోసారి గ్యాస్ లీకై దాదాపు 30 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఆఘమేఘాలపై కాకినాడ నూకాలమ్మ గుడి జంక్షన్‌లోని సంజీవి ఆసుపత్రికి తరలివచ్చారు. ఆస్పత్రిలో కావాల్సినన్ని స్ట్రెచర్లు గానీ, వీల్ చైర్లు గానీ లేకపోవడంతో కొంతమందిని మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. పెద్దాపురం నుంచి నేరుగా నెక్కంటి సంస్థ యాజమాన్యానికి చెందిన బస్సులో బాధితులంతా తరలివచ్చారు. అంతకు ముందు దాదాపు అరడజన్ మంది బాధితులు వేరువేరు మార్గాల్లో ఆస్పత్రిలో చేరడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన గ్యాస్ లీక్‌లో యాజమాన్యానికి ఎలాంటి కనువిప్పు జరగలేదని రెండోసారి సంఘటన ద్వారా స్పష్టమౌతోందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో మంగళవారం సంఘటన అనంతరం సంస్థ కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేయాల్సిన అధికార యంత్రాంగం యాజమాన్యంతో కుమ్మక్కై చూసీ చూడనట్టు వదిలిపెట్టడంతో బుధవారం యధావిధిగా కార్మికులు పనిలోకి రావడం, తిరిగి అమ్మోనియా గ్యాస్ లీక్‌తో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం చర్వితచరణమైంది. రొయ్యలోడ్ స్టాక్ సంస్థ ఆవరణలో పెద్ద ఎత్తున ఉండిపోవడంతో సరుకు పాడవకుండా ప్రోసెసింగ్ నడిపేందుకు కార్యాచరణకు ఉపక్రమించడం, అదే సమయంలో లీక్‌కు సంబంధించి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో రెండోసారి ప్రమాదం సంభవించిందని పేర్కొంటున్నారు. పెద్దాపురం సమీపంలోని నెక్కంటి సీఫుడ్స్‌కు కాకినాడ సంజీవి ఆసుపత్రికి బాదరాయణ సంబంధం ఉండటంతో బాధితులందరూ ఇక్కడికే వస్తున్నారు. వీరికి వెనువెంటనే వైద్యం చేసేందుకు సౌకర్యాల కల్పన అంతంతమాత్రమే అయినా మిగిలిన ఇన్పేషెండ్, అవుట్ పేషంట్లను పక్కనపెట్టి గ్యాస్‌లీక్ బాధితులపై దృష్టి సారించాల్సి వస్తోందని ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి నియోజకవర్గం అయివున్నందున ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతుండటం చర్చనీయాంశమైంది. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం, ఇతర అధికారులు చుట్టపుచూపుగా ఫ్యాక్టరీకి వస్తూ, పోతూ ఎలాంటి సమాచారం పత్రికలకు ఇవ్వకుండా జరిగింది, బాధితులు ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స అందుతోంది. ఇలా ముక్తసరిగా మూడు ముక్కల్లో విషయాన్ని తెల్చేస్తున్నారు. ఫ్యాక్టరీలో జరిగిన సంఘటనపై ఇంత వరకూ సంబంధిత పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన దాఖలాలు కూడా లేకపోవడంతో పాలక సామాజికవర్గానికి చెందిన యాజమాన్య సంస్థపై అధికార యంత్రాంగానికి ఎంత ప్రేమో స్పష్టమౌతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా వుండగా ఇప్పటికే మంగళవారం జాయిన్ అయిన బాధితులు కాకినాడ సంజీవి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బుధవారం వీరికి తోడుగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మరో 30 మంది తోడై ఆస్పత్రి ప్రాంగణమంతా అల్లకల్లోలంగా వుంది. ఆస్పత్రి ఆవరణలో ఉన్న లిఫ్ట్ మరోపక్క బాగు చేసేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేసుకుంటోంది. మంగళవారం ఉదయం ఈ లిఫ్ట్‌లో ఉపముఖ్యమంత్రి హోదాలో నిమ్మకాయల చినరాజప్ప మూడవ అంతస్తు నుంచి కిందికి రావడానికి ఎక్కి లిఫ్ట్ ప్రమాదానికి గురవడంతో స్వల్పంగా గాయపడ్డ విషయం పాఠకులకు విదితమే. వీరితోపాటు ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌కు, టివి