నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆర్బీఐ మాజీ గవర్నర్
- 84 Views
- wadminw
- January 23, 2017
- అంతర్జాతీయం జాతీయం
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచడం, ప్రకటించిన సమయంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నోట్ల రద్దుపై విస్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 1997 నుంచి 2003 వరకు వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్న సమయంలోనే బిమల్ జలాన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. ఇప్పుడు ఆయనే అదే ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించడం గమనార్హం.
నోట్ల రద్దులాంటి పెద్ద నిర్ణయాన్ని ప్రకటించడానికి ఓ మంచి కారణం ఉండాలి, యుద్ధం, భద్రత ముప్పులాంటివి. అయితే ప్రభుత్వం మాత్రం నల్లధనాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇక రెండోది ఈ నిర్ణయం ప్రకటించిన సమయం. ఇప్పుడే ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. ఈ కీలక రహస్యం ముందే లీకైతే నోట్ల రద్దు నిర్ణయం నిష్ఫలమవుతుందన్న ప్రభుత్వ వాదనను తప్పుబట్టారు బిమల్. ప్రజలను సంసిద్ధం చేసి తీసుకోవాల్సిన నిర్ణయమిది. దీనిని ఓ రహస్యంగా ఉంచడం కంటే ముందే పబ్లిగ్గా ప్రకటించి ఉంటే ఏమయ్యేది?
ఎమర్జెన్సీ సమయాల్లో తప్ప దీనిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. సర్జికల్ దాడుల్లాంటి విషయం అయితే ఇలా చేయడం సరైందే. ఓ సాధారణ వ్యక్తిగా నేను ఇలా మాట్లాడుతున్నాను అని బిమల్ జలాన్ అన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అందులో సమతుల్యత ఉండేలా చూసుకోవాలని బిమల్ జలాన్ సూచించారు. మెజార్టీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలివి. మీకు తుది ఫలితాలు బాగానే ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ ఆ తుది ఫలితం సాధించే దిశగా చేపట్టాల్సిన చర్యలు కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని బిమల్ స్పష్టం చేశారు.


