పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రత్యేక కృషి: కలెక్టర్
- 78 Views
- wadminw
- December 15, 2016
- తాజా వార్తలు
ఏలూరు, డిసెంబర్ 14 (న్యూస్టైమ్): పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహితక పారిశ్రామికవేత్తలను అవినీతి జలగలు పట్టిపీడించవద్దని, ఆదరణతో ఆదరిస్తే పారిశ్రామిక ప్రగతి సత్వరమే సాధ్యపడుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హితవు పలికారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహకమండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లో సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు మంజూ రు చేస్తామని పరిశ్రమలశాఖ గొప్పగా చెప్పడమేతప్ప ధరఖాస్తు చేసిన ఏడాదికి కూడా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకపోతే పరిశ్రమలు స్థాపించడానికి ఎవరు ముందుకు వస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. పరిశ్రమ స్థాపించడానికి రెవెన్యూ నుండి పరిశ్రమలశాఖ వరకు 72 మందికి వరుసగా లంచాలు ఇచ్చుకుంటూ ఒక వ్యక్తి అనుమతులు పొందాల్సివచ్చిందని పరిశ్రమ స్థాపనకు నిర్మాణవ్యయంలో 15 శాతం లంచాలకే సరిపోతుందని ఒక పారిశ్రామికవేత్త తనదృష్టికి తీసుకువచ్చారని ఇలాఅయితే జిల్లాలో పరిశ్రమలస్థాపనకు పారిశ్రామికవేత్తలు చొరవ ఎలా చూపుతారని కలెక్టర్ ప్రశ్నించారు.
పారిశ్రామిక వేత్త ధరఖాస్తులో ఏమైనా లోటుపాట్లు వుంటే అక్కడికక్కడే సరిదిద్ది ఏవిధంగా పరిశ్రమకు అనుమతివ్వాలో పారిశ్రామికవేత్తలకు మంచి సలహాలు సూచనలు అందించి పారిదర్శకంగా 15 రోజుల్లో అన్ని రకాల అనుమతులు మంజూరు చేస్తే పశ్చిమగోదావరిజిల్లా త్వరలోనే పారిశ్రామిక జిల్లాగా అభివృద్ది సాధించగలదని డా.భాస్కర్ చెప్పారు. ప్యాకెట్ ( లంచాలు) రాకపోతే పారిశ్రామికవేత్త సమర్పించిన ప్లాన్ సరిగాలేదనే కుంటుసాకుతో తిరిగి వెనక్కి పంపుతున్నారని ఇటువంటి ధరఖాస్తులను తాను పరిశీలించి కావాలని వెనుకకు పంపే అధికారులను శాశ్వతంగా వారంరోజుల్లో ఇంటికి పంపించడానికి కూడా వెనుకాడబోనని కలెక్టర్ స్పష్టంచేశారు.
ప్రతివిషయంలోనూ హైదరాబాదులో వున్న అధికారుల అనుమతులు కావాలని, అమరావతిలో వున్న మంత్రిగారి పర్మిషన్ పొందాలని కుంటుసాకులు చెపుతున్నారని మంత్రివద్దకు ఫైలు వెళితే ఐదు నిమిషాల్లో పరిష్కరించి పంపిస్తారని కాని ఫైలు మంత్రికి పంపకుండానే పంపామని అబద్దాలు చెపితే సహించబోనని కలెక్టర్ స్పష్టంచేశారు. పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో మార్కు ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నా ముందుకు రావడంలేదిని పరిశ్రమలశాఖ చెప్పడం సమంజసం కాదని ప్రభుత్వ పరంగా అందించే ప్రోత్సాహకాల విషయంలో పారిశ్రామిక వేత్తలకు సరైన అవగాహన కలిగించాలని భాస్కర్ చెప్పారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, పరిశ్రమలశాఖ డిప్యూటీ జియం ఆదిశేషు, డిపిఒ కె. సుధాకర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్దు అధికారి వెంకటేశ్వరరావు, ఏలూరు జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారి కోటయ్య తదితరులు పాల్గొన్నారు.


