పల్నాడును ముంచెత్తిన భారీ వర్షాలు
- 77 Views
- wadminw
- September 23, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. సత్తెనపల్లిలో ఆరు గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పల్నాడు ప్రాంతం కుంభవృష్టి కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. తూర్పు గోదావరిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నవెదైంది. కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద బాధితులను కాపాడడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కాగా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలవల్ల గురువారం రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రైలు పట్టాలపై నీరు చేరడంతో రైళ్ళను నిలిపివేశారు. పల్నాడు, ఫలక్‌నుమా, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైళ్ళను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఆ మార్గంలో నడిచే రైళ్ళను దారిమళ్ళించారు.
కొన్నింటిని గుంతకల్లు, మరికొన్ని కాజిపేట మీదుగా నడుపుతున్నారు. రైళ్ళ మళ్ళింపువల్ల ప్రయాణాలు రద్దుచేసుకున్న వారి టిక్కెట్ మొత్తాన్ని చెల్లించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. విజయవాడలో ఆధునీకీకరణ వల్ల పలు రైళ్ళు రద్దుచేశారు. మరోవైపు, పులిచింతల ప్రాజెక్టు నిండుకుండగా మారింది. ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి వరదనీరు చేరడంతో నీటినిల్వ సామర్థ్యం మించిపోయింది. ప్రాజెక్టులో 30 టిఎంసిల నీరు నిల్వచేసే అవకాశం ఉండగా 40 టిఎంసిల నీరు వచ్చింది. మూడు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు వదిలారు. ఆ నీరు ప్రకాశం బ్యారేజీ వస్తుండడంతో గేట్లకు దశల వారీగా ఎత్తుతున్నారు. ఇప్పటికే పదిగేట్లు ఎత్తివేయగా, మిగిలిన 60 గేట్లను కూడా ఎత్తివేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్‌శాఖ చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సీఎం కూడా వివరాలను సేకరిస్తున్నారు. జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావుతో ఫోన్లో చర్చించారు. పులిచింతల నీరు కృష్ణా జిల్లాలోకి వస్తున్నందున తీరప్రాంత వాసులను అప్రమత్తం చేయాలన్నారు. ఇందుకు హరీష్‌రావు సానుకూలంగా స్పందించారు.
బస్సులో చిక్కుకున్న ప్రయాణీకులు క్షేమం
విజయవాడ, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): గుంటూరు జిల్లాలోని ఎద్దువాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని 47 మంది ప్రయాణీకులను స్థానికులు, పోలీసుల సాయంతో బయటకు తీసుకువచ్చారు. అసలు ప్రయాణీకులు ప్రాణాలతో బయట పడతారా? లేదా? అని గత మూడు గంటలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీఎం కార్యాలయం నుంచి, గ్రామస్థాయి వరకు ఈ ఘటనపై దృష్టి సారించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ పర్యవేక్షించారు. గుంటూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు క్రోసూరు మండలం, విప్పర్ల-పీసపాడు మధ్య గురువారం ఉదయం ఎద్దువాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు, జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిలకలూరిపేట మండలం అమీన్‌సాహెబ్‌పాలెం వద్ద చెప్టాపై వరద నీరు ఉధృతిలో నలుగురు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు చెట్టును పట్టుకుని ప్రాణాలు రక్షించుకున్నాడు. మిగిలిన ముగ్గురు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు చెట్టును పట్టుకుని వేలాడుతూ రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నాడు. దీంతో అతడిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దీనిపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడారు. దీంతో అతడిని రక్షించేందుకు ఎన్టీఆర్ఎప్ సిబ్బంది హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. బ్రహ్మణపల్లిలో వాగులో కొట్టుకుపోయిన నలుగురిలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు.
కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
వరద మృతులకు రూ. 4 లక్షల పరిహారం
విజయవాడ, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం ఇక్కడ జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి 4లక్షల నష్టపరిహారం చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. ఏపీ ఫెర్రో అలాయిస్ ప్రొడ్యూసర్స్ అభ్యర్ధన మేరకు విద్యుత్ బిల్లులో రాయితీకి షరతులతో కూడిన అనుమతి ఇవ్వనుంది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మెరైన్ అవుట్ ఫాల్ పైప్‌లైన్ నిర్వాసితులకు 61 కోట్లు పరిహారం ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మాణానికి నిర్ణయించింది. ఇండస్ట్రియల్ పార్కుల్లోని భూముల అభివృద్దికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పశు సంవర్ధక శాఖలో 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ, విజయనగరం జిల్లా ఉద్యానవన కళాశాలకు 90 పోస్టులు మంజూరు, మంగళగిరిలో 5 వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం, విశాఖ ఎయిర్‌పోర్టు రన్‌వే పెంచాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా అడవివరంలో ఇంటర్నేషనల్ స్కూల్ అభివృద్దికి చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ, నోవా గ్రూప్‌తో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకోనుంది. అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో సిటీటూరిజం కౌన్సిల్ ఏర్పాటుతో పాటు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళిలో వేధిక్ వర్సిటీ ఏర్పాటుకు అనుమతించింది. ఈమేరకు శ్రీమత్ ఉభయ వేధాంత చంద్రపీఠానికి 209.84 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. బీసీ గ్రాడ్యుయేట్ల పీజీ ఎన్టీఆర్ విదేశీ విద్య కోసం ప్రతి విద్యార్థికి 10 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో బీసీ భవన్ నిర్మాణానికి అమోదం తెలిపింది. మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల్లోని ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపునకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.


