నేర రచనా రంగంలో నవకల్పన!
సర్ ఆర్థర్ ఇగ్నేషియస్ కోనన్ డోయల్… స్కాట్లాండుకు చెందిన వైద్యుడు, రచయిత. అతను షెర్లాక్ హమ్స్ అనే అన్వేషకుడు గురించి తాను రచించిన కధలకు ప్రసిద్ది చెందాడు. అవి నేర రచనా రంగంలో ఒక గొప్ప నవకల్పనగా పరిగణించబడతాయి. అంతే కాక ఇతను ప్రొఫెసర్ ఛాలంజర్ సాహసాల గురించి చేసిన రచనలకు కూడా ప్రసిద్ది. అతను విరివిగా రచనలు చేసిన వ్యక్తి. ఇతను రచించిన రచనలలో శాస్త్రీయ కల్పనా కధలు, చారిత్రాత్మక నవలలు, నాటికలు, ప్రేమ కధలు, కవితలు, కల్పితాలు కానివి కూడా ఉన్నాయి. ఆర్థర్ కోనన్ డోయల్ పదిమంది తోబుట్టువులలో మూడవవానిగా 22 మే, 1859న స్కాట్లాండ్లోని ఎడింబర్గ్‌లో జన్మించాడు. అతని తండ్రి అయిన చార్లెస్ ఆల్టమాంట్ డోయల్, ఐరిష్ వంశానికి చెంది ఇంగ్లాండులో జన్మించగా, అతని తల్లి, మేరీ ఫోలీ ఐరిష్ వనితగా జన్మించింది.
డోయల్ తండ్రి 1893లో డంఫ్రైస్ వద్ద క్రిక్టన్ రాయల్‌లో చాలా సంవత్సరాలు మానసిక వ్యాధితో బాధపడి మరణించాడు. అతని తల్లితండ్రులు 1855లో వివాహం చేసుకున్నారు. అతను ఇప్పుడు ‘కోనన్ డోయల్’గా పిలువబడినప్పటికీ, ఆ ఇంటిపేరు ద్వంద్వ మూలం (ఒక వేళ అతను అది అలాగే అర్ధం కావాలని అనుకుంటే) అనిశ్చయంగా ఉంది. ఎడిన్‌బర్గ్‌లోని సెయింట్ మేరీస్ కాథడ్రల్లో ఉన్న రిజిస్టర్లో బాప్టిజం సమయములో అతని క్రైస్తవ పేరు ఆర్థర్ ఇగ్నేషియస్ కోనన్ గాను ఇంటిపేరు డోయల్ గాను నమోదు చేయబడింది. మైకేల్ కోనన్ని అతని గాడ్ఫాథర్గా పేర్కోంది. తొమ్మిదేళ్ళ వయస్సులో హడర్ ప్లేస్, స్టోనీహర్స్ట్లోని రోమన్ కాథలిక్ జేస్యూట్ ప్రిపరేటరి పాఠశాలకు కోనన్ డోయల్ను పంపించారు.
తరువాత అతను 1875 వరకు స్టోనీహర్స్ట్ కళాశాలకు వెళ్ళాడు. 1876 నుండి 1881 వరకు, అతను ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయములో వైద్యశాస్త్రం చదివాడు. దీనిలో ఆస్టన్ పట్టణంలో (ప్రస్తుతం బర్మింగ్‌హాం లో ఒక జిల్లా) షెఫీల్డ్‌లో అతను పని చేసిన సమయము కూడా కలిసి ఉంది. చదువుతున్న సమయములోనే అతను చిన్న కధలు వ్రాయడం కూడా మొదలుపెట్టాడు; ప్రచురించబడిన అతని తొలి కధానిక, అతనికి 20 సంవత్సరాలలోపే ఛాంబర్స్ ఎడిన్బర్గ్ జర్నల్‌లో ప్రచురణ అయింది. విశ్వవిద్యాలయము తరువాత అతను పశ్చిమ ఆఫ్రికా తీరానికి పయనమవుతున్న ఎస్ ఎస్ మయుంబ అనే నౌకలో వైద్యుడుగా పని చేశాడు. 1885లో అతను టబెస్ డోర్సాలిస్ అనే అంశంలో డాక్టరేట్ చేశాడు. 1882లో అతను తన పూర్వ సహవిద్యార్ధి అయిన జార్జ్ బడ్‌తో కలిసి ఉమ్మడిగా ప్లైమౌత్‌లో వైద్య ప్రాక్టీస్ ప్రారంభించాడు.
