పాకిస్థాన్‌ను కలవరపెట్టిన ఉగ్రదాడి
- 85 Views
- wadminw
- October 25, 2016
- అంతర్జాతీయం
క్వెట్టా, అక్టోబర్ 25: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. క్వెట్టాలోని పోలీసు శిక్షణా వసతి గృహంపై మంగళవారం ఉదయం దాడిచేసి నరమేథం సృష్టించారు. ఈ దాడిలో వసతిగృహంలో ఉన్న 60 మంది శిక్షణా పోలీసులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రవాదుల దాడిచేసిన సమయంలో శిక్షణా వసతి గృహంలో దాదాపు 600 మందికి పైగా ఉన్నారు. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు.
మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు కొంతమంది శిక్షణా పోలీసులను బందీలుగా చేసుకుని వసతిగృహంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఉగ్రదాడి నేపథ్యంలో క్వెట్టాలో హై అలర్ట్ ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఐదారుగురు ఉగ్రవాదులు పోలీసు శిక్షణా వసతిగృహం ప్రధానం ద్వారం నుంచి లోపలికి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని బలూచిస్థాన్ హోం మంత్రి సర్ఫ్రాజ్ బగ్టి మంగళవారం ఉదయం పాక్ మీడియాకు వెల్లడించారు.
వసతి గృహం నుంచి దాదాపు 250 మందిని భద్రతా బలగాలు కాపాడినట్లు తెలిపారు. మిగిలిన వారిని రక్షించేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గాయపడిన వారు కోలుకుంటున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులు ముందుగా వాచ్ టవర్ సెంట్రీని లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించారనీ, ఆ తరువాత శిక్షణా శిబిరంలోకి ప్రవేశించారని పేర్కొంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాక్ భద్రతా బలగాలు పేర్కొన్నాయి. భద్రతా సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం.
కాగా, కొంతమంది పోలీసులు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నట్టు తెలిసింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయినట్లు పాక్ మీడియా ప్రకటించింది. నిషిద్ధ అల్‌ఖైదాకు అనుబంధంగా ఉండే లష్కరే జంగవి ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, ఉగ్రవాదుల పైశాచికత్వం మరోసారి లోకానికి వెల్లడైంది. వారిలోని రక్తపిపాస ఎంత దారుణంగా ఉంటుందో తెలిసింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం రాత్రి ఉగ్రవాదులు బరితెగించి పోలీస్ శిక్షణా కేంద్రంపై దాడి చేశారు.
వీరి రక్త దాహానికి 60 మంది బలైపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారని, 250 మందిని ముష్కరుల బీభత్సకాండ నుంచి కాపాడగలిగారని చెప్తున్నారు. ఈ కేంద్రంలో పారామిలిటరీ దళాలు, పోలీసు శిక్షణ పొందుతున్నవారు ఉన్నారు. శిక్షణ పొందుతున్నపోలీస్ ఒకరు దాడి నుంచి తృటిలో తప్పించుకున్న తర్వాత ఓ ఛానల్‌తో మాట్లాడుతూ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోని హాస్టల్వైపు ఉగ్రవాదులు దూసుకొస్తూ కాల్పులు జరుపుతుండటం చూసి తామంతా భయంతో భవనంపైకి పారిపోయి, అక్కడి నుంచి కిందకు దూకినట్లు తెలిపారు. పారామిలిటరీ ఫ్రాంటియర్ కార్ప్స్ చీఫ్ మేజర్ జనరల్ షేర్ ఆఫ్గన్ మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్‌లోని హ్యాండర్లతో నిరంతరం సంభాషించారన్నారు.
ఆత్మాహుతి బెల్టులను పేల్చుకున్నారని, దీంతో భారీ ప్రాణ నష్టం సంభవించిందని చెప్పారు. అల్‌ఖైదా అనుబంధ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ ఝాంగ్వి అల్ అల్మికి చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ సంస్థపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉందన్నారు. బలూచిస్థాన్ పోలీస్ చీఫ్ అహసాన్ మహబూబ్ విలేకర్లతో మాట్లాడుతూ పోలీస్ శిక్షణ కేంద్రంపై నలుగురు ఉగ్రవాదులు దాడి చేశారన్నారు. శిక్షణలో ఉన్న పోలీసులు బస చేసిన హాస్టల్ భవనంలోకి చొరబడేందుకు ప్రయత్నించారన్నారు. అయితే సైన్యం విడుదల చేసిన ప్రకటనలో ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటించలేదు.
