పెరుగుతున్న సామాన్యుని అసహనం
చలామణీలో ఉన్న పెద్ద నోట్లు రద్దై ముప్పై ఆరురోజులు గడిచినా పేద,మధ్య తరగతి జీవితాల్లో వెలుగు పూలు పూయలేదు.వచ్చిన నోటల్లా దొడ్డిదోవలో పెద్దోళ్లు తన్నుకుపోతుంటే సామాన్యులు తప్పు చేసిన వారిలా క్యూ ల్లో నిలబడి తిప్పలు తప్పేదెప్పుడో అంటూ ఉసూరుమంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 760 పైచిలుకు వివిధ బ్యాంకులకు సంబంధించి శాఖలుండగా, 800కు పైగా ఎటియం కౌంటరున్నాయి.
దాదాపు అన్ని బ్యాంకుల్లోను సోమ్ములు డ్రా చేసుకునేందుకు సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. స్ధానికంగా బ్యాంకింగ్ వ్యవస్ధ చెప్పేదానికీ, వాటన్నిటినీ పర్యవేక్షించే రిజర్వ్ బ్యాంకు చెప్పే దానికీ పొంతన లేక ఐటీ,సీబీఐ దాడుల్లో రూ.కోట్ల కొద్దీ సొమ్ము పట్టుబడుతుంటే ముక్కున వేలేసుకునే పరిస్ధితిలో సామాన్యుడున్నాడు తప్ప పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం పేద, మధ్య తరగతి ప్రజల దౌర్భాగ్యంగా పలువురు పేర్కొంటున్నారు.
నెలాఖరు వస్తే ఏదో ఒరిగిపోతుందన్న ప్రధాని మోదీ పెట్టిన యాబై రోజుల గడువుకు చేర్పులే తప్ప మార్పులేమీ జరగబోవని సాధారణ పౌరుడే జోస్యం చెబుతుంటే ఇంకా వేచి చూడాలన్న ధోరణిలో అధికార పార్టీ ప్రభుత్వాలు రెండూ నమ్మబలడం వింతగా ఉందన్న విమర్శలు రావడం చెంపపెట్టుగానే కన్పిస్తోంది.చిల్లర సంక్షోభంతో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం అవసరమైన సొమ్ము లేక యమయాతనలు పడుతూ తాత్కాలింగా కూడా ఆదుకునే నాధుడు కరువై కడుపు మంటతో అలమటిస్తున్నారు.
ఈ విషయం బయటకు చెప్పుకోలేక ఇళ్ల అద్దెలు చెల్లించలేక, కడుపునిండా భార్యాపిల్లలకు అన్నం పెట్టలేని దీనావస్ధలో కాలం గడుపుతున్నారు. ఇంట్లో బియ్యం నిండుకుని పాత బకాయిలు చెల్లించక కిరాణా షాపులో అరువు ఇవ్వనంటే ఏటీఎంల నుంచి చాలీచాలకుండా వచ్చే డబ్బులతో సతమతం అవుతున్నా అధికార్లు,పాలకులు వీర లెవెల్లో నగదు రహితంపై ఉపన్యాసాలిచ్చి సహనాన్ని పరీక్షిస్తున్నారనే బాధ వెళ్లగక్కుతున్నారు.ఇక రోజు కూలీ అయితే ఎప్పటిదప్పుడే పరగడుపుగా పూట నెట్టుకు రావడమే గగనంగా మారి బిక్షాటనకు సైతం వెనుకాడని స్ధితి గ్రామాల్లో నెలకొన్నాయి. పని ఇచ్చేవాడి వద్ద కూడా పైసలు లేక,అన్నీ మూసుకు కూర్చున్నారు.
పుండు మీది కారంలా గ్రామాల్లో చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు ఉత్పత్తులు ఆపి ఇరవై రోజులు దాటింది.అన్నం పెట్టే వృత్తులన్నీ అటకెక్కాయి. బలవంతంగా చేసుకుని కూర్చున్నా ఉత్పత్తులు మార్కెట్లోకి వెళ్లే మార్గాలు మూసుకుపోయి కుటుంబలో ఉన్న వారి కడుపులు నింపగలిగితే చాలనుకుంటున్నారు. ఉన్న వారిలో కాస్తంతగా ఊపిరి తీసుకుంటున్న వారు ప్రభుత్వోద్యోగులు మాత్రమేనని అదికూడా ఉద్యోగం ఉందన్న భరోసాతో అప్పు పుట్టడమో, తరువాత తీర్చే షరతులతో కూడిన నమ్మకమో వెరసి వ్యాపారుల నుంచి సరుకులు కొనుగోలు చేసుకోగలుగుతున్నారంటున్నారు.
చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లో చేసే రోజువారీ కూలీలు పనికోల్పోతే ప్రైవేటు చిరుద్యోగులు ఏకంగా ఉపాధినే కోల్పోయి రోజలు లెక్కపెడుతున్నారు. వీటికి తోడు పరువు సమస్యతో కొన్ని పరిశ్రమలు మూత పెట్టకుండా పని కల్పించినా నలుగురికి కలిపి ఎందుకూ కొరగాని రూ.2 వేలు నోటు ఇస్తుంటే అది చూసి మురిసిపోవాల్సిందే తప్ప న్యాయంగా బద్దలవటం లేదు. దీంతో అవసరం ఉన్నా లేకపోయినా అక్కర్లేని సరుకులు కొనుక్కుంటూ వీలుకాకపోతే పెద్ద నోటుకు రూ. రెండొందలు కోల్పోతూ అక్రమ వ్యాపారులకు కట్టబెడుతున్నారు.
ఇలా ఏ కోణంలో చూసినా అన్ని వర్గాలు అతలాకుతలమవుతుంటే వచ్చే నెల తీర్చే షరతుతో రేషన్ ఉచితంగా ఇచ్చినా మిగిలిన సరుకులకు చేతిలో చిల్లి గవ్వలే పచ్చిపులుసే ఆధరువుగా చేసుకుని అదే పరమాన్నంగా భుజిస్తున్నారు. వెరసి నోట్లు తెచ్చిన తంటా అంతా ఇంతాకాదు పసి పిల్లలకు పాలు సైతం పోయలేనంత భయంకర పరిస్ధితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
తొంబై శాతం ఏటీఎంల్లో బ్యాంక్ అధికారులు క్యాష్ పెట్టడం మానేసి అప్పుడే వారం కావస్తోంది. పెట్టినా తగినంతగా పెట్టకపోవడంతో క్యూ ల్లో నిలుచున్న చివరి వ్యక్తికి అందనంతగా ఏటీఎం కేంద్రాల్లో కాసేపటికే ‘నో క్యాష్’ బోర్డులు వేలాడుతున్నాయి. ఇందుకు నగరాలు, పల్లెలన్న వ్యత్యాసం లేకుండా ఒకే తరహాలో దర్శనమిస్తూండటంతో అందరూ బ్యాంకులు కిటకిటలాడుతూ ఈతి బాధలే అనుభవిస్తున్నారు. ధరలు పెంచినా సహిస్తాంగానీ చేతిలో డబ్బులు లేకుండా చేయడాన్ని తీవ్రంగానే పరిగణిస్తామని మథన పడుతున్నారు.


