నేడు విశాఖలో జాతీయ విద్యా సదస్సు
విశాఖపట్నం, అక్టోబబర్ 4 (న్యూస్టైమ్): ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం విశాఖపట్నంలో జాతీయ విద్యా సదస్సును నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జీ. హృదయరాజు, ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు కె. సుబ్బారెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. అఖిల భారత విద్యా సంఘాల సమాఖ్య(ఏఐఎఫ్ఈఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఉపాధ్యాయుని విలువలు – వృత్తి ఔన్నత్వాన్ని పెంపొందించుట అంశంపై జాతీయ నాయకులు ప్రసంగాలు ఉంటాయని చెప్పారు. 11 రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరౌతున్న ఈ సదస్సులో ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, ప్రజాతంత్రవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
కాగా, విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సాహించాలని ఎన్.ఎస్.టి.ఎల్. రామ్నాత్ సెకండరీ హై స్కూల్ ప్రిన్సిపల్ సి.వి.నరసింహం అన్నారు. తాటిచెట్లపాలెంలోని వాల్తేరు కేంద్రీయ విద్యాలయంలో సోషల్, సైన్స్ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాట పరిశోధనలు, సంస్కృతీ సంప్రదాయాలు, క్రీడలు వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన వాల్తేరు కేవీ ప్రిన్సిపల్ పి.కె.పురోహిత్ మాట్లాడుతూ చిన్నారుల మేథస్సును విద్యార్ధి దశలోనే వికసింపచేస్తే అద్భుతాలు సృష్టించివచ్చన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వాల్తేరు కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్, సైన్స్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
విద్యార్థులు పలు సైన్స్ అంశాలతో పాటు వివిధ దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలపై నమూనాలను తయారుచేసి ప్రదర్శించారు. ఆస్ట్రేలియా, ఆమెరికా, ఐరోపా వంటి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆయా దేశాల భౌగోళిక అంశాలు గురించి తెలియజేసే నమునాలు అక్కడి జీవన విధానానికి అద్దం పట్టాయి. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


