పాతతరం గాయని… గీతా దత్
- 77 Views
- wadminw
- January 14, 2017
- Home Slider సినిమా
గీతా దత్… పాత తరం నేపధ్య గాయని. గీతా దత్ 1930లో ఫరీద్పూర్ (అప్పట్లో భారతదేశంలో భాగమైన బెంగాల్లో ఉండేది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భాగంగా ఉంది)లోని ఒక ధనిక జమిందార్ల కుటుంబంలో గీతా ఘోష్ రాయ్ చౌదరీగా జన్మించారు. ఆమెకు పన్నెండేళ్ల వయసులో అంటే, 1942లో, ఆమె తల్లితండ్రులు బాంబే (ప్రస్తుతం ముంబై)లోని దాదర్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌కు తమ మకాం మార్చారు. అక్కడ, స్వరకర్త/సంగీత దర్శకుడు అయిన హనుమాన్ ప్రసాద్ ఒకసారి అనుకోకుండా ఆమె పాటని వినడంతో పాటు ఆమె స్వరంలోని మాధుర్యానికి ఆయన ఎంతో ముగ్థులయ్యారు.
దీంతో గాయనిగా ఆమెకు శిక్షణ అందించేందుకు ఆయన ముందుకు వచ్చారు. అటుపై భక్త ప్రహ్లాద (1946) చిత్రంలోని ఒక కోరస్ (బృంద గానం) గీతం ద్వారా ఆమెను వెండితెరకు పరిచయం చేశారు, ఈ కోరస్ గీతంలో భాగంగా ఆమె కేవలం రెండు పంక్తులు మాత్రమే ఆలపించారు. అయితే, ఆమె ఆలపించిన ఆ రెండు పంక్తులే సినీరంగంలో ఆమె నిలదొక్కుకునేందుకు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాతి సంవత్సరం, నేపథ్య గాయనిగా ఆమె దో భాయి చిత్రం ద్వారా ఒక పెద్ద అవకాశాన్ని చేజిక్కించుకున్నారు, దీంతోపాటు ఆ చిత్రం కోసం గీతా రాయ్ ఆలపించిన గీతాలు ఆమెను ఒక అగ్రశ్రేణి నేపథ్య గాయకురాలిగా ముందు వరుసలో నిలబెట్టాయి. గీతా రాయ్ గురించి ఇక్కడ ఉన్న ఈ వ్యాసాన్ని సంగీతాభిమానిగా చిరకాల అనుభవం కలిగిన నాసిర్ అలీ రాశారు…
పందొమ్మిదివందల నలభైలకు చెందిన గీతా రాయ్ గురించి తెలుసుకునేందుకు మనల్ని మనం పరిమితం చేసుకున్నప్పటికీ, కనీసం కౌమార ప్రాయం కూడా దాటక ముందే ఎవరికీ తెలియని ఒక అనామ- క బాలిక స్థాయి నుంచి లక్షలాది మంది ఆరాధించే ఒక ఆదర్శముర్తి స్థాయికి ఆమె చేరుకున్న వైనం గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి గురికాకుండా ఉండలేం. దేవేంద్రనాథ్ ఘోష్ రాయ్ చౌదరికి చెందిన జమిందారీ కుటుంబ వారసురాలైన ఆమె, అమియా దేవి కడుపున పదిమంది సంతానంలో ఒకరిగా నవంబర్ 23, 1930న సెంట్రల్ బెంగాల్‌లోని ఫరీద్‌పూర్‌లో జన్మించారనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. పుట్టిన ఊరిని, ఇతర ఆస్తులను విడిచిపెట్టి నలభైల ప్రారంభంలో కలకట్టాకు చేరిన గీతా రాయ్ కుటుంబం, అటు తర్వాత 1942లో బాంబే (ప్రస్తుతం ముంబై)కి చేరింది. పరిస్థితుల ప్రాబల్యం కారణంగానే అప్పట్లో ఆ కుటుంబం అలా చేయాల్సి వచ్చింది తప్ప దీర్ఘకాల అన్వేషణలో భాగంగా మాత్రం కాదు.
