పర్యాటకుల స్వర్గధామం… పండరీపురం
- 84 Views
- wadminw
- January 9, 2017
- Home Slider జాతీయం
దేశంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలలో పండరీపురం ప్రత్యేకతను గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ పర్యాటకుల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది. ముంబయి నుంచి హైదరాబాద్ వరకు ఉన్న రైలు మార్గంలో షోలాపూర్ ఉంది. షోలాపూర్ నుంచి పడమరగా సుమారు 70కి.మీ దూరంలో పండరీపురం ఉంది. బస్‌లో వెళ్ళాలి. షోలాపూర్‌కు ఉత్తరంగా ఉన్న కురుద్వాడీ అనే ఊరు నుంచి నీరజ్ వరకు ఉన్న రైలు మార్గం పండరీపురం మీదుగా వెళుతుంది.
అయితే షోలాపూర్ నుంచి బస్‌లో వెళ్ళడమే సుఖం. పండరీపురం చెప్పుకోదగిన పట్టణం. బస్‌స్టాండ్ ఊరి మధ్యలోనే ఉంది. ఊరికి ఒక చివర నది ఒడ్డున ఆలయం ఉంది. బస్‌స్టాండ్ నుంచి ఆలయం సుమారు ఒకటిన్నర కి.మీ. దూరంలో ఉంది. సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు ఉన్నాయి. బస్‌స్టాండ్‌కి దగ్గరగా కొన్ని సత్రాలు ఉన్నాయి. అలాగే ఆలయం దగ్గర కూడ చాలానే సత్రాలు ఉన్నాయి. ఇవి కాక పట్టణమంతా లాడ్జీలకు కొదవలేదు. ఆలయాన్ని ఆనుకొనే జ్ఞానేశ్వర్ భవన్ అని అధునాతంగా నిర్మించిన పెద్ద వసతి గృహం ఉంది.
ఆలయం చుట్టూ సుమారు 100 గజాల పొడవు, అంతే వెడల్పు ఉన్న ఎత్తయిన ప్రహరీ గోడ ఉంది. గోడ లోపలి ప్రాంగణంలో పాండురంగని ఆలయం, దాని వెనుకభాగంలో రుక్మిణీదేవి ఆలయం ఉన్నాయి. ఆలయం దగ్గర నుంచి 200మీ. దూరంలో భీమానది ఉంది. పండరీపురం ఊరికి రెండుపక్కలా ఉన్న సరిహద్దుల లోపల నదీ భాగాన్ని మాత్రం చంద్రభాగనది అని పిలుస్తారు. నది ఒడ్డు నుంచి సుమారు 200 మీ. లోపలగా అసలయిన నది ఉంటుంది. నది నీటి అంచుని ఆనుకుని పుండరీకుని ఆలయం, మరో మూడు ఆలయాలు ఉన్నాయి.
ఒడ్డు నుంచి ఈ ఆలయం వరకు ఇసుకలోనే నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షాకాలంలో ఈ ఇసుక ఉన్న భాగం కూడ నది నీటిలో మునిగిపోతుంది. అందువల్ల లోపల ఉన్న ఆలయాలను చేరుకోవడానికి చిన్నచిన్న పడవలు ఉంటాయి. లోపల ఉన్న ఆలయాలు ఎత్తయిన పునాదుల మీద ఉన్నాయి కనక మునిగిపోవు. ఇక ప్రధానఆలయంలో ఉన్న పాండురంగస్వామి చరిత్ర అందరికీ తెలిసిందే. పాండురంగని భక్తులలో సుమారు 30 మందికి పైగా స్వామిని కీర్తిస్తూ అనేక కీర్తనలు రచించారు. వీటిని మహారాష్ట్రలో అభంగాలు అంటారు.
మహారాష్ట్ర అంతటా ఈ కీర్తనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆషాడ పౌర్ణమికి పండరీపురంలో స్వామికి గొప్ప ఉత్సవం జరుగుతుంది. దీనికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఈ ఉత్సవానికి వచ్చేవారు చిన్నచిన్న బృందాలుగా ఏర్పడి వస్తారు. ఒక చిన్న పల్లకీలో పాండురంగని ప్రతిమని ఉంచుకుని ఆ పల్లకిని మోసుకుంటూ బయలుదేరుతారు. ఆ బృందంలో వారు తులసిమాల, గంధం మొదలయినవి ధరించి నిష్టగా ఉంటూ అభంగ కీర్తన చేస్తూ కాలినడకన వస్తారు. ‘జ్ఞానేశ్వర్’ జన్మస్థలం ‘అలండి’ నుంచి, ‘తుకారాం’ జన్మస్థలం ‘దూహు’ నుంచి మరికొన్ని ప్రధానమైన పల్లకీలు వస్తాయి. ఇలా పండరీపురం యాత్రగా వచ్చేవారిని ‘వర్కారి’లు అంటారు.
ఈ వర్కారిలలో అన్ని కులాల వారు ఉంటారు. మార్గం పొడవునా ప్రతి ఊరిలోని వారు ఈ వర్కారిలకు భక్తిగా పాలు, పండ్లు, భోజనం పెడతారు. ఆషాడ శుద్ధ పాడ్యమి నాటికి పండరీపురం చేరుకుంటారు. పౌర్ణమి వరకు ఉండి తిరిగి వెళ్ళిపోతారు. ఇప్పటికీ మహారాష్ట్రలో ఈ వర్కారీ సంప్రదాయం చక్కగా కొనసాగుతోంది.


