పోలవరంతో వృధాకు అడ్డుకట్ట!
పోలవరం ప్రాజెక్టు పుణ్యమాని గోదావరి మిగులు జలాల వృధాకు కొంత వరకు అడ్డుకట్టపడనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందు నుంచి, వచ్చాక ఊపందుకున్న నీటి ప్రాజెక్టుల తర్వాత కూడా సముద్రంలోకి వృధాగా పోతున్న వరద, మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడంపై అడుగులు వేస్తున్నారు. నదుల అనుసంధానం అనే పదం దేశంలో ఇప్పుడు త్వరితగతిన ప్రాచుర్యం పొందుతోంది. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం నదుల అనుసంధాన కార్యక్రమాలకు ఇస్తూవస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు దోహదం చేస్తుండవచ్చు. ఈ అనుసంధాన ప్రక్రియకు ఈ నెలలోనే తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అంకురార్పణ జరిగింది. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ఉద్దేశించిన పట్టిసీమ ప్రాజెక్టును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పూర్తి చేసి, గోదావరి నీళ్ళను కృష్ణలో కలిపి రికార్డు వ్యవధిలో ఆ పని పూర్తి చేశానని సగర్వంగా ప్రకటించింది.
అనేకానేక బాలారిష్టాలను దాటుకుంటూ పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసినట్టు ప్రభుత్వం అయితే ఆర్భాటంగా చెప్పుకుంటోంది. కాని ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి వున్నాయి. ఎవరి అనుమానాలు వారికి వున్నాయి. ఉండడమే కాదు వాటిని బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు కూడా. చెప్పిన గడువులోగా పని పూర్తిచేసిన ఘనతను తన ఖాతాలోకి వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కొంత అనవసర ప్రయాస పడ్డదేమో అనికూడా అనిపిస్తోంది. తొందరగా పనిపూర్తి చేసి సకాలంలో పొలాలకు నీళ్ళు అందించే ప్రయత్నం హర్షించతగ్గదే. ములుకోల చేత పట్టి అధికారగణాన్నీ, కాంట్రాక్టర్లను అదిలించకపోతే పనులు ముందుకు సాగని మాట వాస్తవమే. అయితే ఇటువంటి భారీ ఇంజినీరింగు వ్యవహారాల్లో కొన్ని సాంకేతికపరమైన వ్యవధానాలతో పనులు చక్కబెటు ్టకోవాల్సిన అవసరం వుంటుంది.
రాత్రికి రాత్రి కాలువలు తవ్వించడం వీలయినట్టు, గడువులు నిర్దేశించి ఆక్విడక్టు నిర్మాణాలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలా వీలు కాదని, నీళ్ళు ఒదిలిన వెంటనే కూలిపోయిన ఆక్విడక్టు కథేచెబుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనే చర్చ కన్నా, ఇటువంటివి జరగకుండా చేయడంలో బాధ్యత వహించి పనిచేయడం అనేది బాధ్యత కలిగిన ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. కాకపొతే భారీ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కొన్ని ఇటువంటి అవాంతర పరిస్థ్తితులు తలెత్తడం సహజం కూడా. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకుపోవాలి. మంత్రులు, అధికారుల మీదా, అధికారులు, కాంట్రాక్టర్ల మీదా నెపాలు మోపుకుంటూ సమస్యను సాగదీయడం తగనిపని. ఇక ప్రతిపక్షాలు యాగీ చేయకుండా వూరుకోవడం ఇలాటి సందర్భాల్లో అసాధ్యం. వాటికి ఆ నైతిక హక్కు లేదనడం ఒకప్పుడు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇటువంటి ఆరోపణలే చేసిన పాలక పక్షానికి తగదు. సరే! ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న రాజకీయాల తీరు తెన్నులే ఆ విధంగా వున్నప్పుడు చెబితే వినేవారు ఉంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది. పొతే, అసలు నదుల అనుసంధానం అనే ప్రక్రియ మీదనే జాతీయ స్థాయిలో పుంఖానుపుంఖాలుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ఆహా ఓహో అని ప్రశంసిస్తూ వుంటే మరికొందరు దండగమారి వ్యవహారం అని ఎద్దేవా చేస్తున్నారు.
మరికొందరు పర్యావరణ ప్రేమికులు ఏకంగా నదుల అనుసంధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఒక వాదం మంచిదనీ, మరో వాదం చెడ్డదనీ చెప్పలేని పరిస్థితి. ప్రతి విషయంలో మంచీ చెడూ రెండూ ఉన్నట్టే ఇదీ అందుకు మినహాయింపు కాకపోవచ్చు. కాకపోతే ఈ మంచి చెడుల నడుమ పైకి కనబడని ఓ సన్నని విభజన రేఖ వుంటుంది. దాన్ని పట్టుకోగలిగితే మంచిని పెంచుకుంటూ, చెడు తీవ్రతని తగ్గించుకుంటూ మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు. నదులనేవి ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో పారి మరెక్కడో సుదూరాన కడలిలో కలుస్తుంటాయి. అవి ప్రవహించే దారిలో తమ దాపున వున్న పల్లపు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ వెడతాయి. ఆ నదీ పరీవాహక ప్రాంతంలో వున్న ప్రదేశాలు వాటి ఉనికికి అనుగుణంగా ప్రయోజనం పొందుతాయి. నీరు పల్లమెరుగు అనే సామెతకు తగ్గట్టుగా ఎగువ ప్రాంతాలకన్నా దిగువన వుండే ప్రాంతాలకు లబ్ది ఎక్కువ చేకూరుతుంది. ఇది ఆయా ప్రాంతాలకు ప్రకృుతి ప్రసాదించే వరం, శాపం కూడా.
