నేటి నుంచి చంద్రన్న కానుకల పంపిణీ
- 81 Views
- wadminw
- December 21, 2016
- రాష్ట్రీయం
పశ్చిమ గోదావరి జిల్లాలో 11.36 లక్షల కుటుంబాలకు చంద్రన్న కానుకగా ఆరు రకాల నిత్యావసర సరుకులు ఉన్న సంచుల పంపిణీని ఈనెల 21న ప్రారంభిస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. ఏలూరు వ్యవసాయమార్కెట్ యార్డు గోదాములో ఉన్న చంద్రన్న సరుకులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాల సందర్భంగా తెల్ల రేషన్‌కార్డుదారులకు రూ.400 విలువైన అరకిలో చొప్పున కందిపప్పు, శనగపప్పు, బెల్లం, కిలో గోధుమపిండి, అరలీటరు పామాయిల్, 100 గ్రాముల నెయ్యి ప్యాకెట్లను అందిస్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ కానుక కింద జిల్లాలో దాదాపు మూడు లక్షల కుటుంబాలకు 2200 చౌకదుకాణాల ద్వారా ఈ నెల 21 నుంచి చంద్రన్న సరుకుల కిట్‌ను పంపిణీ చేస్తామన్నారు.
దీనికి అవసరమైన వాహనాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచి సరుకులను దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సరుకుల విషయంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించినట్లు తెలిపారు. నాణ్యతలో తేడాలొస్తే వెనక్కి పంపి నాణ్యత గల సరుకులను అందచేస్తామని చెప్పారు. జిల్లాకు వచ్చిన సరకుల శాంపిల్స్నుగుంటూరు ల్యాబ్‌కు పంపించగా నాణ్యతతో ఉన్నట్లు ధ్రువీకరించారని తెలిపారు. గతంలో పంపిణీ చేసిన చంద్రన్న కానుకల్లో బెల్లం నాసిరకంగా ఉందని విమర్శలు రావటంతో ఈసారి దానిని కూడా ప్యాకింగ్ చేసి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జేసీ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శివశంకరరెడ్డి, జిల్లా మేనేజర్ ఎం.గణపతిరావు, సహాయ మేనేజర్ డి.షర్మిల, గోదాము ఇన్‌ఛార్జి బద్రీనాథ్ తదితరులు ఉన్నారు.


