నోబెల్ గ్రహీత ప్రఖ్యాత జీవశాస్త్రజ్ఞుడు హరగోవింద్ ఖొరానా
- 71 Views
- wadminw
- January 9, 2017
- Home Slider అంతర్జాతీయం
హరగోవింద్ ఖొరానా భారతీయ సంతతికి చెందిన, నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత జీవ శాస్త్రజ్ఞుడు. జనవరి 9, 1922న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాయపూరు అను గ్రామంలో జన్మించారు (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నది). తండ్రి పన్నులు వసూలు చేసే గ్రామ పట్వారి. అయిదుగురి సంతానంలో చివరి వాడు. తొలుత తండ్రి శిక్షణలోను, తదుపరి ముల్తాన్లో దయానంద్ ఆర్య విద్యా ఉన్నత పాఠశాలలో చదివారు. పంజాబ్ విశ్వవిద్యాలయం, లాహోర్ నుండి 1943లో బీ.ఎస్సీ, 1945లో ఎమ్మెస్సీ పట్టాలు పొందాడు.
లివర్ పూల్ విశ్వవిద్యాలయంలో 1945 నుండి 1948 వరకు శాస్త్ర పరిశొధనలు చేసి పీహెచ్డీ పట్టా పొందాడు. తదుపరి రెండు సంవత్సరాలు స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో పరిశోధనలు సాగించారు. 1951-52లో విశ్వవిఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాంసకృత్తులు, న్యూక్లిక్ ఆమ్లాలకు సంధించిన పరిశోధన మొదలు పెట్టారు. 1952లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా (వ్యంకూవర్) విశ్వవిద్యాలంలో చేరారు. అటు పిమ్మట 1960లో అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలంలో (మ్యాడిసన్) ఆచార్యునిగా చేరారు.
1970లో ప్రతిష్ఠాత్మకమైన మశాచుసెట్స్ సాంకేతిక సంస్థలో రసాయనశాస్త్ర ఆచార్యునిగా చేరారు. 2007లో పదవీ విరమణ చేశారు. అప్పటి నుండి గౌరవ ఆచార్యునిగా పరిశోధనలు సాగిస్తూ వచ్చారు. జీవ శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ఎదుర్కొంటున్న ప్రశ్న- ప్రయోగశాలలో జీవాన్ని కృత్రిమంగా సృష్టించడం సాధ్యమేనా? ఈ దిశలో వంశపారంపర్యంగా సంక్రమించు జీవ నిర్మాణానికి దోహదం చేసే కృత్రిమ జీన్ను సృష్టించగలిగారు. ఈ ఆవిష్కరణ జెనెటిక్ ఇంజినీరింగ్ అనే నూతన శాస్త్ర అధ్యయనానికి దారి తీసింది.
ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమం మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని ఖొరానా కనుక్కొన్నారు. వరుసగా ఉన్న కృత్రిమ జీన్ ముక్కను ప్రయోగశాలలో మొదటిసారిగా సృష్టించారు ఖొరానా. డీఎన్ఏ ముక్కలను అతికించే ఎంజైను కనుగొన్నారు. ఈ పరిశోధనల మూలంగా ఆధునిక జీవశాస్త్రంలో ఒక విప్లవం వచ్చింది. 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1952లో స్విస్ జాతీయురాలైన ఎలిజబెత్ సిబ్లర్ను వివాహమాడారు ఖొరానా. వీరికి ముగ్గురు పిల్లలు: జూలియా ఎలిజబెత్, ఎమిలీ యాన్నె, డేవ్ రాయ్.


