పవన్ ఎవరికి ప్రత్యర్థి?
- 97 Views
- wadminw
- September 5, 2016
- రాష్ట్రీయం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి ప్రత్యర్థిగా మారబోతున్నాడు? పవన్ పార్టీ వల్ల టీడీపీకి లాభమా నష్టమా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? జనసేన పార్టీతో నష్టపోయేదెవరు? లాభపడేది ఎవరూ? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది.
2019 ఎన్నికల్లో కీలకంగా మారనున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఇప్పుడు ఏపీ రాజకీయ పార్టీలకు వణుకు పుట్టిస్తోంది. పవన్ ఏ తరహా ప్రజలను క్యాచ్ చేసుకోబోతున్నాడు? ఏ ప్రాంతంలోదుమ్మురేపబోతున్నాడు? ఎవరికి ఎంత నష్టం? ఎంత లాభం? వంటి బిలియన్ డాలర్ల ప్రశ్నల వేటలోతలమునక లైపోయాయి పార్టీలన్నీ. నిజానికి 2009 ఎన్నికలకు ముందు పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.
దీని వల్ల అప్పట్లో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక రాబోవు 2019 ఎన్నికల్లో పవన్ వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎంత నష్ట పోతుంది? అధికార టీడీపీ ఎంత నష్టపోతుంది అనే లెక్కలు నడుస్తున్నాయి. నిజానికి పవన్ వల్ల తామంతా నష్టపోతామని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా పార్టీలన్నీ భయపడుతున్నాయి. పవన్ వల్ల తమకు ఏ మేర నష్టం జరుగుతుందనే అంశంపై టీడీపీ నేతలు కూడా ఆరా తీసేపనిలో పడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్ వల్ల టీడీపీకి మద్దతు పలికిన కాపులు 2019 ఎన్నికల్లో దూరమయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఇటీవల పవన్ తిరుపతి సభ తర్వాత రాజకీయ పరిణామాలన్ని చకచకా మారిపోతున్నాయి. నిజానికి ఆ సభలో ప్రత్యేక హోదా అంశమే ప్రధానంగా తెరమీదకు వచ్చింది. కానీ రాజకీయంగా కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే విషయం ఆ సభ చెప్పకనే చెప్పింది. ఈ నేపథ్యంలో సామాజికవర్గ అంశాలు కూడా మారిపోయే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పవర్‌కు పవన్ చెక్ చెప్పే అవకాశాలు లేకపోలేదనే విశ్లేషణలూ సాగుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం నడుంబిగించిన పవన్ ఆ విషయం తేలగానే గతంలో చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీ నెరవేర్చకుంటే దానిని కూడా నిలదీసే అవకాశముంది.
అప్పుడు ముద్రగడ ఉద్యమానికి, ఆయన నాయకత్వానికి పవన్ చెక్ చెప్పినట్లేనని భావిస్తున్నారు. జనాకర్షకశక్తి ఉన్న పవన్ ముందు ముద్రగడ వంటివాళ్లు నిలవడం కష్టమే అంటున్నారు. అందువల్లే తమ ఉద్యమానికి మద్దతివ్వాలని తాము పవన్‌ను ముద్రగడ కోరడం లేదేమో అంటున్నారు. నిజానికి పవన్ మనస్తత్వం ప్రకారం కుల ప్రాతిపదికన జరిగే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడానికి ఆయన కూడా ఇష్టపడరు.
మరోవైపుప్రధాన ప్రతి పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల కోసం తమ ఆయుధాలను సిద్ధం చేసుకునే పనిలో పడింది. ఎన్నికల నాటికి కాపులను టీడీపీకి దూరం చేసి తమవైపు తిప్పుకో వాలన్నది జగన్ వ్యూహంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ముందుకు వచ్చారు. ఇది జగన్ ప్లాన్‌కు ఇబ్బందికర అంశమే. అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో కాపు ఓటు కీలకం. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పోరాటం సాగిస్తున్నారు.