బ్రిటీష్ పాలన కాలంలో బెంగాల్ ఒక అద్వితీయమైన జాతీయవాద కేంద్రంగా ఉండేది. 1905లో లార్డ్ కర్జన్ ద్వారా ఆ ప్రాంతం పశ్చిమ బెంగాల్ గాను, తూర్పు బెంగాల్ గానూ విభజించబడింది. అయితే, 1911లో ఆ రెండు ప్రాంతాలను మళ్లీ ఒకటిగా చేశారు. అలాగే రాజధానిని ఢిల్లీకి మార్చడంతో పాటు బీహార్, ఒరిస్సాలను ప్రత్యేక రాష్ట్రాలుగా సృష్టించడం కూడా జరిగింది. అయితే, 1947లో పాకిస్థాన్‌ను ఏర్పాటు చేసిన సమయంలో బెంగాల్ చివరిసారి విభజనకు గురైంది. ఇందులో భాగంగా అత్యధిక ముస్లిం జనాభాకు ఆలవాలమైన బెంగాల్‌లోని తూర్పు భాగం తూర్పు పాకిస్థాన్‌గా ఏర్పాటైంది.
అటుపై 1971లో ఈ ప్రాంతం పాకిస్థాన్ నుంచి కూడా విముక్తం పొంది బంగ్లాదేశ్‌గా అవతరించింది. ఇక గీతా రాయ్ జన్మించిన ఫరీద్పూర్ ప్రాంతం అదిల్‌పూర్ (లేదా ఇదిల్పూర్)కు చెందిన ఒక పరగానా, ఇది బెంగాల్లో ఒక భాగంగా ఉండేది. నలభైల ప్రారంభంలో ప్రపచం వ్యాప్తంగా అధ్వానమైన పరిస్థితులు చోటు చేసుకోవడమే కాకుండా ప్రత్యేకించి భారతదేశంలో అత్యంత అధ్వానమైన పరిస్థితులు నెలకొని ఉండేది. ఆ సమయంలో జపాన్ వారు భారతదేశంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించడమే కాకుండా 1942లో వారు బర్మాను ఆక్రమించారు. ఆ సమయంలో భూ దహన విధానాన్ని అమలు చేసిన బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం, జపాన్ వారికి ఆహార పదార్ధాల సరఫరా అపివేసేందుకు ఈ విధానాన్ని చిట్టగాంగ్ వద్ద ప్రారంభించింది.
1943లో, బెంగాల్లో కనీవిని ఎరుగని భయంకరమైన కరువు పరిస్థితులు ఏర్పడడంతో 3.5 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం కరువు కారణంగా మృతి చెందిన వారిని సమీపాన ఉన్న గ్రామాలకు తరలించేవారు. మరోవైపు జపాన్ వారు తమ భూభాగంలోకి అడుగుపెట్టడంతో గ్రామాల్లోను మరియు ప్రాచీన ప్రాంతాల్లోనూ నివశిస్తున్న ప్రజలు అక్కడి నుంచి నిష్క్రమించడం ప్రారంభించారు. అలా గ్రామాలను విడిచిపెట్టినవారంతా నగరాల వైపు తమ పయనాన్ని సాగించారు. ఆ సమయంలో సమైఖ్యంగా ఉన్న బెంగాల్‌కు కలకట్టా (ప్రస్తుతం కోల్‌కతా) రాజధానిగా ఉండేది.
గ్రామాలను విడిచి పెట్టిన లక్షలాది శరణార్థులు నగరాలకు, ప్రత్యేకించి కలకట్టాకు చేరుకోవడం ప్రారంభం కావడానికి కేవలం కొద్దిరోజుల ముందు గీతా రాయ్ కుటుంబం కలకత్తాకు వలస రావడానికి బహుశా బెంగాల్లో ఏర్పడిన ఆనాటి దుర్భర పరిస్థితులే కారణం కావచ్చు. అలా ఆ రోజుల్లో ఫరీద్పూర్ నుంచి వలస వచ్చిన వారిలో విద్యావేత్త, రచయిత అయిన కాజీ అబ్దుల్ వాదద్, రాజకీయవేత్త, విద్యావేత్త, రచయిత అయిన అయిన హుమయున్ కబీర్, కవి అయిన సునీల్ గంగోపాధ్యాయలతో సహా మరెందరో ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితుల మధ్య కలకట్టా సైతం శాంతి, భద్రతకు అనువైన ప్రదేశంగా భరోసా ఇవ్వలేక పోయింది. సరిగ్గా అలాంటి సమయంలోనే భారతదేశంలోకెల్లా అత్యంత భరోసా కలిగిన నగరంగా బాంబే వృద్ధి చెందడం ప్రారంభమైంది, సోన్ కి చిదియా, ది గోల్డెన్ బర్డ్ లేదా ఎల్ డొరాడో అని సైతం కొంతమంది ఈ నగరం గురించి సంభోదించే వారు.
