పవన్ సభలో తొక్కిసలాట: ఒకరు మృతి
- 95 Views
- wadminw
- September 9, 2016
- తాజా వార్తలు
కాకినాడ, సెప్టెంబర్ 9 (న్యూస్టైమ్): జనసేన అధినేతీ పవన్కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో నిర్వహించిన ఆత్మగౌరవ సభలో అపశృతి చోటుచేసుకుంది. బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో ఒక యువకుడు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన యువకుడిని తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామవాసి వెంకటరమణగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ సభను వీక్షించేందుకు సభా స్థలిలోని చెట్లు ఎక్కిన యువకులు కొందరు కిందపడి గాయాలపాలయినట్లు తెలిసింది. వారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.
అంతేకాకుండా కిందపడిన వారిని తొక్కుకుంటూ మరికొందరు వెళ్లడంతో పరిస్థితి విషమించింది. పవన్ సభ ప్రారంభించే ముందే అభిమానులకు జాగ్రత్తలు చెప్పినా తమ అభిమాన నటుడిని చూడాలన్న ఆత్రంతో గాయాలపాలయ్యారు. కాగా, జిల్లాలోని తాడికోన గ్రామం వద్ద గల ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్ జీసీ) వెల్ నుంచి గ్యాస్ లీక్ అయింది. పెద్ద మొత్తంలో వెల్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో సయ్యద్ అనిసుల్ హక్ అనే వ్యక్తికి తీవ్ర అస్వస్ధతకు గురైయ్యాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
వెల్ నుంచి గ్యాస్ ఎక్కువగా లీక్ అవుతుండటంతో రక్షణా చర్యల్లో భాగంగా ఓఎన్ జీసీ సిబ్బంది చుట్టుపక్కల గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో ఓఎన్ జీసీ నుంచి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ స్థానికులు కంపెనీ రిగ్ వద్ద ఆందోళనకు దిగారు. 2014లో నగరం గ్రామం దగ్గరలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) పైప్ లైన్ పేలుడులో 15 మంది గ్రామస్థులు మరణించిన విషయం తెలిసిందే.


