పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిదీ: కోడెల
- 98 Views
- wadminw
- September 3, 2016
- తాజా వార్తలు
గుంటూరు, సెప్టెంబర్ 3 (న్యూస్‌టైమ్): బహిరంగ మలవిసర్జన జరగని రాష్ట్రంగా ఏపీని ప్రథమ స్థానంలో నిలబెట్టాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేసే దిశలో స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ కన్వీనర్‌గా నిరంతర సమీక్షలు, పర్యటనలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తాజాగా మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్ఠపై దృష్టి సారించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా సొంత నిధులు వ్యయం చేస్తున్నారు. ‘మట్టి విగ్రహాలను వాడండి, పర్యావరణాన్ని కాపాడండి’ అంటూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు.
ఇందుకు తన కుమారుని పేరిట నిర్వహిస్తున్న ‘డాక్టర్ కోడెల సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్’ను వేదికగా చేసుకున్నారు. ట్రస్ట్ అధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని శివుడు బొమ్మ సెంటర్, గడియారం స్థంభం సెంటర్లతో పాటు సత్తెనపల్లి పట్టణంలోని అమరావతి బస్ స్టాప్ (తాలూకా సెంటర్)లోనూ దాదాపు 20000 మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు. ఇక్కడి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ట్రస్ట్ అధినేత డాక్టర్ కోడెల శివరామకృష్ణ చేతుల మీదుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నారు. ఆదివారం ఉదయం 9-00 గంటల నుండి పంపిణీ జరగనుండగా పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోడెల శివరామకృష్ణ కోరారు. కలుషితమైన, రసాయనాలు కలిగి, ప్రజల ఆరోగ్యాన్ని హరించే ప్లాస్టరాఫ్ ప్యారిస్ విగ్రహాలను విడనాడి, మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని సభాపతి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.