కెమేరామెన్ హసన్‌కు కాళ్లు విరిగిన సంఘటనతో పాటు మరో ముగ్గురు ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే లిఫ్ట్‌లో ఉన్నవార్ని బయటకు తీసుకొచ్చే క్రమంలో హోంమంత్రిని పక్కకు తప్పించాక గాయపడ్డ టివి కెమేరామెన్ హసన్‌ను స్ట్రెచర్‌పై వుంచి అదే లిఫ్ట్‌లో మూడో అంతస్తుకు తీసుకెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో లిఫ్ట్ వైర్ తెగిపడిందా? లేక వేరే ఇతర సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్ కిందికి పడిపోయిందో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు. రాజప్ప కేవలంహోంమంత్రిగానే గాక ఉపముఖ్యమంత్రిగా కూడా ఉండటంతో ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులను ఎలా అనుమతించారన్నది ప్రశ్నార్ధకంగా వుంది. అలాగే కాలు విరిగిన కానిస్టేబుల్ ఒక్కరే రాజప్పకు సెక్యూరిటీగా వెళ్లడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఉపముఖ్యమంత్రికి ఎస్సై స్థాయి అధికారి కూడా లేకపోవడమేంటన్న పెదవి విరుపులు విన్పిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ ఈ సంఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించాల్సిన అవసరం వుందంటున్నారు.
వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణానికి ముహూర్తం
కాకినాడ, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కాలువగట్టు రోడ్డు వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవం నిమిత్తం నల్లమిల్లి వెంకటరామరెడ్డి (ధర్మకర్త) దంపతులు, చింతాడ వీరభద్రరావు దంపతులు చేతులమీదుగా బుధవారం రాట ముహూర్తం నిర్వహించారు. 9.11.16 నుంచి 20.11.16 వరకు కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతాయని, చివరిరోజు భారీ అన్నసమారాధన జరుగుతుందని సంఘ అధ్యక్షుడు మేడా తాతాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైబీఎస్ ఆచార్యులు శ్రీను, లక్ష్మణరావు, కొండ తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుండగా, సత్యదేవుని నామస్మరణతో రత్నగిరి మార్మోగిపోయింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని వందలాది మంది భక్తులు సత్యదీక్షాధారణ చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అడ్డతీగలలో సుమారు 500 మంది వరకు సత్యదీక్ష ధరించారు. సత్యదేవుని జన్మనక్షత్రం మఖ పర్వదినం సందర్భంగా దీక్షలు ప్రారంభమయ్యాయి. మఖ నక్షత్రం కావడంతో ప్రధానాలయంలోని సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారు, పరమేశ్వరుడుల మూలవిరాట్‌కు తెల్లవారుజాము 2 గంటల నుంచి అర్చకులు, పండితులు, పురోహితుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆయుష్యహోమం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం పెద్దసంఖ్యలో భక్తులు సత్యదీక్షలు ధరించారు. అర్చకులు వీరికి మాలధారణ చేశారు. దేవస్థానం నుంచి సుమారు 420 మంది భక్తులు దీక్షమాల అందించగా, గ్రామంలో, ఇతర ప్రాంతాల్లో సుమారు 300 మంది వరకు దీక్ష ధరించారు. అంతేకాకుండా అడ్డతీగలలో సుమారు 500 మంది భక్తులు మాలధరించగా వీరికి దేవస్థానం తరపున ప్రత్యేకంగా వస్త్రాలను ఉచితంగా అందించారు. మరోవైపు, సుమారు 30-40 ఏళ్లక్రితం శాశ్వత వ్రతాలు, శాశ్వత కల్యాణాలకు భక్తులు రుసుం చెల్లించి పదేళ్లు దాటితే అటువంటి వారికి ఓసారి ఉచితంగా వ్రతం, లేదా కల్యాణం చేయిస్తామని ఈవో నాగేశ్వరరావు తెలిపారు. 