పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్లీన్ కాకినాడ బీచ్
కాకినాడ: పర్యావరణ పరిరక్షణకు సాగరాన్ని శుభ్రపరచి మానవాళికి సహాయం చేస్తున్న బొక్కు సొరచేపను పరిరక్షించుకోవల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందని జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల ఆడిటోరియంలో ఎగ్రీ పౌండీషన్, అటవీ శాఖ సంయుక్త ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ బొక్కు సొర చేప దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బొక్కు సొర చేపను రక్షించడం ద్వారా సముద్రకాలుష్యాన్ని తగ్గిస్తున్న దీనిని కాపాడాల్సినఆవశ్యకతఎంతైనా ఉందని తెలిపారు.
అంతరించిపోతున్న జల, జీవరాశులను సంరక్షించడం ద్వారా మానవులకు మేలు జరుగుతుందని అన్నారు. మన జిల్లా సముద్ర ప్రాంతంలో ఉండే పెద్దసొర చేపను కాపాడాల్సిన అవసరాన్ని ప్రజలందరకు తెలియజేయాలన్నారు. మత్య్సకారులు వేటాడినప్పుడు వలకు చిక్కినా దానిని సముద్రంలో విడిచి పెట్టాలని చెప్పారు. ఈ చేప యొక్క ప్రాధాన్యతపై మన్స్యకారులకు అవగాహన కల్పించాలని, ఈ సంవత్సరం 2 చేపలు చంపబడ్డాయన్నారు. ఈ చేపలు వలలో చిక్కితే సముద్రంలో విడిచి పెట్టాలని తద్వారా వారికి నష్టపరిహారం మత్స్యశాఖ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. ఇందుకు మత్స్యకారులకు యాప్ అప్లికేషన్ తయారు చేయడం జరిగిందని పేరు, ఫోన్ నెంబరు, జిల్లా , గ్రామం టైప్ చేసి చేప ఫోటోలు, విడిచి పెట్టడం, ఫోటోలు పెట్టాలన్నారు.
బొక్కుసొర చేపను దాని ద్వారా వచ్చే (ఆయిల్) నూనెను తీసి ఎగుమతి చేసుకోవచ్చని కొంత మంది పని చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరైనా ఈ చేపను చంపినట్లు నిర్దారణ అయితే 7 సం.రాలు జైలు శిక్ష విధించ వచ్చునని చట్టం షెడ్యూలు 1 తెలుపుతుందన్నారు. సమాజానికి మేలు చేసే ఈ జాతులను చంపరాదని సోషల్ నెట్వర్క్ మీడియా ద్వారా మత్సకారులను, సముద్ర వ్యాపారం చేసే వారికి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మన జిల్లాలో తొండంగి నుండి అంతర్వేది, పల్లిపాలెం వరకు 169 కి.మీ. సముద్ర తీరం ఉందని, వేల మత్సకారులు జీవనోపాధిగా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు.
సముద్రం వల్ల నౌకాయానం, యాంకరేజ్పోర్టు, డీప్వాటర్పోర్టు 7 బర్తుల ద్వారా ఎగుమతి , దిగుమతి జరుగుతుందని తెలిపారు. తొండంగి వద్ద కోనప్రాంతంలో ఇంకొక పోర్టు వస్తుందని, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితికి జిల్లా సపోర్టుగా ఉంటుందన్నారు. కోరంగి ప్రాంతంలో కనిపించే సముద్ర తాబేళ్లు, బొక్కుసొర చాపాలను, అన్ని రకాల జాతులను కాపాడుకోల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్ధుల్లో ఆలోచన రేకెత్తించాలని వారికి ఈ చేప ప్రాధాన్యత పై వ్యాస రచన, వక్తృత్వ పోటిలు నిర్వహించడం ద్వారా అవగాహన వస్తుందని ఆయన చెప్పారు.
వలలో చిక్కిన ఈ చేపను విడిచిపెట్టిన పొట్టిలక్ష్మి గ్రూపు మత్స్యకారులకు 18 వేల నష్టపరిహారం చెక్కును కలక్టరు అందచేసారు. యానాం రీజనల్ అడ్మినిస్ట్రేటర్ డి.సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ బొక్కు సొర చేప సముద్రాన్ని శుభ్రపరిచే స్కావెంజర్ లా పని చేస్తుందన్నారు. సాగరంలోని వ్యర్దాల నుండి కాపాడి మైక్రోఆర్గనిజమ్స్ శుధ్ధి చేస్తుందన్నారు. భూమి మీద ఉండే వ్యర్ధాలను శుభ్రం చేసుకోవడం లోనే మానవులు విఫలమవుతున్నారని, సముద్రాన్ని శుభ్ర పరచడానికి ఈ చేప ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనిని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎగ్రీ ఫౌండేషన్ స్టేట్ ప్రోజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.తులసీరావు మాట్లాడుతూ అన్ని రకాల బొక్కు సొర చేపలను కాపాడుటకు దృష్టికేంద్రీకరించామని తెలిపారు.
ఈ చేప వలస చేపని, దీనికి ఎటువంటి హాని చేయకూడదని వలలో చిక్కినప్పుడు మత్స్యకారులు విడిచి పెట్టాలన్నారు. ఇది తినడానికి ఉపయోగపడదని, దీనిని చంపితే నీరుగా మారిపోతుందని , సముద్రంలో విడిచిపెట్టడం ద్వారా జల కాలుష్యం నుండి మనలను రక్షిస్తుందన్నారు. దీని పొడపు 42 అడుగులు, బరువు 21 టన్నులు ఉంటుందని , ఈ చేప 13 వేల కి.మీ. దూరం నుండి పలస వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి జిల్లా అడవీ అదికారి వి.ప్రభాకరరావు, కాకినాడ డిఎ ఫ్ఓ(టి) ఎం.శ్రీనివాసరావు, మత్స్యశాఖ డిడి రామతీర్దం, ధరిత్రి ఫౌండేషన్ ప్రతినిధి ఎస్.సురేఖ, కాకినాడ సోషల్ఫారెస్ట్రీ డిఎఫ్ఓ అప్పన్న, అక్షర, ఆదిత్య , ఎంఎస్ఎన్ హైస్కూల్ విద్యార్ధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.


