నెట్లో వెబ్ బ్రౌజర్ అంటే ఏమిటి?
- 97 Views
- wadminw
- January 8, 2017
- Home Slider అంతర్జాతీయం
నెట్లో వెబ్ బ్రౌజర్ అంటే ఏమిటి? తెలుసుకునేముందు బ్రౌజర్ అంటే ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. కంప్యూటర్ యుగానికి ముందే ఈ మాట ఇంగ్లీషు భాషలో వాడుకలో ఉంది. గ్రంథాలయానికి వెళ్లినప్పుడు కాని, పుస్తకాల దుకాణానికి వెళ్లినప్పుడు కాని మనం సాధారణంగా అట్ట మీద బొమ్మ చూసో, పేరు చూసో ఒక పుస్తకాన్ని ఎన్నుకుని విప్పి చూస్తాం. ఒక నిమిషం పోయిన తరువాత ఆ పుస్తకాన్ని తిరిగి బీరువాలో పెట్టెస్తాం. మరొక పుస్తకం తీస్తాం, చూస్తాం, పెట్టెస్తాం. ఈ రకం పనిని బ్రౌజింగ్ అంటారు.
ఈ పని చేసే వ్యక్తిని బ్రౌజర్ అంటారు. అంటే తెలుగులో చూడ్డం, పరిశీలించడం, వీక్షించడం వగైరా పనులని వీక్షించడం అనిన్నీ, ఆ పని చేసే వ్యక్తిని వీక్షకి అనిన్నీ అందాం. చీరల కొట్లోకి వెళ్లి మన ఆడవాళ్లు చేసే పనిని కూడా బ్రౌజింగ్ అనొచ్చు. అంతర్జాలంలో విహరించడానికి ఉపయోగపడే సాధనం కనుక దీనిని తెలుగులో విహరిణి అంటున్నారు. వెబ్ బ్రౌజింగ్ అంటే జాల విహారం. అంటే, పైన చెప్పిన పనినే పుస్తకాల దుకాణంలోనో, గ్రంథాలయంలోనో, చీరల కొట్లోనో కాకుండా పపప మీద చెయ్యడం.
వరల్డ్ వైడ్ వెబ్ (పపప) అంటే ప్రపంచవ్యాప్త పట్టు పుటల సమాహారం అనుకున్నాం కదా. మనం మన ఇంట్లో మన కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పేజీలన్నీటిని ఎలా చూడడం? ఈ పని చెయ్యడానికి ప్రత్యేకంగా రాసిన ఒక క్రమణిక (ప్రోగ్రాం) కావాలి. ఈ క్రమణికనే వెబ్ బ్రౌజర్ అంటారు. వెబ్ బ్రౌజర్ అంటే నిరవాకి (ఆపరేటింగ్ సిస్టమ్) కాదు, అన్వేషణ యంత్రం (సెర్స్ ఇంజిన్) కాదు. ఈ వెబ్ బ్రౌజర్ అనే క్రమణికకి మనం ఒక వెబ్ సైటు చిరునామా ఇస్తే ఆ చిరునామా గల పట్టుపుటలో ఏముందో వెబ్ బ్రౌజర్ తెర మీద చూపిస్తుంది. కనుక దీనిని పట్టు దర్శని అనొచ్చు. మనకి బజారులో రకరకాలైన పట్టు దర్శనులు దొరుకుతున్నాయి.
మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు ఎక్స్ప్లోరర్కి మద్దత్తు ఇస్తే, ఏపిల్ కంపెనీ వారు సఫారీకి మద్దత్తు ఇస్తోంది. గూగుల్ కంపెనీ వారు క్రోంని వెనకేసుకొస్తున్నారు. ఏ కంపెనీకి చెందని జనతా దర్శని పేరు ఫైర్ఫాక్స్ . ఒకరి గణాంకాల ప్రకారం వీటన్నిటిలోను ఎక్కువ జనాదరణ పొందినవి. ఆ క్రమంలో, క్రోం, ఫైర్ఫాక్స్, ఎక్స్ప్లోరర్, సఫారీ. తమాషా ఏమిటంటే అన్ని దేశాలలోనూ ఈ జనాదరణ ఒకేలా లేదు. ఇక్కడ చెప్పిన గణాంకాలు బల్ల మీద పెట్టుకుని వాడుకునే కంప్యూటర్ల విషయంలోనే.
అరచేతిలో ఇమిడే కంప్యూటర్ల విషయానికి వస్తే సఫారీ ఎక్కువ ఆదరణలో ఉన్నట్లు కనిపిస్తోంది. కనుక గణాంకాలని గభీమని గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. రహదారులు ఉండబట్టి మనకి రవాణా సౌకర్యాలు లభించినట్లే, ఇంటర్నెటు ఉండటం వల్ల మనకి అనేకమైన సౌకర్యాలు, సేవలు లభిస్తున్నాయి. రహదారురహదారులు వెంబడి టపాలు బట్వాడా చేసినట్లే అంతర్జాలం మీద బట్వాడా అయే టపాలని ఈ-టపా లేక ఈ-మెయిలు అంటారు. ఇక్కడ ఈ అనే అక్షరం ఇంగ్లీషులో ఎలక్ట్రానిక్ అనే మాటకి సంక్షిప్తం.
కావలిస్తే దీనిని తెలుగులో విద్యుత్-టపా లేదా వి-టపా అనొచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెటులో అత్యధికంగా లభించే సేవ. ఇందులో వెబ్ సైట్సు, బ్లాగులు, మొదలయిన ఎన్నో పేజీలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారాన్ని మనం వాడుకనేందుకు వాడే సాఫ్టువేర్ అనువర్తనాన్ని బ్రౌజర్ లేదా విహరిణి అంటారు. వెబ్ తరువాత ఇంటర్నెటులో ఈ-మెయిల్ అత్యధికంగా ఉపయోగించబడే సేవ. మన పోస్టలు సేవకు మల్లేనే ఇందులో మనము ఉత్తరాలు వాటికి ప్రత్యుత్తరాలు పంపించుకోవచ్చు.
కాకపోతే ఇక్కడ మనకు కాగితం అవసరంలేదు. కేవలం సమాచారం ఉంటే చాలు. చాటింగ్ లేదా ఇన్స్టెంట్ మెసేజింగ్ కూడా ఈ-మెయిల్ వంటిదే, కానీ సమాచారమును మరింత తొందరగా చేరవేస్తుంది, కాకపోతే కొద్ది సమాచారమును మాత్రమే పంపించగలము.


