పాలకులు విద్యార్థులైన వేళ…
- 72 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
గుంటూరు, అక్టోబబర్ 5 (న్యూస్‌టైమ్): అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబునాయుడు ఎప్పుడూ తన వినూత్న ఆలోచనలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇటు ప్రజల సమస్యల గురించి ఆలోచించడంలోనే కాదు… అటు పార్టీ కార్యక్రమాల ద్వారానూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచే ప్రయత్నంచేస్తుంటారు. ఇప్పుడంటే అధికారంలో ఉండి ఇతర పార్టీల నుంచి నేతలను ఆకట్టుకోవచ్చు గానీ, తొమ్మిదేళ్లు విపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని బలహీనపడకుండా కాపాడుకోవడంలో ఆయన కార్యాచరణ సామాన్యమైనది కాదు.
తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయిన వారికీ గుంటూరుజిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణా తరగతులు కూడా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టినీ ఆకట్టుకుంటోంది. చంద్రబాబును రాజకీయంగా విమర్శించేవాళ్లను పక్కనపెడితే ఆయన ప్రయత్నం బావుందన్న వారి శాతం చాలానే ఉందని చెప్పాలి. ఏపీ రాష్ట్ర సర్కారులో కీలకంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలూ ఎంతో చిత్తశుద్ధితో తాజా రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమానికి హాజరై నేర్చుకుంటుండడం చూస్తుంటేనే చంద్రబాబు ‘విజన్’ ఏమిటో అర్ధమవుతోంది.
ప్రజల్ని ప్రభావితం చేసే వారు ఏదైనా చెబుతుంటే ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అపార రాజకీయ అనుభవం ఉన్న అలాంటి వారంతా తాజాగా విద్యార్థులుగా మారిపోయారు. రాజకీయాల గురించి, పాలనా విధానాల గురించి నిత్యం బిజీగా ఉండే వారిప్పుడు సరికొత్త సాంకేతిక అంశాలపై అధ్యయనం మొదలు పెట్టారు. స్కూల్లో పిల్లాడు ఎంత సీరియస్‌గా పాఠాలు వింటాడో అచ్చం అలా మారిపోయారు. పాలనాపరమైన నిర్ణయాలతో బిజీగా ఉండాల్సిన వారు ఎందుకిలా మారారంటే దానికి కారణం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయమే. ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన రియల్‌టైమ్ పాలన డ్యాష్ బోర్డు, కైజాలా యాప్‌లకు సంబంధించి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించే శిక్షణ శిబిరాన్ని కేఎల్ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రారంభించారు.
దీంతో వర్సిటీలోని కంప్యూటర్ ల్యాబ్ కొత్త కళను సంతరించుకుంది. నిత్యం విద్యార్థులతో నిండి ఉండే ల్యాబ్ కాస్తా బుధవారం అందుకు భిన్నంగా రాజకీయ ప్రముఖులతో నిండి కొత్త దృశ్యం ఆవిష్కృతమైంది. తలపండిన రాజకీయ నేతలకు వారి రాజకీయ అనుభవంలో సగం వయసు లేనోళ్లంతా పాఠాలు చెప్పటం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కడైనా సందేహాలు వస్తే వినయంగా అడిగి తెలుసుకుంటున్నారు. వయస్సులో దాదాపు అందరూ అర్ధ సెంచరీలు దాటినా అప్పుడే పాఠశాలలో చేరిన విద్యార్థుల్లా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చేస్తున్నది ఇదే! తొలుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శిబిరం ఏర్పాట్లను పరిశీలించారు.
కేంద్ర మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు, రాష్ట్ర మంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, పరిటాల సునీత, డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, డాక్టర్ పి. నారాయణ, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు వంటి హేమాహేమీలు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొని కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం పాలన మొత్తాన్ని అధికారులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యవేక్షించేలా కోర్ డ్యాష్, కైజాలా యాప్‌లను సిద్ధం చేసింది. వీటిల్లో ఆయా శాఖలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని నిక్షిప్తిం చేస్తారు.
వీటిని ట్యాబ్‌ల్లో ఇన్స్టాల్ చేసి ప్రజాప్రతినిధులకు అందజేయనున్నారు. వీటి ద్వారా వారు ఆయా శాఖల్లో సూక్ష్మస్థాయిలో ఏం జరుగుతోందో కూడా తెలుసకునే అవకాశం ఉంది. ఓ పక్క శిక్షణ కార్యక్రమం చాలా బిజీగా జరుగుతున్నా కొందరు నాయకులు సోషల్ మీడియాలో పెట్టేందుకు సెల్ఫీలను తీసుకోవడం మర్చిపోకపోవడం కొసమెరుపు!