అయితే తద్విరుద్ధంగా భారీ మోటార్లు వాడి పంపుల ద్వారా ఎగువ ప్రాంతాలకు కూడా నీరును తోడిపోసే సాంకేతిక ప్రక్రియలు ఉపయోగించి పట్టిసీమ వంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. దేశంలో వున్న వేలాది నదుల్లో కొన్ని మాత్రమే జీవనదులు. చాలావరకు వర్షాధారంగా పారే నదులు. అందువల్ల వీటిని అనుసంధానం చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించవచ్చనీ, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని పంటపొలాలకు మళ్ళించవచ్చనీ అనుసంధాన ప్రక్రియ మద్దతుదార్లు అంటున్నారు. అయితే ఇదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన అయితే కాదు. ఎన్నో దశాబ్దాల క్రితమే కాటన్ దొర వంటి వారు దీన్ని ప్రయోగాత్మకంగానే కాదు శాశ్వత ప్రాజెక్టులు నిర్మించి మరీ రుజువు చేసారు. ఆయన హయాంలోనే గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం జరిగింది. అలాగే, గంగా కావేరీ అనుసంధానం చేయాలని ఎన్నో ఏళ్ళ నాడే ప్రముఖ ఇంజినీరు కేఎల్ రావు తలపోసి ప్రణాళికలు కూడా సిద్ధం చేసారు. అలాటి ఆలోచనలే నేటి పాలకులు చేస్తున్నారు.
ఇందుకోసం జాతీయ స్థాయిలో నదీనదాల అనుసంధానానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం వీటిని పూర్తి చేయడానికి అక్షరాలా పదకొండు లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. అంచనాలే ఈ స్థాయిలో వుంటే ఈ భారీ పథకాలు పూర్తయ్యేనాటికి ఇవి ఏమేరకు పెరుగుతాయన్నది అంత సులభంగా అంచనా వేయలేని వ్యవహారం. ఇక ఈ ప్రాజెక్టు గణాంకాలు చూస్తే కళ్ళు చెదురుతాయి. నీరు సమృద్ధిగా పారే 37 హిమనదాలను నీటి లభ్యత తక్కువగా వుండే దేశంలోని ఇతర నదులతో కలిపి వాటిని కూడా స్వయం సమృద్ధ జలవనరులుగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో భాగంగా నదులను కలుపుతూ, యాభై నుంచి వంద అడుగుల వెడల్పున్న 30 కాలువలను పదిహేను వేల కిలోమీటర్ల పొడవున తవ్వుతారు. చిన్నా పెద్దా అన్నీ కలిపి మూడువేల రిజర్వాయర్లు నిర్మిస్తారు. తద్వారా ఎనిమిది కోట్ల డెబ్బయి లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. దీనికి తోడు, మొత్తం 34 గిగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి మార్గం వేస్తారు. నిజంగా కళ్ళు చెదిరే ప్రాజక్టే. సరిగ్గా అమలు చేయకపోతే, అంతకంటే నిజంగా అంతంత ప్రజాధనం నీళ్ళ పాలు చేసే ప్రాజక్టే.అయితే ఇదొక పార్శ్వం.
ఇది రంగుల కల. నిజం అయితే, నిజం చేయ గలిగితే అంతకంటే కావాల్సింది లేదు. మరోవైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు దీన్ని పీడకలగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిణామాలు భయంకరంగా ఉంటాయని, పూర్తి బాధ్యతారాహిత్యంతో కూడిన ఆలోచన అనీ కొట్టిపారేస్తున్నారు. నదులు ప్రవహించే తీరు ప్రకృతికి అనుగుణ్యంగా ఉంటుందనీ, దానికి విఘాతం కల్పించడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు సిద్ధించినప్పటికీ దీర్ఘకాలంలో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుందనీ వారి వాదన. ఏ నదికి ఆ నది కొన్ని ప్రత్యేకతలు కలిగి వుంటుంది. పొడవైన కాలువలు తవ్వి వాటిని కలిపే ప్రయత్నంలో, నదుల నడుమ వున్న రక్షిత అటవీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతాయి. ప్రకృతికి కొన్ని సహజ లక్షణాలు వుంటాయి. వాటిని విధ్వంసం చేయాలని చూస్తే విలయ కారకమవుతాయి అనేది హెచ్చరికతో కూడిన వారి అభిప్రాయం. జలవనరులను కాపాడుకోవడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గం కాదు.
వాటర్ షెడ్స్, వర్షాల వల్ల సమకూరే నీటిని భవిష్యత్ అవసరాలకు భద్రపరచుకోవడం, భూగర్భ జలవనరులను పెంచుకోవడం, ఇంకుడు గుంతలు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు పండించే పద్ధ్దతుల్ల్లో మార్పులు చేసుకోవడం ఇలా అనేక ప్రత్యామ్నాయాలు వుంటాయి. వాటిన న్నింటినీ పూర్తిగా వాడుకున్న తరువాతనే నదుల అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టులను తలపెట్టాలన్నది వారి మనోగతం. ప్రభుత్వాలు నడిపేవారికి వారి ఆలోచనలు వారికి వుంటాయి. సమాజ హితంతో పాటు సొంత రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకోకతప్పదు. పర్యావరణ పరిరక్షకులకి వీటితో నిమిత్తం వుండదు. వారిది ఒకటే కోణం. మరి మధ్యే మార్గం ఏమీ ఉండదా! ఎందుకుండదూ… వుండే వుంటుంది. కాకపొతే, వెతుక్కునే ఓపిక వుండాలి. వినే తీరిక వుండాలి.


