నేటి నుంచి జీఎస్ఎల్వీ కౌంట్‌డౌన్
- 88 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
నెల్లూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి గురువారం నింగిలోనికి పంపనున్న జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం ఉదయం 11.10 గంటలకు ప్రారంభంకానుంది. ఈ ప్రక్రియ నిరంతరాయంగా 29గంటల పాటు కొనసాగిన పిదప రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
దీని ద్వారా ఇన్షాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఉపగ్రహం పూర్తిగా వాతావరణ పరిశోధనకు సంబంధించినది. ఇప్పటికే సీనియర్ శాస్త్రవేత్తలు షార్కు చేరేకొని ఏర్పాట్లుపర్యవేక్షిస్తున్నారు. ప్రయోగానికి ముందుగా జరిగే రాకెట్ సన్నద్దత సమావేశం సోమవారం రాత్రి జరిగింది. ఇందులో రాకెట్ ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటించారు. అనంతరం ల్యాబ్ మీటింగ్ జరిగింది. అలాగే ఈ నెల 26న పీఎస్ఎల్వీ-సీ35 ప్రయోగం నిర్వహించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి
నెల్లూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): దుత్తలూరు మండలం నందిపాడు గ్రామం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా వారి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన విజయారెడ్డి (35), శ్రావణి (27) వీరు తన కుమారుడితో కలిసి మోటారుబైక్పై దుత్తలూరు నుండి కడపకు వెళ్తున్నారు. ఉదయగిరి నుండి దుత్తలూరు వైపుకు వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొన్నది. దీంతో సంఘటనాస్థలంలోనే దంపతులు మృతి చెందారు. కుమారుడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దుత్తలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రొయ్యల సాగుకే పరిమితమైన అమ్మోనియా డీవో (ఆక్సిజన్ తగ్గిపోవడం) సమస్య తాజాగా చేపలను వెంటాడింది. ఈ సమస్యతో రూ.25 లక్షల విలువైన చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం మజరా కాల్వములకండ్రిగలో చోటుచేసుకుంది. కుడితిపాళెం చెందిన మెట్టా సుబ్బారెడ్డి కాల్వములకండ్రిగలో 12 ఎకరాల్లో 15 ఏళ్లుగా చేపలు సాగు చేస్తున్నారు. రెండురోజుల క్రితం చేపలు గుంటల్లో తేలిపోయాయి. వీటిని పరీక్షించి చూడగా అమ్మోనియా డీవో సమస్యతో మృత్యువాత పడ్డాయని పరీక్షల్లో తేలింది. అమ్మోనియా ఎక్కువవడం, ఆక్సిజన్ తగ్గిపోవడంతో 25 టన్నుల చేపలు పట్టేందుకే వీల్లేనివిధంగా దెబ్బతిన్నాయి. పది నెలలు సాగు చేసి పంట చేతికొచ్చే సమయంలో నష్టపోవడంతో రైతుకు రూ.25 లక్షల నష్టం వచ్చింది. రొయ్యలకు సోకే ఈ వ్యాధులు చేపలకు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు గుర్తించి న్యాయం చేయాలని బాధితుడు జిల్లా మత్స్యశాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. శాస్త్రవేత్తలు ఈ వ్యాధులను గుర్తించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
కోడలిపై హత్యాయత్నం కేసులో అత్త అరెస్టు
నెల్లూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): అదనపు కట్నం కోసం వేధించారు. అంతలోనే ఆడపిల్ల పుట్టింది. దీంతో వేధింపులు మరింత పెరిగాయి. మళ్లీ కడుపులో ఆడబిడ్డ పెరుగుతోందని ఆ ఇద్దరు ఆడాళ్లు (అత్తా, ఆడబిడ్డ) తట్టుకోలేకపోయారు. ఎలాగైనా కోడలిని హతమార్చి కొడుక్కి రెండోపెళ్లి చేసి మరింత కట్నం తీసుకోవాలని నిర్ణయించి పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదీ ముత్తుకూరులో గిరిజపై జరిగిన హత్యాయత్నం తీరు. సాటి ఆడదని కూడా చూడకుండా కడుపులో మరో ఆడబిడ్డ పెరుగుతోందని తెలిసి కోడలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన అత్తని ఆమె కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గిరిజకు ముత్తుకూరు మండలం బోడిస్వామి కండ్రిగ గ్రామానికి చెందిన తాండ్ర శ్రీనివాసులుతో 14-8-2014న వివాహమైంది. కొంతకాలం నుంచి అత్త లక్ష్మీ కాంతమ్మ, ఆడబిడ్డ సుభాషిణి గిరిజను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ క్రమంలో గిరిజకు ఆడబిడ్డ పుట్టింది. దీంతో వేధింపులు ఎక్కువయ్యాయి. కొన్ని నెలలు గడిచాక గిరిజ తిరిగి గర్భం దాల్చింది. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. అయితే కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డని ఒక భూత వైద్యుడు చెప్పిన మాటలను నమ్మి ఆమెను, కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపి శ్రీనివాసులుకు రెండో పెళ్లి చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో భర్త ఇంట్లోలేని సమయంలో గిరిజపై కిరోసిన్ పోసి చంపేందుకు యత్నించారు. దీనిపై ముత్తుకూరు పోలీసులు కేసునమోదు చేశారు. దర్యాప్తులో లక్ష్మీకాంతమ్మ, సుభాషిణిను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.