మరోవైపు 1943 నాటికి, వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుతో సినీ పరిశ్రమకు సంబంధించి కొత్త థియేటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పాడ్డాయి. దీంతో, సొంతంగా సినిమా స్టూడియోలను నిర్మించిన వారు స్వతంత్రంగా సినిమాలు రూపొందించేందుకు ఈ పరిస్థితి వారికొక వరంగా మారింది. అదేసమయంలో సర్వజనీన స్వభావం కలిగిన బాంబే వైపుగా దేశంలోని పశ్చిమ భాగానికి చెందిన అనేక మంది కళాకారులు దృష్టిసారించారు. దీంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి, ముఖ్యంగా పంజాబ్, యునైటెడ్ ప్రొవియెన్స్, బెంగాల్ నుంచి వచ్చిన అనేక మందికి బాంబే ఒక ప్రధాన స్థావరంగా తయారైంది.
లయబద్ధమైన డోలక్ స్వేచ్ఛతో సహా యూపీ, రాజస్థాన్‌లకు చెందిన జానపద-రాగాలు, బెంగాల్‌కు చెందిన రవీంద్ర సంగీత్, పంజాబ్‌కు చెందిన హీర్, భాంగ్రా-ఆధారిత పాటలను సైతం ఆనాటి బాంబే సాదరంగా ఆహ్వానించింది. అంతేకాదు చూపుకు నోచుకోని ప్రఖ్యాత గాయకుడు, నటుడు అయిన కె.సి. డే సైతం 1942లో తాత్కాలికంగా తన మకాంను బాంబేకు మార్చారు. ఇలాంటి తరుణంలోనే పరిస్థితుల కారణంగా ఇబ్బందులకు గురైన గీతా రాయ్ కుటుంబం అదృష్టం కొద్దీ చిత్ర పరిశ్రమ కార్యకలాపాలకు కేంద్రమైన దాదర్‌లో సొంత ఇంటిని కొనుగోలు చేసింది. ఆ సమయంలో గీత వయసు కేవలం పన్నెండేళ్లు.
ఆ తర్వాత, మూడు-నాలుగేళ్ల పాటు ఒక సాధాసీధా అమ్మాయి లాగే గీత కూడా తన పాఠశాల చదువును కొనసాగించింది. అప్పట్లో ఆమె చదివిన బెంగాలీ హైస్కూల్‌ను ఆమె ఎన్నటికీ మర్చిపోలేదు: గీతా రాయ్ లేదా గీతా దత్‌గా పేరు ప్రఖ్యాతులు సాధించిన తర్వాత కూడా ఆ పాఠశాలలో జరిగే దుర్గా పూజకు ఆమె తప్పకుండా హాజరయ్యేవారు. 1971 వరకు అంటే, 1972లో ఆమె మరణించడానికి ముందు ఏడాది వరకు ఆమె ఎప్పుడు కూడా ఈ పూజకు హాజరు కాకపోవడం జరగలేదు! ఒక అమ్మాయిగా, అదృష్టం కొద్దీ విభిన్న వర్గాలకు చెందిన వారితో కలిసి ప్రయాణించడం వల్ల ఆమె హిందీ భాషా ప్రావీణ్యం గణనీయంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడింది. అయితే, పాటకే ఆమె ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇచ్చేవారు.
