నెక్కంటి సీఫుడ్స్ అక్రమాల పుట్ట!
- 65 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
కాకినాడ, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): దాదాపు ముప్పైమందిని ఆస్పత్రిపాలు చేసిన నెక్కంటి సీఫుడ్స్ అన్ని విభాగాలను అదుపుచేసి యదేచ్ఛగా ఫ్యాక్టరీ రన్ చేసేస్తోన్నట్టు అనుమానమొస్తోంది. ఈ ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి దాటాక అమ్మోనియం గ్యాస్ లీకైన సందర్భంగా సాధారణ పనివారు, చిరుద్యోగులు అస్వస్థతకు గురై ఆసుపత్రులకు పరుగులు తీశారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సమీపంలోని కట్టమూరు అడ్డరోడ్డు నుంచి జె.తిమ్మాపురం వెళ్తున్న రోడ్డుకు దగ్గరగా నెలకొల్పిన నెక్కంటి సీఫుడ్స్ ఒక అక్రమాల పుట్టగా సాగిపోతోంది.
సామాజిక బాధ్యతగా విలేకర్లు అస్వస్థతకు ఎందుకు గురయ్యారన్న సమాచారం సేకరించేందుకు వెళ్లగా సెక్యూరిటీ పేరుతో లోనికి అనుమతించకుండా యజమాన్యం హల్చల్ చేసింది. అడ్డుకుంటున్న సెక్యూరిటీ సిబ్బందికే కాదు అందులో పనిచేసే ఉద్యోగులకు, రోజువారీ మహిళా కూలీలకు నెలవారీ వేతనం సమయానికివ్వకుండా ఏడిపించుకుతింటున్న ఈ యాజమాన్యంపై ప్రభుత్వ విభాగాల అధికారులకు ఎంత ఆప్యాయతో ఇక్కడి పరిస్థితి చూస్తే అర్ధమౌతుంది.
విషయమేమిటని అడుగుతుంటే పోలీస్లు సరే వారి సహజసిద్ధ స్వభావంతో గెంటేందుకు ప్రయత్నించడం ఆయనవాయితీ అయితే రెవెన్యూ యంత్రాంగం కూడా పోలీస్ ఎంక్వైరీ జరుగుతోందని, తామేమీ చెప్పలేమని తప్పించుకుంటున్నారు. చివరికి కాలుష్యనియంత్రణ మండలి (పీసీబీ) విభాగం కూడా ఈ కంపెనీకి కొమ్ముకాస్తోందని చుట్టుపక్కల గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిశ్రమలను అడ్డదిడ్డంగా నెలకొల్పి భోపాల్ కార్బైడ్ లీక్ సంఘటన మాదిరిగా నిదట్లోనే ప్రజానీకాన్ని యమపురికి సాగనంపేలా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ మీదుగా వెళ్తుంటే పాదాచారులు, వాహనదారులు ముక్కులు మూసుకోవాల్సిందే.
కాలుష్య కోరలు చాస్తూ చుట్టుపక్కల పొలాలను పాడుచేస్త అరకొర జీతాలిస్తూ యాజమాన్య మానవశ్రమపై బతికేస్తోందని పరిస్థితి చూస్తే స్పష్టమౌతోంది. ఈ పరిశ్రమ సీఫుడ్స్కు సంబంధించింది కనుక రొయ్యలను తెచ్చి పొట్టు తీసి శుభ్రం చేసి ఆహార పదార్ధంగా తయారుచేసి, అనంతరం ప్యాకింగ్ చేసి పంపడం, మిగిలిన చెత్తను కోళ్ల దాణాగా ఉపయోగించేలా వృధా కాకుండా వ్యాపారం చేస్తోంది. ఇందుకోసం జనరల్ షిప్ట్ కాకుండా రోజుకు రెండు షిఫ్టుల పేరిట దాదాపు 300 మంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది.
