పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గురించి తెలుసుకుందాం…
- 85 Views
- wadminw
- January 9, 2017
- Home Slider అంతర్జాతీయం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ఇది నాలుగు అంచెల నౌక. మొదటి, మూడో దశలలో ఘన ఇంధనాన్ని 2, 4వ దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు. భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను, చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-1, అదే విధంగా మంగళయాన్‌ను కూడా పీఎస్ఎల్వీ ప్రయోగించింది.
ఇప్పటివరకు చేపట్టిన 26 పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 23 కార్యాచరణ ప్రయోగాలు. 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్ఎల్వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 25 ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పీఎస్ఎల్వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి.
త్వరలో ఫ్రాన్సుకు చెందిన స్పాట్-7, ఇతర 4 విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ అనుసంధానంతో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలో ఇస్రో సఫలమైంది. ఇస్రో ఇప్పటి వరకూ 28 సార్లు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ద్వారా అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించింది వీటిలొ 26 విజయవంతం అయ్యాయి . 2014 దాకా పీఎస్ఎల్వీ ద్వారా 71 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వీటిలో 40 విదేశీ, 40 స్వదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని కూడా పీఎస్ఎల్వీ ద్వారానే ప్రయోగించారు.
పీఎస్ఎల్వీ ద్వారా అంతరిక్ష ప్రయోగాలు
1987 – విఫలమైన మొదటి ఎస్ఎల్వీ ప్రయోగం (ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్).
1993 – పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ద్వారా ఐఆర్ఎస్-1ఈ ప్రయోగం. ఇది విఫలమైంది.
1994 – పీఎస్ఎల్వీ ద్వారా ఐఆర్ఎస్-పీ2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
1996 – పీఎస్ఎల్వీ -డీ3ని ఉపయోగించి ఐఆర్ఎస్-పీ3ను కక్ష్యలో ప్రవేశపెట్టారు.
2005 – మ్యాపింగ్ ప్రక్రియలకు ఉద్దేశించిన కార్టోశాట్-1ను, హ్యామ్ రేడియో సేవల కోసం హ్యామ్‌శాట్‌ను పీఎస్ఎల్వీ-సీ6 ద్వారా ప్రయోగించారు.
2008 – పీఎస్ఎల్వీ-సీ10 ద్వారా ఇజ్రాయెల్ శాటిలైట్ టెక్సార్ ప్రయోగం. పీఎస్ఎల్వీ-సీ9 ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో రెండు భారత్‌వి, ఎనిమిది విదేశాలకు చెందినవి.
2008 – పీఎస్ఎల్వీ -సీ11 ద్వారా చంద్రయాన్-1ను ప్రయోగించారు.
2009 – పీఎస్ఎల్వీ- సీ12 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రీశాట్-2), అన్నా యూనివర్సిటీకి చెందిన అనుశాట్‌ను ప్రయోగించారు.
2010 – పీఎస్ఎల్వీ -సీ15 వాహక నౌక ద్వారా కార్టోశాట్-2బి, స్టడ్‌శాట్‌లతోపాటు మూడు విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించారు.
2011 – పీఎస్ఎల్వీ-సీ16 ద్వారా రిసోర్‌సశాట్-2, యూత్‌శాట్, ఎక్స్‌శాట్ ప్రయోగం. ఇవికాకుండా జీశాట్-12, మేఘ ట్రాపిక్స్ ఉపగ్రహ ప్రయోగాలు.
2012 – ఫ్రెంచ్ శాటిలైట్ స్పాట్-6, జపాన్ శాటిలైట్ ప్రోయిటెరస్ ప్రయోగం. వీటిని పీఎస్ఎల్వీ-సీ21 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ఇస్రో 100వ అంతరిక్ష ప్రయోగం.
2013 – పీఎస్ఎల్వీ-సీ20 రాకెట్ ద్వారా సరళ్ అనే భారత్-ఫ్రెంచ్ శాటిలైట్‌ను ఫిబ్రవరి 25న ప్రయోగించారు. ఇది సముద్రాలను అధ్యయనం చేస్తుంది. సరళ్‌తోపాటు ఆరు విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు.
2013 – పీఎస్ఎల్వీ-సీ22 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ అనే నావిగేషన్ శాటిలైట్‌ను జూలై1న ప్రయోగించారు.
2013 – పీఎస్ఎల్వీ-సీ25 ద్వారా మొదటి ఇండియా మార్స్ ఆర్బిటరీ మిషన్ ను నవంబర్ 5 న ప్రయోగించారు.
2014 – పీఎస్ఎల్వీ-సీ24 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1బి అనే నావిగేషన్ శాటిలైట్‌ను ఏప్రల్ 4 న ప్రయోగించారు.
2014 – పీఎస్ఎల్వీ-సీ23 ద్వారా స్పొట్ 7 తోపాటు వాలుగు విదేశీ శాటిలైట్లను కూడా ప్రయోగించారు.
2014 – పీఎస్ఎల్వీ-సీ26 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి అనే నావిగేషన్ శాటిలైట్‌ను అక్టోబర్ 16 న ప్రయోగించారు.


