పట్టిసీమ ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించేదెన్నడో?
- 106 Views
- wadminw
- September 4, 2016
- రాష్ట్రీయం
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాటల్లో నిజమెంతో తెలియదు కానీ, ఈ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయి ఫలితాలు ఎప్పుడొస్తాయో అన్నది అనుమానాస్పదంగా మారింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాలపై చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే విషయంలో అసెంబ్లీలో ఒక అబద్ధం, శాసనమండలిలో మరో అబద్ధం చెప్పి పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి గడువుపై కూడా ముఖ్యమంత్రి రకరకాలుగా మాట్లాడారు. జలవనరు శాఖ మంత్రి దేవినేని ఉమా మరోరకంగా మాట్లాడారు.
ఈ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తికాకపోయినా ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేసి రాజకీయాల్లో కొత్త సంద్రాయానికి తెరతీశారు. ఈ నేపధ్యంలోనే పట్టిసీమపై బుధ, గురువారాల్లో అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడీగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు బుధవారం శాసనససభలో మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా ఈ ఏడాది 20 నుంచి 30 టీఎంసీల గోదావరి వరద నీటిని వినియోగిస్తామని చెప్పారు. అదే చంద్రబాబు గురువారం శాసనమండలిలో మాట్లాడుతూ ఈ ఏడాది 15 నుంచి 20 టీఎంసీల గోదావరి నీటిని వినియోగిస్తామని సెలవిచ్చారు. రెండు సభల్లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు, అధికారుల గణాంక వివరాలకు బొత్తిగా పొంతన లేకుండా పోయింది.
ఇంజనీరింగ్ అధికారులు తయారు చేసిన తాజా ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 15 నాటికి పట్టిసీమలో ఒక పంపు నిర్మాణం పూర్తిచేయాలి. సెప్ఠెంబర్ 28 నాటికి మరో 3 పంపులు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అక్టోబర్ 15వ తేదీ నాటికి మరో మూడు పంపుల నిర్మాణం, అదేనెల 25 నాటికి మరో పంపుతో కలిపి 8 పంపుల నిర్మాణం పూర్తి చేసి గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. (నిర్ణీత తేదీలలోగా పంపుల నిర్మాణాలు ఎంత వరకు పూర్తవుతాయో అనుమానమే).
ప్రణాళిక ప్రకారం అంతా సజావుగా సాగితే సెప్టెంబర్ నెలలో 0.774 టీఎంసీలు, అక్టోబరులో ఏడు పంపులతో 5.564, నవంబరులో ఎనిమిది పంపుల ద్వారా 7.340 టీఎంసీల నీటిని గోదావరి నుండి కృష్ణాకు మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించారు. నవంబరు 15వ తేదీ దాకా గోదావరి నదిలో వరద ఉంటే 10 టీఎంసీలు, నవంబరు ఆఖరు వరకు వరద కొనసాగితే 13.678 టీఎంసీల నీటిని కృష్ణాకు మళ్లించవచ్చునని అధికారులు లెక్కలు కట్టి చంద్రబాబుకు వివరించారు. (నవంబర్ ఆఖరు దాకా గోదావరిలో వరద కొనసాగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి) యధార్ధం ఇలా ఉంటే ఈ లెక్కలకు మించి చంద్రబాబు 30 టీఎంసీలని ఒకసారి.. 20 టీఎంసీలని రెండోసారి రకరకాలుగా చెబుతున్నారు.
సెప్టెంబరు 15 నాటికి ఒక పంపు నిర్మాణం పూర్తి చేసి 354 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు కృషి చేస్తామని అధికారులు చెబుతుండగా.. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సెప్టెంబరు 10 నాటికే ఒక పంపు నుండి నీటిని అందిస్తామని చెప్పుకున్నారు. ఈ మేరకు కాంట్రాక్టరు, అధికారులకు లక్ష్య నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం ఈ నెల 15వ తేదీ నాటికని, మరో చోట సెప్టెంబరు 2వ వారమని రకరకాల ప్రకటనలు చేస్తున్నారు. దేవినేని మాటపై విశ్వాసం లేదోమో చంద్రబాబు పట్టిసీమ ద్వారా నీటి విడుదలపై తడబడుతున్నారు.
పట్టిసీమ పనులను తన అంచనాలకు అనుగుణంగా ఎందుకు పూర్తి చేయలేకపోయారని చంద్రబాబు ఇటీవల పట్టిసీమ పథకం సమీక్షా సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్వాలిటీస్ ల్యాబ్‌ల నిర్మాణానికి సమయం పడుతుందని, దీంతో పాటు వర్షాలు కురుస్తుండడంతో పనులకు ఆటంకం కలిగిందని అధికారులు చెప్పారు. అధికారుల ప్రణాళికను 10 రోజులు ముందు తీసుకు వెళ్లాలని సీఎం హుకుం జారీ చేశారట. క్వాలిటీస్ ల్యాబ్‌లు లేకపోతే పథకం దెబ్బతినే అవకాశం ఉంది. ప్రణాళికను పది రోజులు ముందుకు తీసుకు వెళితే మరింత క్వాలిటీ తగ్గే ప్రమాదం ఉంది. ఈ విధంగా ఒత్తిళ్లను పెంచడం వల్ల అధికారుల నుంచి చంద్రబాబు వ్యతిరేకతను కొనితెచ్చుకుంటున్నారు.
ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా పనుల ఒత్తిళ్ల గురవుతున్నామని గుంటూరు జిల్లా ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌పై తిరగబడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇద ేవిధంగా ఉద్యోగులు ఒక దశలో ఉద్యమించారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంపై కూడా చంద్రబాబు బుధవారం అసెంబ్లీలో పొంతనలేని ప్రకటనలు చేసి గందరగోళం సృష్టించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. మరో పక్క 2018 సంవత్సరం నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలు ప్రహసనంగా మారాయి.
2015 సెప్టెంబర్ 2 నుండి నాలుగు సంవత్సరాలు అంటే 2019 సెప్టెంబరు 2వ తేదీ అన్నది సరైన లెక్క. 2018 కల్లా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారో చంద్రబాబే చెప్పాలి. 2018కి పూర్తి చేస్తారా? నాలుగేళ్లకు పూర్తి చేస్తారా? అదే అసెంబ్లీలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడానికి నాలుగైదు ఏళ్లు పడుతుందని పేర్కొన్నారు. అంటే 2020 సంవత్సరం దాకా పడుతుందా? ఇవన్నీ విశ్లేషిస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలుగుదేశంలో స్పష్టమైన ప్రణాళిక లేదని తేలతెల్లమవుతున్నది.