పాడడాన్ని ఆమె ఎంతగా ప్రేమించే వారంటే, ఫరీద్‌పూర్‌లో ఉన్నప్పుడు సైతం కుటుంబ బంధువైన హరేంద్రనాథ్ నంది ద్వారా ఆమె ప్రాథమిక స్థాయి సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ఆమె తన స్వగ్రామంలో ఉన్న సమయంలో గ్రామఫోన్ రికార్డులు, సినిమాల నుంచి పాటలను నేర్చుకోవడంతో పాటు జానపద గీతాలు, సంగీతాన్ని కూడా ఒంటబట్టించుకున్నారు. దాదర్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన గీతా రాయ్, లతా మంగేష్కర్‌ల వృత్తి జీవితం యాదృచ్చికంగా ఒకే రకమైన సంఘటనతో ప్రారంభమైంది. రైలులో తనలో తాను పాడుకుంటున్న లత పాట విని ప్రముఖ సంగీత దర్శకుడు గులాం హైదర్ ఆమెకు అవకాశం కల్పిస్తే, గీత తన నివాసంలో బాల్కనీలో నిల్చుని పాడుతున్న సమయంలో కింద వీధి వెంట వెళ్తున్న సంగీత దర్శకుడు పండిట్ హనుమాన్ ప్రసాద్ ఆ పాట విని ఆమెకు నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు. ఆ విధంగా గీతా దత్, లతా మంగేష్కర్లు ఇద్దరూ కూడా తమ వృత్తి జీవితం ప్రారంభంలో సంగీత దర్శకుల ద్వారా గుర్తించబడి అటు తర్వాత అంచెలంచెలుగా పైకి ఎదిగారు. అయితే, గీత విషయంలో ఈ రకమైన ఎదుగుదల అనేది చాలా తొందరగా అంటే, 1946లోనే చోటు చేసుకుంది!
ఈ క్రమంలో 1946వ సంవత్సరంలో పండిట్ హనుమాన్ ప్రసాద్ సంగీత సారథ్యంలో పౌరాణిక చిత్రమైన భక్త ప్రహ్లాద చిత్రం కోసం గీతా రాయ్ తొలిసారిగా నేపథ్య గాయనిగా మారారు. ఈ చిత్రం కోసం ఆమె ఆలపించిన అబ్ జానీ రే పెహచానీ రే; సునో సునో విన్టీ హమారీ అనే రెండు పంక్తులు ఆమెను ఏమాత్రం గుర్తింపు లేని ఒక పాఠశాల అమ్మాయి స్థాయి నుంచి ఒక గొప్ప నేపథ్యగాయని స్థాయికి తీసుకువెళ్లాయి. దీంతోపాటు సునో సునో హరి కి లీల, జాగ్ ఉతే హమ్ జాగ్ ఉతే అనే రెండు కోరస్ గీతాలను కూడా ఆమె పాడారు. ఇక 1946లో విడుదలైన మరికొన్ని చిత్రాల్లో సైతం నేపథ్య గాయనిగా ఆమె తన ప్రతిభను చాటారు. హనుమాన్ ప్రసాద్ సంగీత సారథ్యంలో 1946లో నాలుగు చిత్రాలు విడుదల కాగా, వాటిలో రసీలి, నై మా చిత్రాల కోసం గీతా రాయ్ రెండు పాటలను పాడారు.
రసీలిలో నైనోన్ కి ప్యాలి సే హోటోన్ కి మదిర, నేహ లగాకే ముఖ్ మోద్ గయా అనే పాటలను ఆలపించిన ఆమె, నై మా చిత్రం కోసం ప్రముఖ నేపథ్య గాయకుడు పారుల్ ఘోష్‌తో కలిసి ఆజా రీ నిందియా ఆజా అనే లాలిపాట పాడారు. 1946 ప్రారంభంలో అసాధారణ సంగీత దర్శకుడు మాస్టర్ గులాం హైదర్ సంగీత సారథ్యంలో మెహతాబ్ నటించిన బైరామ్ ఖాన్ చిత్రం కోసం గీతా రాయ్ పాటలు పాడారు. ఇందులో భాగంగా వాలి సహాబ్ రాసిన జబ్ చాంద్ జవాన్ హోగా టాబ్ ఛాంద్నీ రాటోన్ మేన్ జన్నత్ కా సమా హోగా అనే పాటను ఆమె పాడారు. అప్పట్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేపథ్య గాయని శంషాద్ బేగంతో కలిసి గీతా రాయ్ ఈ పాటను పాడారు. షంషాద్ బేగం, గీతా రాయ్‌లు కలిసి పాడిన ఈ పాటలో గొంతు కలిపిన నసీమ్ బేగం, మునవ్వర్లు అటు తర్వాత పాకిస్థాన్ చిత్ర పరిశ్రమలో నేపథ్య గాయనిలుగా పేరు సాధించారు.
