న్యాయ కళాశాలను అభివృద్ది చేస్తాం: మంత్రి గంటా
- 75 Views
- wadminw
- December 15, 2016
- రాష్ట్రీయం
విశాఖపట్నం, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాలపై తనకు ప్రత్యేక అభిమానమని, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు భవనాలు, వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను సూచించారు. తాను చదువుకున్న కళాశాల, తరగతి గదులను చూడటం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ నెల 17న జరిగే పూర్వవిద్యార్థుల సమావేశంలో పాల్గొనడానికి పూర్వవిద్యార్థులు తరలి వస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటామన్నారు. ఏయూ న్యాయ కళాశాలలో చదువుకోవడం ఎంతో ప్రతిష్టాత్మకమని, ఇక్కడ ప్రవేశం సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా యూజీసీ శాప్ డిఆర్ఎస్ కార్యాలయం భవనం, విద్యార్థినుల విశ్రాంతి మందిరాలను ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమైన అదనపు వసతుల కల్పన పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
శాప్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు, విలువైన పరిశోధనలు జరపాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డి.ఎస్. ప్రకాశరావు, డిఆర్ఎస్ శాప్ అసోసియేట్ డైరెక్టర్ ఆచార్య వై.సత్యనారాయణ, కళాశాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయ కళాశాల విద్యార్ధి దాసరి శ్యామ్ చంద్ర శేషు సమన్వయం చేశారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు వసతులు కల్పించాలని మంత్రికి విన్నవించారు.