బలూచిస్థాన్‌లో గతంలో జరిగిన దాడులకు బాధ్యత తమదేనని తాలిబాన్ నుంచి విడిపోయిన జమాతుల్ అహ్రార్ ప్రకటించుకుంది. లష్కర్ ఏ ఝాంగ్వి ప్రధాన లక్ష్యం మైనారిటీలైన షియా ముస్లింలే. మరోవైపు, జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. ఆదివారం రాత్రి నుంచి మోర్టార్ బాంబులు, ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణారహితంగా జరిపిన దాడుల్లో ఆరేళ్ల చిన్నారి బలయ్యాడు. తీవ్రంగా గాయపడిన బీఎస్ఎఫ్ జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
మరో 9 మంది గాయపడగా ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన పాక్ సైన్యం 25 సరిహద్దు ఔట్‌పోస్టు (బీఓపీ)లు, జమ్మూ జిల్లాలోని నివాస ప్రాంతాలైన ఆర్ఎస్ పురా, ఆర్నియా, సుచేత్‌గఢ్, కనచక్, పర్గ్వాల్ సెక్టార్లలో అసాధారణ రీతిలో కాల్పులు జరిపింది. రాత్రంతా లాల్యాల్-గర్ఖాల్ ప్రాంతంలోని బంకర్లలో ఉన్న బిహార్ కార్మిక కుటుంబానికి చెందిన విక్కీకుమార్ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన వెంటనే మోర్టార్ బాంబు శకలం తగిలి మరణించాడు.
ఆర్ఎస్ పురాలో హరియాణ కురుక్షేత్రకు చెందిన బీఎస్ఎఫ్ జవాను సుశీల్‌కుమార్ మెడకు బాంబు శకలం తగిలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా, 30కి పైగా పశువులు కూడా కాల్పుల్లో మరణించాయని, మరో 130 గాయపడ్డాయని అధికారులు తెలిపారు. పాక్ దాడులను సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్ఎఫ్) సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. భారత సైనికులు హర్పాల్, పుఖ్లియన్, చర్వా సరిహద్దుల్లో కాల్పులు జరిపారని, ఇందులోఆరు నెలల పసిబిడ్డ సహా మరో పౌరుడు మరణించారని పేర్కొంది.
ఏడుగురు గాయపడ్డారని వెల్లడించింది. కాగా, కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా లోలబ్లో ఆదివారం భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఇదిలావుండగా, పఠాన్ కోట్, ఉడీ ఉగ్రదాడుల సూత్రధారి, జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజాద్ సహా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోన్న 5100 మంది బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాల గుండా ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధులు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన జాతీయ ఉగ్రవాద వ్యతిరేక సంస్థ(నాక్టా) ఆ మేరకు వాటిని స్తంభింపజేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 5100 అకౌంట్లను స్తంభిపజేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్(ఎస్ బీపీ) ఒక ప్రకటన చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం-1997ను అనుసరించి ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. కేటగిరీలుగా విభజించిన అకౌంట్ల వివరాలను నాక్టా గత నెలలో ఎస్‌బీపీకి అందించిందని, మసూద్ అజార్ అకౌంట్ వివరాలను ఏ కేటగిరిలో ఉంచినట్లు బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రభుత్వం బ్లాక్ బ్యాంక్ అకౌంట్లలో 3,078 అకౌంట్లు ఒక్క ఖైబర్ ఫక్తుక్వా రాష్ట్రానికి చెందినవే కావడం గమనార్హం.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన 26 అకౌంట్లతోపాటు పంజాబ్ రాష్ట్రంలో 1,443, సింధ్‌లో 226, బలూచిస్థాన్193, గిల్గిట్ 106, ఇస్లామాబాద్‌కు చెందిన 27 మంది అకౌంట్లను అక్కడి ప్రభుత్వాలు స్తంభింపజేశాయి. ఉగ్రవాద నిర్మూలకు కట్టుబడి ఉంటామని అంతర్జాతీయ వేదికలపై ప్రకటించే పాకిస్థాన్ ఉగ్రసంబంధిత అకౌంట్లను భారీగా స్తంభింపజేయడం ఇదే మొదటిసారి. అయితే అసలు ఉగ్రవాదులు మాత్రం పాక్ సైన్యం రక్షణలో స్వేచ్ఛగా జీవిస్తుండటం దాయాది ద్వంద్వస్వభావానికి నిదర్శనం.