ఈ సమయంలోనే శంషాద్ బేగంతో గీతా రాయ్ స్నేహబంధం బలపడడంతో పాటు శంషాద్ బేగంను ఆమె ఆపా అని ఆప్యాయంగా పిలిచేవారు. ఈ రకమైన ఆప్యాయత కారణంగానే తాను కలిసి పనిచేసిన అత్యుత్తమ కళాకారుల్లో గీతా రాయ్ కూడా ఒకరని శంషాబాద్ ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇక పాటల విషయానికి వస్తే సర్కస్ కింగ్ చిత్రం కోసం అభయంకర్ జోషి, నాగేశ్వర్ రావ్ల ద్వయం స్వరపర్చిన ప్రీతి కిసీ కో నా ఛోడే పాటను గీతా రాయ్ ఆలపించారు. గీతా రాయ్‌కి సంబంధించి మొట్టమొదటగా విడుదలైన పాట ఇదేనన్నది కొందరి వాదన. దీని తర్వాత కాశ్మీర్ కి కలి చిత్రం కోసం హే కిష్ణే మేరీ హస్రాతన్ మేన్ ఆగ్ పాటను ఆమె ఆలపించారు. ఈ పాటను స్వరపర్చిన మాస్టర్ వితాల్ ఈ చిత్రంలో కథానాయకుడిగా కూడా నటించారు.
ఇక ఈ చిత్రంలోనే హాయ్ ఇస్ ప్యార్ నే దీవానా అనే యుగళ గీతాన్ని ఆమె మాస్టర్ వితాల్తో కలిసి పాడారు. రస్తాలో జాఫర్ ఖుర్షీద్ స్వరకల్పనలో గీతా రాయ్ పాడిన నయీ బహారెన్ ఆయీన్ అనే పాట ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఈ పాట మనకు పంకజ్ ముల్లిక్ ప్రఖ్యాత గీతం ఆయే బహర్ అహా అహా అహాను గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే, గీతా రాయ్ ఆలపించిన పాట సైతం అదే రకమైన పల్లవిని కలిగి ఉండడంతో పాటు దాని సంగీతం సైతం ఆ పాటలో లాగానే వేగంగా ఉంటుంది. దిలీప్ కుమార్ నటించిన చిత్రంగా మనం గుర్తుచేసుకునే మిలాన్, నటుడు అభి భట్టాచార్యకు మొదటి హిందీ చిత్రం, ఇది 1946లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విఖ్యాత బెంగాలీ సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాల్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో గీతా రాయ్ రెండు పాటలను పాడారు. అందులో ఒకటైన ఛాన్ మేన్ బజేగి బన్సూరియా అనే పాట మరుపురాని ఆ పాత మధురంగా నిలిచింది. ఇక ఈ చిత్రంలో గీత పాడిన మరో పాట తుమ్హే సాజన్ మనాయేన్ తుమ్ రూత్ జానా అనే పల్లవితో సాగుతుంది. నిజానికి, మిలాన్‌కు బెంగాలీ రూపమైన నౌకా దూబి చిత్రం కోసం కూడా ఆమె రెండు గీతాలను పాడారు. అయితే ఈ పాటలకు సంబంధించిన రికార్డులు అంత సులభంగా లభించే పరిస్థితి లేదు. దీని తర్వాతి సంవత్సరం కూడా గీతా రాయ్ వృత్తి జీవితం తీరిక లేకుండా గడిచింది. ఇందులో భాగంగా ఆమె 1947లో ఒక ఊపు ఊపిన నీల్ కమల్ (మధుబాల, రాజ్‌కపూర్ జంటగా నటించిన చిత్రం) చిత్రం కోసం సంగీత దర్శకుడు బి. వాసుదేవ్ సంగీత సారథ్యంలో అద్భుతమైన పాటలను ఆలపించారు. కింద పేర్కొన్న పాటలు గీతా రాయ్ గళం నుంచి జాలువారాయి.