2010 తర్వాత శాశ్వతపూజలకు రుసుం చెల్లించినవారికి పదేళ్లపాటు ఉచిత పూజలు చేయడానికి కాలపరిమితి విధించగా 2010కు ముందు ఈ పథకంలో రుసుం చెల్లించినవారికి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పదేళ్ల కాలపరిమితి విధించి, వారికి ఉచిత పూజలు చేయడాన్ని నిలిపివేశారు. దీనిపై మీడియాలో వచ్చిన కథనాలకు దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ స్పందించి ఈవో నాగేశ్వరరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాశ్వత పూజలకు చెల్లించిన భక్తులకు ఎందుకు ఉచిత పూజలుచేయడం లేదని ప్రశ్శించారు. 2013లో వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఈవో వివరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. 2010కు ముందు శాశ్వత పూజలకు చెల్లించిన భక్తులకు ముందుస్తు సమాచారం లేకుండా పూజలు నిలిపివేయడం సరికాదని చెప్పడంతో దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. శాశ్వత పూజలకు రుసుం చెల్లించి పదేళ్లుదాటిన భక్తులు ఉచిత పూజలకు దేవస్థానానికి వస్తే వారికి పూజలు చేయించి తర్వాత వారికి పరిస్థితి వివరించాలని నిర్ణయించారు. శాశ్వత పూజలకు రుసుం చెల్లించి పదేళ్లు దాటితే అటువంటి వారందరికీ కాలపరిమితి విధించిన విషయం, దీనికి గల కారణం భక్తులకు వివరించి వారిని సంతృప్తిచెందేలా చర్యలు తీసుకోనున్నారు. భక్తులు మాత్రం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతపూజల భక్తులకు ఇలా కాలపరిమితి విధించడం సరికాదంటున్నారు. నిబంధనల ప్రకారం శాశ్వత పూజలకు కొన్నేళ్లక్రితం తాము చెల్లించిన సొమ్ముపై వచ్చే వడ్డీతోనే ప్రతీఏటా తమకు ఉచిత పూజ నిర్వహించేవారని భక్తులు అంటున్నారు. ఇన్నాళ్లు ఇలా వచ్చిన వడ్డీతోనే పూజలు చేయగా, అసలు చెల్లించిన సొమ్ము పరిస్థితి ఏంటని భక్తులు ప్రశ్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో తాము గతంలో చెల్లించిన సొమ్మును తమ పేరు మీద విరాళంగానైనా మళ్లించాలని కొందరు భక్తులు కోరుతున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
కాకినాడ, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రంగంపేట మండలంలోని వడిసలేరు ఏడీబీ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులనురాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి లోయలో పడిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రంపచోడవరంలోని మెనోరా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, బిక్కవోలు మండలం బలభద్రపురం ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మోటారు సైకిల్‌పై అనపర్తికి వెళ్తున్న ఇతనిని వెనుకవైపు నుంచి వచ్చిన మినీ వ్యాను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు 108కి కాల్ చేసినా సమయానికి రాలేదు. అయితే అదే సమయంలో కాకినాడ వైపు నుంచి వస్తున్న అనపర్తి ఎస్సై కిషోర్‌బాబు ప్రమాదాన్ని గమనించి ఆ వ్యక్తిని తన జీపులో తీసుకుని వెళ్లారు. వ్యక్తి పరిస్థితి విషమంగా వుందని తెలిసింది. మరోవైపు, తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సింగన్నగూడెం వద్ద విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు తరలిస్తున్న వాహనం దగ్ధమైంది. ఏపీఈపీడీసీఎల్ అధికారులు బొమ్మూరు నుంచి నెల్లిపాకకు లారీలో విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లను తరలిస్తుండగా మావోయిస్టులు నిప్పంటించి ఉంటారని భావిస్తున్నారు. ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.