అయితే, వాళ్ళ మధ్య సంబంధాలు అంత బాగా ఉండకపోవడంతో, కొంత కాలములోనే కోనన్ డోయల్ విడిగా స్వంత ప్రాక్టీస్ ప్రారంభించాడు. వి10 కంటే తక్కువ డబ్బుతో ఆ సంవత్సరం జూన్‌లో పోర్ట్స్మౌత్ చేరిన అతను, ఎల్మ్ గ్రోవ్, సౌత్‌సీ లోని 1, బుష్ విల్లాస్ లో వైద్య ప్రాక్టీస్ ప్రారంభించాడు. మొదట్లో ప్రాక్టీస్ అంత బాగా నడవలేదు; రోగుల కోసం ఎదురు చూసి వేచి ఉన్న సమయములో అతను మళ్ళీ కథలు వ్రాయడం ప్రారంభించాడు. అతని మొదటి ముఖ్య రచన, ఎ స్టడి ఇన్ స్కార్లెట్ 1887లో బీటన్స్ క్రిస్మస్ ఆన్యువల్ లో ప్రచురించబడింది. ఆ కధలోనే షెర్లాక్ హమ్స్ మొదటి సారిగా ప్రత్యక్షమవుతాడు. డోయల్ యొక్క పూర్వ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుడైన జోసెఫ్ బెల్‌ను అనుసరించి కొంత వరకు ఆ పాత్ర రూపొందించబడింది. కోనన్ డోయల్ ఆయనకు ఈ విధముగా వ్రాశాడు, షెర్లాక్ హమ్స్ కొరకు నేను ఖచ్చితంగా మీకే ఋణపడి ఉన్నాను…. మీరు బోధించిన నిగమనం, అర్ధాపత్తి, పరిశీలన వంటి అంశాల ప్రకారం నేను ఒక వ్యక్తిని సృష్టించాను.
షెర్లాక్ హమ్స్ పాత్ర ఉన్న తరువాయి కథలు స్ట్రాన్డ్ ఆంగ్ల సంచికలో ప్రచురించబడ్డాయి. చాలా దూరములో ఉన్న సమోవాలో ఉండి కూడా రాబర్ట్ లూయి స్టీవన్సన్ జోసెఫ్ బెల్ కు షెర్లాక్ హమ్స్ కు ఉన్న పోలికలను గుర్తించగలిగాడు: షెర్లాక్ హమ్స్ యొక్క చాలా చమత్కారమైన చాలా ఆసక్తివంతమైన సాహసాలకు నా అభినందనలు… ఇది నా పాత మిత్రుడు జో బెల్ అయ్యే అవకాశము ఉందా? కొందరు ఇతరుల ప్రభావాలు కూడా ఉండవచ్చని ఇతర రచయితలు సూచిస్తున్నారు- ఉదాహరణకు ప్రసిద్ధుడైన ఎడ్గార్ అలన్ పో పాత్ర అయిన సి. ఆగస్టే డుపిన్. సౌత్సిలో నివసిస్తున్నప్పుడు అతను, ఏ.సి. స్మిథ్ అనే కల్పనా పేరుతో పోర్ట్స్మౌత్ అసోసియేషన్ ఫుట్‌బాల్ క్లబ్ అనే ఒక అమేచూర్ జట్టులో గోల్‌కీపర్ గా ఫూట్‌బాల్ అడాడు. (1894లో మూయబడిన ఈ క్లబ్బుకు 1898లో స్థాపించబడిన ఈనాటి పోర్ట్స్ మౌత్ ఎఫ్.సి.కు ఎటువంటి సంబంధం లేదు.) కోనన్ డోయల్ ఒక ఉత్సాహవంతమైన క్రికట్ ఆటగాడు కూడా. 1899-1907 మధ్య అతను 10 ఫస్ట్-క్లాస్ ఆటలు మర్లిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) తరుఫున జట్టులో ఆడాడు. 1902లో లండన్ కౌంటీతో జరిగిన ఆటలో అతను యొక్క అత్యధిక స్కోరు 43 పరుగులు.