జనాకర్షణ ఉన్న పవన్ కూడా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తే ఆ క్రెడిట్ పవన్‌కే వెళ్లిపోయే అవకాశం ఉంది. అత్యధిక ప్రజలు ఏమి కోరుకుంటున్నారో అదే విషయంపై పోరాటం సాగిస్తానన్న పవన్ కాపు రిజర్వేషన్లపై కూడా ఉద్యమించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముద్రగడను ఒక్కరినే నమ్ముకుంటే ఫలితం లేదని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి సభలో బీజేపీని, టీడీపీని గట్టిగా తిట్టలేదెందుకని వైసీపీ నాయకులు వాపోయారు. ఇలాంటి విమర్శలకు పవన్ తన ప్రసంగంలోనే సమాధానం ఇచ్చాడు. తాను నోరు జారనని స్పష్టం చేశాడు. తిట్టకపోయినప్పటికీ బీజేపీని, టీడీపీని ఘాటుగానే ప్రశ్నించాడు.
ప్రత్యేక హోదా కానీ, ప్యాకేజీ కానీ కేంద్రం ఏదీ ప్రకటించినా ఆ క్రెడిట్ ఎక్కువగా పవన్‌కే దక్కుతుంది. ఆ సందర్భం జగన్‌కు షాకేనని చెప్ప వచ్చు. ప్రత్యేక హోదా పైన జగన్ తనదైన శైలిలో ఉద్యమించారు. ఇప్పుడు పవన్ ఆ విషయంలోకి ఎంటర్ కావడంతో జగన్ కార్నర్ అయ్యారు. అలాగే కాపు నేత ముద్రగడ ద్వారా కాపులను తనవైపు తిప్పుకుందా మని జగన్ భావించారు. దానిని కూడా పవన్ కార్నర్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, కాపు ఉద్యమం నుంచి 2019 ఎన్నికల వరకు పవన్ వల్ల జరిగే నష్టాన్ని జగన్ ఎలా పూడ్చుకుంటారనే చర్చ సాగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళుతున్నా లైట్‌గా తీసుకున్న జగన్ ఇప్పుడు రాజకీయ చతురత చూపించాల్సిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు వర్సెస్ పవన్
2014లో తమకు మద్దతిచ్చిన పవన్ ఇక పూర్తిగా రంగంలోకి దిగడంతో 2019 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. పవన్ రంగంలోకి దిగడంతో బాబు తన వ్యూహాన్ని మార్చుకున్నారని అంటున్నారు. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. కరువు కారణంగా రాయలసీమలో ఎండిపోతున్న పంటలను కాపాడటంపై దృష్టి సారించారు. 3 రోజులపాటు అనంతపురం జిల్లాలోనే మకాం చేసి రైతులతో మమేకమయ్యారు. ఎన్నికల కోసం రైతులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదంతా భవిష్యత్తు పరిణామాలను ఊహించి చేస్తున్నదే కావొచ్చనే వాదనలు వినిపిస్తు న్నాయి. పవన్‌ను దూరం చేసుకోకూడదని, ఒకవేళ అనుకోని పరిస్థితులలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ ప్రత్యర్థిగా మారినా పని చేసే సీఎంగా ప్రజలు తనను మాత్రమే ఆదరించేలా బాబు తనదైన జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారని చెప్పవచ్చు.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీలు కూడా పవన్ అడుగులను గమనిస్తూ తమ భవిష్యత్ రాజకీయ కార్యచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏదీ ఏమైనా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలతో పాటు కాంగ్రెస్, బీజేపీలకు కూడా పవన్ దూకుడు మింగుడపడటం లేదన్నది వాస్తవం. అయితే ప్రతి విషయంలోనూ పవన్ ఆవేశ పడితే, ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, అదే తమకు ప్లస్ అవుతుందని ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఫైనల్‌గా రాజ కీయ చదరంగా ఎవరి వ్యూహాలు ఎలా ఉంటా యన్నదే ఇప్పుడు అసలు విషయం.