పనివరకు 8 గంటలే కానీ ఒక్కొక్క మహిళకు రోజుకు రూ.180లు కూలీ మాత్రమే ఇవ్వడం రివాజుగా వస్తోందని, పెంచమన్నా పెంచరని మహిళలు వాపోతున్నారు. నెలలో 4 రోజుల శెలవు వున్నప్పటికీ పనిలో పక్కకు తిరిగి చూడటానికి కూడా అవకాశం ఇవ్వరన్నారు. వెట్టిచాకిరీ పేరుతో ఎక్కువమంది మహిళలే పనిచేసే ఈ పరిశ్రమలో పూర్తిగా పారదర్శకత లోపించి, సుప్రీంకోర్టు తీర్పును సైతం కాలదన్ని అరకొర వేతనాలు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. రొయ్యను శుభ్రం చేయడం దగ్గర్నుంచీ ఏసీలోనే పనిచేస్తున్నప్పటికీ వీరికి ఎలాంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదని, వాటి నుంచి వచ్చే వాసన, ఇతరత్రా ఉండే ఇబ్బందులు ఏనాడూ పట్టించుకోలేదని వాపోతున్నారు.
ఈ ఫ్యాక్టరీ బహిరంగంగా కన్పిస్తున్నా కనీసం పైకి బోర్డు కూడా పెట్టకుండా కోట్లాది రూపాయల వ్యాపారం చేసుకుంటూ బోగస్ కంపెనీగా రన్ అవుతోందా అన్న అనుమానాలు కల్గుతున్నాయి. అలాగే ప్రధాన గేటు మూసేసి తెరిచి లోపలికి వెళ్లేందుకు అడ్డుచెబుతూ తనిఖీకి అధికార్లు వచ్చినా లోపలి నుంచి అనుమతి వస్తేనే పంపేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతే కాకుండా ఈ ఫ్యాక్టరీలో బాల కార్మికులు లేరన్న కుంకుడుకాయ సైజు అక్షరాలతో బోర్డుపెట్టి నెట్టుకొచ్చేస్తోంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్ధాలు చుట్టుపక్కల పొలాలకు నష్టం చేకూరుస్తున్నప్పటికీ యాజమాన్యం ఏ మాత్రం చలించక పెత్తందారీపాత్ర పోషిస్తూ దరిదాపులకు రానివ్వడం లేదని రైతాంగం సైతం వాపోతోంది.
అసలక్కడ రొయ్యల్ని మాత్రమే తెచ్చి గ్రేడింగ్ చేసి ఆహార తయారీ చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అన్నదానికి కూడా తగిన సమాచారం లేక చెప్పింది రాసుకునే తంతుగానే వ్యవహారం నడుస్తోందని, ప్రభుత్వాధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజానీకం కోరుతోంది. గ్యాస్ లీకైన ప్రమాదంలో అస్వస్థతకు గురైన బాధితులు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ప్రాణాలకు ప్రమాదం లేదని చెబుతున్నప్పటికీ, తదుపరి మళ్లీ అదే ప్రాంతానికి వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇబ్బందులు పడక తప్పదని భయపడుతున్నారు. రక్షణ వ్యవస్థ ఇక్కడ పూర్తి కొరవడిందని, అగ్నిమాపక విభాగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కార్మిక శాఖ, రెవెన్యూ పోలీస్ అధికారులు సంయుక్తంగా దృష్టి సారించి ఫ్యాక్టరీని సీజ్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, సిఐటియు తదితర ప్రజా సంఘాలు ఫ్యాక్టరీని సీజ్ చేయాలని, పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గేటువద్ద ధర్నా నిర్వహించింది. కాగా, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని కట్టమూరు జె.తిమ్మాపురం ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న నెక్కంటి సీఫుడ్స్ పరిశ్రమలో సోమవారం అర్థరాత్రి గ్యాస్ లీకై 50 మంది మహిళలు ఆస్వస్థతకు గురైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పరిశ్రమ సమీపంలో గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
పెద్దాపురం పోలీసులు పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. పోలీసులు పరిశ్రమ లోపలి ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ పనిచేస్తున్న మహిళల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పరిశ్రమలో గ్యాస్ లీకేజీ కాలేదని తేల్చి చెప్పారు. ఏలేశ్వరం నుంచి పరిశ్రమలో పని చేయడానికి వచ్చిన రాజీ, భవానీ అనే ఇద్దరు మహిళలు వాతావరణం అనుకూలించక పోవడంతో అస్వస్థతకు గురయ్యారని, మెరుగైన చికిత్స కోసం వారిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పెద్దాపురం ఎస్సై సతీష్ తెలిపారు.