అతను అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేసేవాడు. అతను కేవలం ఒక్క ఫస్ట్-క్లాస్ వికట్ మాత్రమే తీశాడు. (అయితే అది గొప్ప ఆటగాడైన డబల్యూ.జి.గ్రేస్ ది). కోనన్ డోయల్ ఒక ఉత్సాహవంతమైన గోల్ఫ్ ఆటగాడు కూడా. 1910లో అతను క్రోబరో బీకాన్ గోల్ఫ్ క్లబ్, తూర్పు ససెక్స్‌కు సారధిగా ఎన్నికయ్యాడు. అతను తన రెండవ భార్య జీన్ లెకీ కుటుంబంతో పాటు క్రోబరోలో ఉన్న లిటిల్ విండిల్షాం ఇంటికి చేరి, 1907 నుంచి తను జూలై 1930 లో తన మరణం వరకు అక్కడే ఉన్నాడు. 1885లో కోనన్ డోయల్, టూయీ అని పిలవబడే లూయిసా (లేక లూయిస్) హాకిన్స్ ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ట్యూబర్కులోసిస్ రోగం సోకి, 4 జూలై 1906 న మరణించింది. మరుసటి సంవత్సరం, అతను జీన్ ఎలిజిబత్ లెకీని వివాహం చేసుకున్నాడు. అతను ఆమెను మొదటిసారిగా 1897లో చూసి ప్రేమలో పడ్డాడు.
లూయిసా బ్రతికి ఉన్నప్పుడు, విశ్వాసం కొరకు, జీన్‌తో కేవలం మానసిక ప్రేమ సంబంధం మాత్రమే పెట్టుకున్నాడు. 27 జూన్ 1940న జీన్ లండన్‌లో మరణించింది. కోనన్ డోయల్ ఐదుగురు పిల్లలకు తండ్రి. మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు – మేరి లూయిసే (28 జనవరి 1889 ? 12 జూన్ 1976) కింగ్స్లీ అని పిలవబడే ఆర్థర్ అలైన్ కింగ్స్లీ (15 నవంబర్ 1892 ? 28 అక్టోబర్ 1918), రెండవ భార్యతో ముగ్గురు పిల్లలు – డెనిస్ పెర్సి స్టూవర్ట్ (17 మార్చ్ 1909 ? 9 మార్చ్ 1955), 1936లో జార్జియా యువరాణి నినా ఎండివాని యొక్క రెండవ భర్త (సర్కా 1910 – 19 ఫిబ్రవరి 1987; బార్బర హట్టన్ యొక్క మాజీ ఆడపడుచు); అడ్రియన్ మాల్కం (19 నవంబర్ 1910?3 జూన్ 1970), జీన్ లేన అన్నేట్టే (21 డిసెంబర్ 1912?18 నవంబర్ 1997). 1890లో కోనన్ డోయల్ వియన్నాలో ఆఫ్తాల్మాలజి చదివి 1891లో లండన్ కు వచ్చి ఆఫ్తాల్మాలజిస్ట్గా ప్రాక్టీస్ ప్రారంభించాడు. కేవలం ఒక్క రోగి కూడా తన వద్దకు రాలేదని తన స్వీయచరిత్రలో ఆతను వ్రాసుకున్నాడు.
