పారిశుద్ధ్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
ఏలూరు, సెప్టెంబర్ 4 (న్యూస్టైమ్): ప్రతీ గ్రామంలో ప్రజలకు రక్షిత త్రాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన జరిగిందని ప్రతీ పంచాయతీలో ఒక యజ్ఞంలా ఈ కార్యక్రమాలను అమలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతి అధికారి యల్. శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఏలూరులోని జిల్లా ప్రజాపరిషత్తు సమావేశ మందిరంలో రెండురోజులుపాటు జరిగే గ్రామపంచాయతీలలో త్రాగునీరు పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన కార్యాచరణ ప్రణాళికపై శిక్షణా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రతీ గ్రామంలో ప్రజలకు సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్య పరిస్ధితులు మెరుగుపరచడానికి గ్రామ స్ధాయి కమిటీలను ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన చెప్పారు.
ఈ కమిటీకి సర్పంచ్ అధ్యక్షులుగా ప్రతీ పంచాయతీలో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయా గ్రామాలలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు తీసుకోవాలని శ్రీధర్ రెడ్డి కోరారు. జిల్లాలో గత ఏడాది ప్రతీ మండలంలో ఒక పంచాయతీ ఆదాయ వ్యయాలను ఆన్లైన్లో పొందుపరిచామని దీనివల్ల నూరు శాతం పన్నుల వసూళ్లు చేయగలిగినట్లు శ్రీధర్ రెడ్డి చెప్పారు. జిల్లాలో గ్రామ పంచాయతీలలో పన్నుల రూపంలో 30 కోట్ల రూపాయలు వసూలు చేయాలని చెబుతున్నారని అయితే ప్రతీ పంచాయతీలో ఆస్ధిపన్ను సక్రమంగా వసూలు చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడితే 100 కోట్ల రూపాయలవరకూ గ్రామపంచాయతీల ఆదాయం పెరుగుతుందని శ్రీధర్ రెడ్డి చెప్పారు.
జిల్లాలోని పంచాయతీల్లో 8 లక్షల ఇళ్లు అసెస్మెంట్ అయి ఉన్నాయని ఇప్పటివరకూ కేవలం 50 వేల అసెస్మెంట్లు మాత్రమే ఆన్లైన్ చేసారని కొన్ని ఇళ్లకు తక్కువపన్ను మరికొన్ని ఇళ్లు అసలు అసెస్మెంట్ లేకుండా ఉన్నాయని చాలాగ్రామాలలో పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని వాటికి గతంలో ఇంటిపన్ను వసూలు చేసినట్లే క్రొత్త భవనాలకు కూడా అదేపన్ను వసూలు చేస్తున్నారని ఇలాఅయితే పంచాయతీల ఆదాయం ఎలా పెరుగుతుందని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా పన్నుల విధానాన్ని పరిశీలించి కట్టడాల ఆధారంగా పన్ను హెచ్చింపు చేయాలని ఆయన చెప్పారు.
ప్రతీ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్ధితులు మెరుగుపరచడానికి చెత్త సేకరించే మూడు చక్రాల బండ్లను ఏర్పాటుచేస్తున్నామని 200 జనాభాకు ఒక పారిశుద్ధ్య కార్మికుడిని ఏర్పాటుచేసి ఇంటింటా చెత్త సేకరణ చేపట్టాలని సేకరించిన చెత్తను ప్రత్యేక డంపింగ్ యార్డుకు తరలించాలని శ్రీధర్ రెడ్డి చెప్పారు. జిల్లా ప్రజాపరిషత్తు సిఇఓ కె. సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో దశలవారీగా అండర్ గ్రౌండు డ్రైయినేజీ విధానాన్ని అమలు చేస్తామని ప్రస్తుతం పల్లె ప్రాంతాలలో సిమెంటు రోడ్ల నిర్మాణానికి పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. ఆర్డబ్ల్యుయస్ యస్ఇ అమరేశ్వరరావు మాట్లాడుతూ పల్లె ప్రాంతాలలో త్రాగునీటి నాణ్యత పరిరక్షణకు తాగునీటి సరఫరా పధకాలను రోజువారీ పరిశీలన చేయాలని ఈ మేరకు సర్పంచ్ అధ్యక్షతన ముగ్గురుతో ప్రతీ గ్రామంలో ఒక బృందాన్ని ఏర్పాటుచేసామని చెప్పారు.
మంచినీటి టాంకుల తనిఖీ, పంపులు, వాల్వ్ ఛాంబర్లు, నీటి ఫోర్స్ పరిశీలన, క్లోరినేషన్ జరుగుతున్న తీరు, వీధికుళాయిలు, చేతిపంపులు, బోరుబావుల వద్ద నీటినిల్వలు లేకుండా చూడాలని ఎక్కడైనా తాగునీటి పైపులు లీకేజీ ఉంటే తక్షణమే మరామ్మత్తులు చేయించాలని డ్రైయిన్లలో పూడిక తొలగించాలని అమరేశ్వరరావు చెప్పారు. సమావేశంలో పంచాయతిరాజ్ యస్ఇ సి. వేణుగోపాల్, శిక్షణాతరగతుల రిసోర్స్ పర్సన్, సామర్లకోట యంపిడిఓ నాగలక్ష్మి, జిల్లా శిక్షణా మేనేజరు జి. ప్రసంగిరాజు, బి. ప్రభాకరరావు, ఏలూరు డియల్పిఓ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


