నేతాజీ ‘మీస్టరీ’ విడేనా?
దేశ అగ్రశ్రేణి స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, దేశ స్వేచ్ఛా వాయువులు పీల్చాలని భావించిన గొప్ప దిశాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్ళను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయట పెట్టడం హర్షనీయం. 12 వేల పుటలకు పైగా ఉన్న 64 ఫైళ్ళలో ఎంతో సమాచారం దాగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫైళ్ళలో విలువైన సమచారం ఉన్నదా, ఏయే అంశాలు ఉన్నాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేనప్పటికీ వీటిని బయట పెట్టినందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అభినందించవలసిందే. ఇకపోతే 70 ఏళ్ల క్రితం ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో చాలా మార్పులు వచ్చాయి. సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది.
చైనాలో రాజకీయ వ్యవస్థ మారిపోయింది. ప్రచ్ఛన్న యుద్దం ముగిసిన తరువాత పాశ్చాత్య దేశాలు పాత కాలపు ఫైళ్ళను బయట పెడుతున్నాయి. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం నాటి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సమాచారం తమ దగ్గర లేకపోతే ఇతర దేశాల నుంచి సేకరించైనా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత కేంద్రం పై ఉంటుంది. అంతేకానీ తమ దగ్గర ఉన్న సమాచారాన్ని తొక్కి పెట్టడం భావ్యం కాదు. 1947 స్వత్రంత్యం అనంతరం సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయారా? ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే అనేక దశాబ్ధాలపాటు బోస్ కుటుంబంపై ఎందుకు నిఘా వేశాయి? 1947 తరువాత నేతాజీ బతికే ఉన్నారా?
ఆ విషయం నాటి ప్రభుత్వాలకు తెలుసా? నేతాజీ తిరిగి భారత్ కు వస్తే తమకు ప్రమాదమని నాటి పాలకులు భావించారా? సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన కీలకమైన సమాచారం కేంద్ర ప్రభుత్వం దగ్గరున్న రహస్య ఫైళ్ళలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఉన్నవాటితో పోలిస్తే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దగ్గర ఉన్న ఫైళ్ళు అంత ప్రాధాన్యం ఉన్నవి కావు. అయినప్పటికీ ఈ సమాచారాన్ని పరిశీలిస్తే అనేక అంశాలు వెలుగులోకి రావచ్చు. వీటిలోని వివరాలతో నిమిత్తం లేకుండా ఈ ఫైళ్ళను బయట పెట్టడమనేదే గొప్ప విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి సంబంధించిన సమాచారాన్ని ఏ కారణంగానైనా దాచి పెట్టడం సమర్ధనీయం కాదు.
పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్న ఈ కాలంలో ఏడు దశాబ్ధాల కాలం కిందటి సమాచారాన్ని కూడా తొక్కిపెట్టడం మహాపరాధమే అవుతుంది. రెండవ ప్రపంచ యుధ్దం ముగిసి, భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత నేతాజీ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారనే సందేహం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇందుకు సంబంధించి సోవియెట్ యూనియన్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు ఎందుకు బయట పెట్టడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆనాటి ఫైళ్ళను బయట పెడితే నెహ్రూ ప్రభుత్వంపై ఉండే అనుమానాలను కూడా నివృత్తి చేసినట్టవుతుంది. భారత ప్రభుత్వం నేతాజీ బతికి ఉన్నట్టు తెలిసి, కండ్లు మూసుకొని ఉన్నదని అనుకున్నా ఆ వాస్తవమేదో ప్రజలకు వెల్లడించాల్సిందే. నెహ్రూ కాలం నాటి రాజకీయ పరిస్థితులు, విదేశీ సంబంధాలపై కొత్త విషయాలు వెలుగులోకి రావచ్చు.
చరిత్రను తవ్వి తీసి వాస్తవాలను తెలుసుకొవడమంటే ఒకనాయకుడికి, రాజకీయ పక్షానికి వ్యతిరేకంగా వ్యవహరించడంగా భావించకూడదు. గాంధీ శత్రుదేశాలకు నేతాజీ చేతులు కలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించి ఇప్పటి వరకు బయట పడిన సమాచారాన్ని బట్టి ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదని స్పష్టం అవుతున్నది. ఇకపోతే, నేతాజీ కుటుంబ సభ్యులపైన, ఆనాటి ఆజాద్ హింద్ ఫౌజ్ అనుచరులపైన భారత ప్రభుత్వం నిరంతర నిఘా వేయడం. ప్రధాని నెహ్రూ పాలనలో, ఆ తరువాత మరికొంత కాలం నేతాజీపై సంబంధీకులపై గూఢచార నిఘా ఉంది. సుభాష్ చంద్రబోస్‌కు గాంధీతో తీవ్ర స్థాయి విభేదాలు ఉండేవి. నెహ్రూ అతివాదిగా కనిపించనప్పటికీ అంతిమంగా గాంధీవైపే మొగ్గారు. రెండవ ప్రపంచ యుధ్ధంలో బ్రిటన్‌కు తోడ్పాటుగా సైన్యాన్నీ సమీకరించింది గాంధీ అయితే వారి శత్రుదేశాలైన జర్మనీ, జపాన్‌తో చేతులు కలిపి యుద్ధానికి దిగారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మమతా బెనర్జీ తమ దగ్గరి రహస్య ఫైళ్ళను బయట పెట్టినందు వల్ల ఇప్పుడు అందరి దృష్టి కేంద్రం వైపు మళ్ళింది. ఈ ఫైళ్ళను బయట పెడితే దేశంలో ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్ లో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, ఇతర దేశాలతో సంబంధాలపై ప్రభావం పడుతుందని అంటూ కేంద్రం తప్పించుకుంటున్నది.
ఈ అంశం పై వేసిన కమిషన్ కు కూడా కేంద్రం సహకరించలేదు. సభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఫైళ్ళను బయట పెడతానంటూ ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన నరేంద్రమోడీ ప్రధాని పదవి చేపట్టిన తరువాత గత ప్రభుత్వాల బాటలోనే నడుస్తున్నారు. ఈ సమచారం ప్రధాని ఇష్టాయిష్టాల కిందకి రాదంటూ ప్రధాని కార్యాలయం సమాచార హక్కు పిటిషన్‌ను తిప్పికొట్టింది. నేతాజీ అభిమానులు ప్రధాని కార్యాలయాన్నే కాదు, సంబంధిత శాఖలన్నిటినీ ప్రతివాదులుగా చేర్చి పిటిషన్ వేసినా ఫలితం లేకపోయింది. దాదాపు ఏడు దశాబ్ధాలుగా మిస్టరీగా ఉన్న నేతాజీ అదృశ్యంపై కొన్ని వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ ఫైళ్లు దోహదం చేస్తాయని భావిస్తున్నారు.
ఆదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్ళను ప్రజలకు అందుబాటులోకి తేవాలని నేతాజీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నేతాజీకి సంబంధించిన 130 రహస్య ఫైళ్ళు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటిని బయట పెట్టాలని దశాబ్ధాలుగా నేతాజీ కుటుంబ సభ్యులు పరిశోధకులు ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా బెంగాల్ ప్రభుత్వం తన వద్ద ఉన్న 64 ఫైళ్ళను డీ క్లాసిఫై చేసిన నేపథ్యంలో కేంద్రంపై ఈ విషయంలో మరింత ఒత్తిడి పెరగనుంది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గత ఏడు దశాబ్ధాలుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ వీడనుందో లేదో చూడాలి మరి.