దీని వలన అతనికి రచనకు ఎక్కువ సమయం లభించి, నవంబర్ 1891లో అతను తన తల్లికి వ్రాసిన ఒక ఉత్తరములో ఈ విధంగా వ్రాశాడు: హమ్స్ ను చంపేసి…. అతని కథను శాశ్వతంగా ముగించేయాలని అనిపిస్తుంది. నా మనసు ఇతర గొప్ప విషయాలలోకి వెళ్ళకుండా అతనే నిండి ఉన్నాడు. నీకు ఏమి చేయాలని అనిపిస్తే అది చేయి. కాని దీనిని ప్రేక్షకులు సుళువుగా తీసుకోరు. డిసంబర్ 1893లో, ముఖ్యమైన పనులు చేపట్టడం కొరకు -చారిత్రాత్మక నవలలు- సమయం అవసరమయి- కోనన్ డోయల్ తన ది ఫైనల్ ప్రాబ్లం అనే కథలో హమ్స్, ప్రొఫెసర్ మోరియార్టి ఇద్దరూ కలిసి రీచేన్బాక్ జలపాతంలో దూకి మరణించినట్లుగా వ్రాశాడు.
ప్రజలు పెద్ద గోల చేయడంతో, 1901లో ది హౌండ్ అఫ్ ది భాస్కర్విల్లె అనే కథలో మరల ఆ పాత్రను తెచ్చాడు. మోరియార్టి మాత్రమే పడిపోయాడని; హమ్స్ కు ఇతర ప్రమాదకరమైన శత్రువులు ఉండడంతో – ముఖ్యంగా కర్నల్ సెబాస్టియన్ మొరన్- తాత్కాలికంగా తాను చనిపోయినట్లు కనిపించేలా చేసుకున్నాడని- ది అడ్వెంచర్ అఫ్ ది ఎమ్ప్టీ హౌస్‌లో వివరణ ఇవ్వబడింది. మొత్తం మీద 56 చిన్న కధలనూ నాలుగు కోనన్ డోయల్ నవలలలోనూ హమ్స్ పాత్ర ఉంది. ఆ తరువాత ఇతర రచయితలు రచించిన అనేక నవలలు, కథలలో అతను ఉన్నాడు. 20వ శతాబ్ద ప్రారంభములో దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధం అనంతరం ప్రపంచమంతట యునైటెడ్ కింగ్డం ప్రవర్తన గురించి నిరసన వ్యక్తమయినప్పుడు, దక్షిణాఫ్రికాలో యుద్ధం: కారణము, ప్రవర్తన అనే పేరుతో కోనన్ డోయల్ ఒక చిన్న కరపత్రం వ్రాశాడు.
దీనిలో బోయర్ యుద్ధంలో యుకే పాత్రను అతను సమర్ధించాడు. ఈ కరపత్రం విస్తృతంగా అనువాదం చేయబడింది. మార్చ్-జూన్ 1900 మధ్య కాలములో డోయల్ బ్లోంఫోన్టీన్లో ఉన్న లాంగ్మాన్ ఫీల్డ్ ఆసుపత్రిలో వైద్యుడుగా స్వచ్చంద సేవ అందించాడు. 1902లో తాను నైట్ చేయబడడానికి, సర్రేకు ఉప-లేఫ్టినంట్ గా నియమించబడడానికి ఈ కరపత్రమే కారణమని కోనన్ డోయల్ నమ్మాడు. అంతే కాక, 1900లో, అతను ది గ్రేట్ బోయర్ వార్ అనే పెద్ద పుస్తకము వ్రాశాడు. 20వ శతాబ్ద తొలి సంవత్సరాలలో, సర్ ఆర్థర్ రెండు సార్లు ఒక లిబరల్ యూనియనిస్ట్గా శాసనసభకు పోటీ చేశాడు- ఒక సారి ఎడింబర్గ్ లో, ఒకసారి హవిక్ బర్గ్స్ లో- గౌరావించదగిన ఓటులు లభించినప్పటికీ, అతను ఎన్నిక కాలేదు. కాంగో ఫ్రీ స్టేట్ యొక్క సంస్కరణ కొరకు జరిగిన ప్రచారములో కోనన్ డోయల్ పాల్గొన్నాడు.
