పామాయిల్ పరిశ్రమలో అంతరాయం
ఖమ్మం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలోని కొత్తబాయిలర్ మరోసారి అంతరాయానికి గురైంది. 15 రోజుల క్రితమే బాయిలర్‌లోని ఫైర్ బ్రిక్స్ కూలిపోగా తాజాగా మంగళవారం ఉదయం రోటరీచైన్ తెగిపోయింది. బాయిలర్‌లోకి వేడిని పుట్టించేందుకు ఖాళీ గెలలను బాయిలర్‌లో వేసి మండిస్తుంటారు. ఈ క్రమంలో బాయిలర్‌కు ఖాళీ గెలలను తీసుకువచ్చే కన్వేయర్ రోటర్చైన్ తెగిపోవడంతో బాయిలర్ మొత్తాన్ని నిలుపుదల చేశారు. దీంతో కొత్త బాయిలర్‌ను పూర్తిగా నిలుపుదల చేసి పాత బాయిలర్ ద్వారా స్టెరిలైజర్కు స్టీంను అందజేస్తున్నారు. ఈ విషయంపై ఫ్యాక్టరీ మేనేజర్ హరినాథ్‌బాబు మాట్లాడుతూ తరచూ ఇబ్బందులకు గురిచేస్తున్న బాయిలర్ వద్ద ఉన్న బంకరును మార్చి నేరుగా కన్వేయర్ నుంచే ఖాళీ గెలలను బాయిలర్‌లోకి వేసే డిజైన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కాగా, రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టిన ఆరు విత్తన కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు పరిహారంగా చెల్లించాలని కోరనుంది. ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్త సైదయ్య, ఉద్యాన శాఖ డిప్యూటీ డెరైక్టర్ మధు సహా పలువురి బృందం మూడు రోజుల పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పర్యటించి పలు కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినట్లు నిర్ధారించింది.
దీనిపై సమగ్ర నివేదికను రూపొందించింది. ఈ నివేదికను మంగళవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథికి అందజేసింది. ఖమ్మం జిల్లాలో జీవా అగ్రి జెనిటిక్స్ లిమిటెడ్‌కు చెందిన జేసీహెచ్-801 విత్తనాలను, గ్రీన్ ఎరా కంపెనీకి చెందిన సీఎస్-333 విత్తనాలను రైతులకు అంటగట్టారు. వరంగల్ జిల్లాలో జీవాతోపాటు ఆగ్రో జెనిసీడ్, క్రాప్ జెనిటిక్స్కు చెందిన బేలా-2205, క్యామ్‌సన్ సీడ్స్ లిమిటెడ్‌కు చెందిన పెన్నార్, లక్కీ సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన అంజనీ, మహా నంది కంపెనీకి చెందిన మహాతేజ మిరప విత్తనాలను విక్రయించారు. ఈ విత్తనాల్లో సగానికిపైగా నకిలీ విత్తనాలు ఉన్నట్లు శాస్త్రవేత్తల బృందం తేల్చింది. నకిలీ విత్తన న మూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపి, పూర్తి వివరాలను తేల్చనున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎంత మంది రైతులు నష్టపోయారనే అంశాలను జిల్లా కలెక్టర్లు నిర్ధారిస్తారని శాస్త్రవేత్తల బృందం నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నష్టపోయిన రైతులు మిరప విత్తనాలు, సాగు కోసం ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేశారని, ఈ మేరకు పరిహారం చెల్లించాలని సూచించినట్లు సమాచారం.
దీనిని కంపెనీల నుంచే వసూలు చేయాలని, నకిలీ విత్తనాలు విక్రయించిన డీలర్లనూ బాధ్యులను చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక నకిలీ విత్తనాలు విక్రయించే వారికి కఠిన జైలుశిక్ష, జరిమానాలు విధించేలా విత్తన చట్టాన్ని తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వమే పరిశోధన, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని చేపట్టాలని, హైబ్రిడ్ కాకుండా సూటి రకాలను తయారుచేసి రైతులకు అందజేయాలని, విత్తనాలపై రైతులను చైతన్యం చేయాలని పేర్కొన్నట్లు తెలిసింది. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలన్నీ కూడా నకిలీ అడ్రస్‌లు ఇచ్చి లెసైన్సులు పొందాయి. ఆయా చిరునామాల్లో అధికారులు దాడులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. ఇలా అడ్రస్ లేకుండా నడిపించే విత్తన కంపెనీలకు ఎలా లెసైన్సులు ఇచ్చారనేది తేలడం లేదు.
లంచం తీసుకుని లెసైన్సులు ఇస్తున్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నకిలీ విత్తనాల బాగోతం బయటపడడంతో కొన్ని కంపెనీల యజమానులు, కొందరు డీలర్లు పరారీలో ఉన్నారు. కొందరు కంపెనీ ప్రతినిధులు, డీలర్లు ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులను కలిసి తమను ఆదుకోవాలని కోరినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో వ్యవసాయశాఖకు చెందిన కొందరు అధికారులను కూడా వారు కలిసి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు
ఖమ్మం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అశ్వారావుపేటలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మంగళవారం బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, మహాన్యాస రుద్రాభిషేకం, మండపారాధన, చండీపారాయణ, సహస్రనామ కుంకుమార్చన, లలిత సహస్రనామం తదితర పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నేడూరు వెంకటశర్మ పర్యవేక్షించారు.


