నేడు ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా
- 69 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
తిరుపతి, అక్టోబర్ 25 (న్యూస్టైమ్): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రొగ్రెసీవ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గిరిప్రసాద్ మంగళవారం ఇక్కడ తెలిపారు. ఉపాధ్యాయ డిమాండ్ల సాధనకు ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల సఎదుట ఆందోళన చేపడుతున్నామన్నారు.
సీపీఎస్ రద్దు చేయాలి, రూ.12లక్షల గ్రాడ్యుటీ చెల్లింపు ఉత్తర్వులు, ప్రత్యేక బీమా సౌకర్యం ఏర్పాటు, డీఎస్సీ 2008 హామీ పత్రాల ఉపాధ్యాయులకు 2012 ఉపాధ్యాయులతో సమానంగా వేతనస్థీకరణ, పంచాయతీరాజ్, ఎయిడెడ్, పురపాలక ఉపాధ్యాయుల ఆర్జిత సెలవును నగదుగా మార్చుకొనేందుకు అవకాశం ఇవ్వాలి. రూ.398 వేతన సర్వీసును నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, సర్వీసు రూల్స్ ప్రక్రియను వేగవంతం చేయాలి. 2014 జూన్ 2నుంచి 2015 మార్చి 31వరకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.