ఈ ప్రచారం పాత్రికేయుడు ఈ.డి.మొరెల్, దౌత్యవేత్త రోజర్ కేస్మేంట్ అధ్యక్షత వహించారు. 1909లో, కాంగో దేశములో జరుగుతున్న భీకరమైన సంఘటనలను ఖండిస్తూ ది క్రైం అఫ్ ది కాంగో అని దీర్ఘమైన కరపత్రం వ్రాశాడు. అతనికి మొరెల్, కేస్మేంట్ లతో పరిచయం ఏర్పడింది. డోయల్ 1912లో రచించిన ది లాస్ట్ వరల్డ్ అనే నవలలో పలు పాత్రలకు వారు, బెర్ట్రాం ఫ్లేట్చర్ రాబిన్సన్ ప్రేరణ అయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయములో మొరెల్ శాంతి ఉధ్యమానికి నేతగా మారినప్పుడు, ఈస్టర్ రైసింగ్ సమయములో యుకే కు వ్యతిరేకంగా దేశద్రోహ నేరం క్రింద కేస్మేంట్ కు శిక్ష పడినప్పుడు వారిద్దరితోనూ అతను మిత్రత్వం విరమించుకున్నాడు.
కేస్మేంట్ కు పిచ్చి పట్టిందని అందువలన అతని చర్యలకు అతను బాధ్యుడు కాదని వాదించి కేస్మేంట్ ను మరణ శిక్ష నుండి రక్షించడానికి కోనన్ డోయల్ ప్రయత్నించాడు కాని విఫలమయ్యాడు. కోనన్ డోయల్ న్యాయానికోసం గట్టిగా పోరాడే వ్యక్తీ. మూసివేసిన రెండు కేసులను స్వయంగా దర్యాప్తు చేసి, నేర ఆరోపణ ఎదుర్కుంటున్న ఇద్దరినీ ఆ కేసుల నుండి బయటకు తెచ్చాడు. 1906లో జరిగిన మొదటి కేసులో, జార్జ్ ఎడల్జి అనే బిడియస్తుడైన సగం-బ్రిటిష్ సగం-భారతదేశపు న్యాయవాది బెదిరింపు లేఖలు వ్రాశాడని జంతువులను హింసించాడని ఆరోపణ ఎదుర్కున్నాడు. అతన్ని జెయిల్ లో పెట్టిన తరువాత కూడా జంతు హింస కొనసాగినప్పటికి, ఎడల్జిను ఎలాగైనా శిక్షించాలని పోలీసులు దృఢనిశ్చయంతో ఉన్నారు. కొంత వరకు ఈ కేసు వలనే, 1907లో కోర్ట్ అఫ్ క్రిమినల్ అపీల్ స్థాపించబడింది.
కోనన్ డోయల్ జార్జ్ ఎడల్జిని కాపాడడమే కాకుండా, ఇతర అన్యాయాలనుసరి చేయడానికి ఒక మార్గాన్ని నెలకొల్పడములో సహాయపడ్డాడు. కోనన్ డోయల్, ఎడల్జి యొక్క కథ, జూలియన్ బర్న్స్ 2005లో రచించిన ఆర్థర్ ఞ జార్జ్ అనే ఒక నవలగా వచ్చింది. నికోలస్ మేయర్ యొక్క ది వెస్ట్ ఎండ్ హారర్ (1976) అనే ఒక పాస్టిచేలో, ఆంగ్లేయుల న్యాయ వ్యవస్థకు బలి అయిన బిడియంగా ఉండే ఒక భారత దేశపు పార్సీ పాత్రకు హమ్స్ సహాయం చేస్తాడు. ఎడల్జియే ఒక పార్సీ. రెండవ కేసులో, జూదమందిరం నడిపే ఆస్కార్ స్లేటర్ అనే జర్మనికి చెందిన ఒక యూదుడు ఒక 82-ఏళ్ల వృద్ధురాలిని గ్లాస్గోలో 1908లో బాదినట్లు ఆరోపణ చేయబడింది. ప్రభుత్వ వాదనలో పరస్పర వైరుధ్యాలు ఉండడం వలన, స్లేటర్ నేరం చేయలేదని నమ్మకం వలన ఈ కేసు కోనన్ డోయల్ కు ఆసక్తి కలిగించింది.
1928లో స్లెటర్ యొక్క విజయవంతమైన అభ్యర్ధనకు అయిన ఖర్చులో చాలా వరకు అతనే చెల్లించాడు. 1906లో తన మొదటి భార్య లూయిసా మరణించడం, తరువాత తన కొడుకు కింగ్స్లీ కూడా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే ముందు మరణించడం, యుద్ధం తరువాత తన సోదరుడు ఇన్నెస్, ఇద్దరు బావమరుదులు (వీరిలో ఒకరు రాఫెల్స్ అనే సాహిత్య పాత్రను సృష్టించిన ఈ. డబల్యూ. హర్నుంగ్), ఇద్దరు మేనల్లుళ్ళు మరణించడంతో కోనన్ డోయల్ మానసికంగా కృంగిపోయాడు. ఆధ్యాత్మికం, దాని ద్వారా మరణాంతరం కూడా జీవం ఉంది అని నిరూపించే ప్రయత్నాలలో ఆతను ఓదార్పు పొందాడు. ముఖ్యంగా, కొందరు చెప్పుతున్న దాని ప్రకారం, అతను క్రైస్తవ ఆధ్యాత్మికతను అనుసరించాడని, జీసస్ అఫ్ నజారేత్ యొక్క బోధనలు, ఉదాహరణలను అనుసరించాలనే దానిని ఎనిమిదవ విధిగా ఆధ్యాత్మికవాదుల దేశీయ యూనియన్ పాటించాలని అతను ప్రోత్సాహించాడు. అతను ది గోస్ట్ క్లబ్ అనే ఒక ప్రసిద్ద పారానార్మల్ సంస్థలో సభ్యుడుగా కూడా ఉన్నాడు.
ఆ సంస్థ ముఖ్య ఉద్దేశం, అప్పటికి ఇప్పటికి, పారానార్మల్ అనే చెప్పబడే కార్యకలాపాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి అవి నిజమని (లేదా నిజం కాదని) నిరూపించడం. 1918 అక్టోబర్ 28 నాడు కింగ్స్లీ దోయాల్ నిమోనియా జబ్బు సోకి మరణించాడు. 1916 సొమ్మే యుద్ధంలో గాయపడి కోలుకుంటున్నప్పుడు అతనికి ఆ జబ్బు సోకింది. ఫిబ్రవరి 1919లో బ్రిగేడియర్-జెనెరల్ ఇన్నెస్ డోయల్ కూడా నిమోనియా సోకి మరణించాడు. సర్ ఆర్థర్ ఆధ్యాత్మికతలో ఎంత వరకు మునిగిపోయాడంటే, ది ల్యాండ్ అఫ్ మిస్ట్ అనే ఒక ప్రొఫెసర్ ఛాలెంజర్ నవలను అతను వ్రాశాడు. ఐదుగురు కాటింగ్లే దేవకన్యలు ఫోటోస్ (ఇవి మోసమని కొన్ని దశాబ్దాలు తరువాత తెలిసింది) నిజమని అతను నమ్మాడని అతను వ్రాసిన ది కమింగ్ అఫ్ థ ఫైరీస్ (1921) అనే పుస్తకం చూపిస్తుంది. అతను వాటిని తన పుస్తకములో పునర్నిర్మించి, దేవకన్యలు, ఆత్మలు ఉన్నాయని వాటి స్వభావం గురించి కూడా వ్రాశాడు. ది హిస్టరీ అఫ్ స్పిరిచువలిజం (1926) అనే పుస్తకములో అతను అతీంద్రియ సంఘటనలను, యూసపియా పల్లడినో, మీన ‘మార్గరి’ క్రాన్డన్ చూపించిన ఆత్మలను కొనియాడాడు.
ఈ విషయంపై అతను చేసిన కార్యక్రమాల వలన ది అడ్వెంచర్స్ అఫ్ షెర్లాక్ హమ్స్ అనే అతని చిన్న కధల కూర్పు ఒకటి 1929లో సోవియట్ యూనియన్‌లో, తాంత్రికత్వం ఉందని నిషేధించబడింది. ఆ నిషేధం తరువాత రద్దు చేయబడింది. షెర్లాక్ హమ్స్ పాత్రను చక్కగా పోషించినందకుగాను వాసిలి లివనోవ్ అనే రష్యాకు చెందిన నటుడు ఆర్డర్ అఫ్ ది బ్రిటిష్ ఎంపయర్ అనే బిరుదును అందుకున్నాడు. కొంతకాలం హారి హౌడిని అనే అమెరికాకు చెందిన ఇంద్రజాలికుడుతో స్నేహంగా ఉన్నాడు. అయితే, హౌడిని తన తల్లి మరణాంతరం, 1920లలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. ఆధ్యాత్మిక మాధ్యమాలు యుక్తులకు పాల్పడుతాయని అతను ఎంత చెప్పినా, (పలు మార్లు అవి మోసమని నిరూపించాడు కూడా) కోనన్ డోయల్ మాత్రం నమ్మలేదు. అంతే కాక, హౌడినికే అతీంద్రియ శక్తులు ఉన్నాయని అతను నమ్మాడు- ఈ అభిప్రాయాన్ని ది ఎడ్జ్ అఫ్ ది అన్నొన్ అనే పుస్తకంలో వ్యక్తపరిచాడు. తన సాహసాలు కేవలం మాయే అని కోనన్ డోయల్ను హౌడిని నమ్మించలేకపోయాడు.
దీని వలన వీరిద్దరూ బాహాటంగా విడిపోయారు. రిచర్డ్ మిల్నర్ అనే అమెరికాకు చెందిన విజ్ఞాన చరిత్రకారుడు 1912 నాటి పిల్ట్‌డౌన్ మాన్ మోసాన్ని కోనన్ డోయల్ సృష్టించి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. దీని వలన ఒక నకిలీ హమినిడ్ శిలాజం సృష్టించబడింది. ఇది 40 ఏళ్ళకు పైగా విజ్ఞాన ప్రపంచాన్ని మోసం చేసింది. కోనన్ డోయల్‌కు ఒక ఉద్దేశ్యం ఉందని మిల్నేర్ చెబుతున్నాడు – అది ఏమంటే, తనకు నచ్చిన ఒక అతీంద్రియాళువును నమ్మకుండా ఉన్న విజ్ఞాన ప్రపంచం మీద పగ తీర్చుకోవడానికి. అంతే కాక అతనికి ఈ మోసములో పాత్ర ఉందని చెప్పడానికి ది లాస్ట్ వరల్డ్‌లో పలు ఆధారాలు ఉన్నాయని మిల్నేర్ చెప్పాడు. నేకడ్ ఈస్ ది బెస్ట్ డిస్గైస్ అనే 1974 పుస్తకంలో సామువేల్ రోసంబెర్గ్ కోనన్ డోయల్ తన రచనలలో దాచి పెట్టబడిన తన స్వభావం, నమ్మకం గురించి అనేక ఆధారాలు వదిలి పెట్టాడని వ్రాశాడు. 1930 జూలై 7న, క్రోబోరో, ఈస్ట్ ససెక్స్‌లోని తన ఇంట్లో విండెల్షాం హాల్లో ఛాతీని పట్టుకొని కనిపించాడు. తన 71వ వయస్సులో అతను గుండెపోటుతో మరణించాడు.


